వరంగల్: ఏటా నిర్వహించే సైన్స్‌ఫేర్‌లో ఎవరూ చేయని అద్భుతాన్ని ఆవిష్కరించాలనుకున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఫిజికల్‌సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మడ్క మధు. అతడి దృఢ సంకల్పానికి విద్యార్థుల ఆసక్తి తోడైంది. దీంతో నోటితో మాట్లాడకుండా, చెవితో వినకుండా కళ్ల సైగలతో, చెవుల కదలికలతో మాట్లాడే ఓ లిపిని విద్యార్థులు, ఉపాధ్యాయుడు కలిసి తయారు చేశారు. విద్యార్థుల ప్రతిభను చూసి 'గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాహ్ శభాష్' అంటూ అభినందించారు. విద్యార్థుల్ని, టీచర్‌ను ప్రత్యేకంగా సన్మానించారు.
మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆకుతోట మల్లిక, సల్పాల దేవిక, ఆరెందుల రాజశేఖర్, మద్దిరాల శివ నవదీప్, సల్పాల నందిని, సల్పాల సంకీర్తన ‘ఐ’ కోడింగ్, ‘ఇయర్’ కోడింగ్‌లో ఉపాధ్యాయుడు మధు వద్ద శిక్షణ పొంది ప్రతిభ కనబరుస్తున్నారు. వీటితోపాటు గారడి, ఐబ్రోస్ (కనుబొమ్మలు)సైగలతో భావవ్యక్తీకరణ జరుపుతున్నారు. లిప్(పెదవు)ల మూవ్‌మెంట్‌ను బట్టి మాట్లాడింది చెప్పేస్తున్నారు. విద్యార్థులు వీటిపై మరింత శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే పాఠశాలలో 10 మందికి పైగా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయుడు మధు శిక్షణ ఇస్తున్నారు.
ఏంటీ ఈ లిపి..?
‘ఐ’కోడింగ్ అంటే కను సైగలతో మాట్లాడడం. ఏ, బీ, సీ, డీ ఒక్కో అక్షరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వీటిని కనుసైగలతో వ్యక్తీకరిస్తారు. చెవుల కదలికలతో సైతం భావాల్ని వ్యక్తపరుస్తున్నారు. దీనికీ ప్రత్యేకంగా ఓ లిపిని తయారు చేశారు. ఐ, ఇయర్ కోడింగ్ భాష దేశ రక్షణకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సీబీఐ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, రా ఇతర నిఘావర్గాలకు ఈ లిపి ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయుడు మధు, విద్యార్థులు చెబుతున్నారు.
ఒక పేపర్‌లో ఉన్నది చదివి విద్యార్థి నోటిని తెరవకుండా కళ్లు మూస్తూ.. తెరుస్తూ... మీదకు, కిందికి ఎగరేస్తూ.. చెవులను కదిలిస్తూ సైగలతో భావాల్ని వ్యక్తీకరిస్తే.. మరో విద్యార్థి ఆ సైగలు చూసి పొల్లుపోకుండా పేపర్‌పై రాసి చూపిస్తుంది. విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని చేతిలో ఏముందో చెబుతూ మంత్రాలు, తంత్రాలు లేవని గ్రామీణులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు.
దేశ రక్షణకు ఉపయోగం..
గవర్నర్ కితాబిచ్చారు..
‘చెవులను కదిలించడం జంతువులకే సాధ్యం అలాంటిది మీరు చేస్తున్నారంటే గ్రేట్’ అని గవర్నర్ మేడమ్ కితాబిచ్చారు. మా టీచర్ల ప్రోత్సాహంతో బాగా శిక్షణ పొందుతున్నాం. మేం, మా భాష దేశ రక్షణకు ఉపయోగపడితే చాలు. పోలీస్ జాబ్ చేయాలనేది నా కోరిక. – శివ నవదీప్, ఎనిమిదో తరగతి
మరిచిపోలేని అచీవ్‌మెంట్..
ఐ కోడింగ్ గురించి మా గైడ్ టీచర్ మధు చెప్పారు. ఆసక్తితో నేర్చుకున్నాను. ఈ భాషను భవిష్యత్‌లో దేశానికి ఉపయోగపడేలా సాధన చేస్తాం. గవర్నర్ మేడమ్ మమ్మల్ని మెచ్చుకోవడం మరిచిపోలేని అచీవ్‌మెంట్. – ఆకుతోట మల్లిక, పదో తరగతి
ప్రపంచంలో ఎక్కడా లేని భాష..
సైన్స్‌ఫేర్‌లో కొత్తగా ఉండాలని ఐ, ఇయర్ కోడింగ్ రెండు ప్రత్యేక భాషలు ఎంచుకున్నా. దీనికి ప్రత్యేకంగా లిపిని తయారు చేశా. దీనికి మాప్రాంతంలో మంచి ఆదరణ వస్తోంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఈ భాష లేదని అనుకుంటున్నా. గవర్నర్‌ను విద్యార్థులతో కలవడం మరిచి పోలేం. విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి దేశానికి ఉపయోగపడేలా చేయాలనేది నా లక్ష్యం. ఇంకా గారడి, ఐబ్రోస్, లిప్ మూవ్‌మెంట్‌పై సాధన జరుగుతోంది. – మడ్క మధు, ఫిజికల్‌సైన్స్ ఎస్‌ఏ, మహదేవపూర్
Comments
Please login to add a commentAdd a comment