Euro tournament
-
ఇంగ్లండ్ ఫినిషింగ్ టచ్
డార్ట్మండ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 58 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెర దించేందుకు ఇంగ్లండ్ జట్టుకు మరో అవకాశం లభించింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో ఇంగ్లండ్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌తో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ తరఫున కెపె్టన్ హ్యారీ కేన్ (18వ ని.లో), ఓలీ వాట్కిన్స్ (90+1వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు సిమోన్స్ (7వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. 1966లో ఏకైక ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన ఇంగ్లండ్ ఆ తర్వాత అంతర్జాతీయ వేదికపై మరో టైటిల్ గెలవలేకపోయింది. 2020 యూరో టోర్నీలో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరినా ఇటలీ జట్టు చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నెదర్లాండ్స్‌తో సెమీఫైనల్ మ్యాచ్ అదనపు సమయానికి దారి తీయడం ఖాయమనిపించిన దశలో... స్టాపేజ్ ఇంజ్యూరీ టైమ్‌లో (90+1వ నిమిషంలో) సబ్‌స్టిట్యూట్ ఓలీ వాట్కిన్స్ గోల్ సాధించి ఇంగ్లండ్‌ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత మరో మూడు నిమిషాలు నెదర్లాండ్స్‌ను నిలువరించిన ఇంగ్లండ్ విజయాన్ని ఖరారు చేసుకుంది. నిర్ణీత సమయంలో పలు కారణాలతో రిఫరీ ఆటను నిలిపివేయాల్సి వచ్చినపుడు అలా వృథా అయిన సమయాన్ని 90 నిమిషాల తర్వాత స్టాపేజ్ ఇంజ్యూరీ టైమ్‌గా జత చేస్తారు. ఇంగ్లండ్, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు అద నంగా నాలుగు నిమిషాలు జోడించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ హెడ్ కోచ్ గ్యారెత్ సౌత్‌గేట్ తీసుకున్న సమయోచిత నిర్ణయం విజయవంతమైంది. తొలి గోల్ చేసిన ఇంగ్లండ్ కెపె్టన్ హ్యారీ కేన్‌ను 81వ నిమిషంలో వెనక్కి రప్పించి అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా ఓలీ వాట్కిన్స్‌ను... మిడ్‌ఫీల్డర్ ఫిల్ ఫోడెన్ స్థానంలో కోల్ పాల్మెర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి పంపించారు. పది నిమిషాల తర్వాత సౌత్‌గేట్ నిర్ణయం సరైనదేనని తేలింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన పాల్మెర్, వాట్కిన్స్ అద్భుత సమన్వయంతో రెండో గోల్ సాధించి పెట్టారు. కుడి వైపు నుంచి పాల్మెర్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో వాట్కిన్స్ అందుకొని కళ్లు చెదిరే కిక్‌తో నెదర్లాండ్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టించి బంతిని లక్ష్యానికి చేర్చడంతో ఇంగ్లండ్ శిబిరం సంబరాలు చేసుకుంది. -
అల్బేనియా అదుర్స్
► రొమేనియాపై 1-0తో గెలుపు ►యూరో టోర్నీలో తొలి విజయం ► గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా ఫ్రాన్స్ లిలీ (ఫ్రాన్స్): అవకాశం కల్పిస్తే పసికూనలుగా భావించే జట్లు కూడా అద్భుతాలు చేస్తాయని అల్బేనియా జట్టు నిరూపించింది. కేవలం 29 లక్షల జనాభా ఉన్న అల్బేనియా యూరో టోర్నీ చరిత్రలో తొలిసారి అర్హత పొంది తమ ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రూప్ ‘ఎ’లో తాము ఆడిన తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోయిన అల్బేనియా... చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్ రొమేనియా జట్టుపై 1-0తో సంచలన విజయం సాధించి నాకౌట్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 42వ స్థానంలో ఉన్న అల్బేనియా జట్టు ఓ ప్రధాన టోర్నమెంట్లో గోల్ చేయడం, విజయం సాధించడం ఇదే ప్రథమం. ఈ గెలుపుతో అల్బేనియా గ్రూప్ ‘ఎ’లో మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అన్ని గ్రూప్‌ల లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాకే అల్బేనియా జట్టుకు నాకౌట్ దశలో పోటీపడే అవకాశం లభిస్తుందో లేదో తెలుస్తుంది. తమకంటే మెరుగైన జట్టు రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో అల్బేనియా అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలిచింది. ఆట 43వ నిమిషంలో కుడి వైపు నుంచి లెడియన్ మెముషాజ్ కొట్టిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అర్మాండో సాదికు హెడర్ షాట్‌తో గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి అల్బేనియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో రొమేనియా స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా అల్బేనియా పట్టుదలతో పోరాడి ప్రత్యర్థి జట్టుకు నిరాశను మిగిల్చింది. ఈ ఓటమితో రొమేనియా జట్టు యూరో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. తొలిసారి ప్రిక్వార్టర్స్‌కు స్విట్జర్లాండ్: మరోవైపు గ్రూప్ ‘ఎ’లో తొలి ‘డ్రా’ నమోదు చేసుకున్న ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు ఏడు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో ‘డ్రా’గా ముగిసింది. ఒక విజయం, రెండు ‘డ్రా’లతో స్విట్జర్లాండ్ జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందింది. 56 ఏళ్ల యూరో టోర్నీ చరిత్రలో కేవలం నాలుగోసారి పోటీపడుతున్న స్విట్జర్లాండ్ నాకౌట్ దశకు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. క్రొయేషియాపై లక్ష యూరోల జరిమానా: చెక్ రిపబ్లిక్‌తో జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్ సందర్భంగా... క్రొయేషియా అభిమానులు బాణాసంచా కాల్చి మైదానంలో విసిరేసి ఆటకు అంతరాయం కలిగించినందుకు ఆ దేశ ఫుట్‌బాల్ సంఘంపై ‘యూరో’ నిర్వాహకులు లక్ష యూరోలు (రూ. 76 లక్షల 43 వేలు) జరిమానా విధించారు.