ఇంగ్లండ్‌ ఫినిషింగ్‌ టచ్‌ | England is in the Euro final for the second time in a row | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ ఫినిషింగ్‌ టచ్‌

Published Fri, Jul 12 2024 4:44 AM | Last Updated on Fri, Jul 12 2024 4:44 AM

England is in the Euro final for the second time in a row

సబ్‌స్టిట్యూట్‌ వాట్కిన్స్‌ గెలుపు గోల్‌

సెమీస్‌లో నెదర్లాండ్స్‌పై విజయంతో వరుసగా రెండోసారి ‘యూరో’ ఫైనల్లోకి ఇంగ్లండ్‌   

డార్ట్‌మండ్‌: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 58 ఏళ్ల టైటిల్‌ నిరీక్షణకు తెర దించేందుకు ఇంగ్లండ్‌ జట్టుకు మరో అవకాశం లభించింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో ఇంగ్లండ్‌ వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌తో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 2–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఇంగ్లండ్‌ తరఫున కెపె్టన్‌ హ్యారీ కేన్‌ (18వ ని.లో), ఓలీ వాట్కిన్స్‌ (90+1వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... నెదర్లాండ్స్‌ జట్టుకు సిమోన్స్‌ (7వ ని.లో) ఏకైక గోల్‌ అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్‌ తలపడుతుంది. 

1966లో ఏకైక ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ ఆ తర్వాత అంతర్జాతీయ వేదికపై మరో టైటిల్‌ గెలవలేకపోయింది. 2020 యూరో టోర్నీలో ఇంగ్లండ్‌ ఫైనల్‌కు చేరినా ఇటలీ జట్టు చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నెదర్లాండ్స్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌ అదనపు సమయానికి దారి తీయడం ఖాయమనిపించిన దశలో... స్టాపేజ్‌ ఇంజ్యూరీ టైమ్‌లో (90+1వ నిమిషంలో) సబ్‌స్టిట్యూట్‌ ఓలీ వాట్కిన్స్‌ గోల్‌ సాధించి ఇంగ్లండ్‌ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత మరో మూడు నిమిషాలు నెదర్లాండ్స్‌ను నిలువరించిన ఇంగ్లండ్‌ విజయాన్ని ఖరారు చేసుకుంది. 

నిర్ణీత సమయంలో పలు కారణాలతో రిఫరీ ఆటను నిలిపివేయాల్సి వచ్చినపుడు అలా వృథా అయిన సమయాన్ని 90 నిమిషాల తర్వాత స్టాపేజ్‌ ఇంజ్యూరీ టైమ్‌గా జత చేస్తారు. ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌కు అద నంగా నాలుగు నిమిషాలు జోడించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌ గ్యారెత్‌ సౌత్‌గేట్‌ తీసుకున్న సమయోచిత నిర్ణయం విజయవంతమైంది. తొలి గోల్‌ చేసిన ఇంగ్లండ్‌ కెపె్టన్‌ హ్యారీ కేన్‌ను 81వ నిమిషంలో వెనక్కి రప్పించి అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా ఓలీ వాట్కిన్స్‌ను... మిడ్‌ఫీల్డర్‌ ఫిల్‌ ఫోడెన్‌ స్థానంలో కోల్‌ పాల్మెర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి పంపించారు. 

పది నిమిషాల తర్వాత సౌత్‌గేట్‌ నిర్ణయం సరైనదేనని తేలింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన పాల్మెర్, వాట్కిన్స్‌ అద్భుత సమన్వయంతో రెండో గోల్‌ సాధించి పెట్టారు. కుడి వైపు నుంచి పాల్మెర్‌ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో వాట్కిన్స్‌ అందుకొని కళ్లు చెదిరే కిక్‌తో నెదర్లాండ్స్‌ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి బంతిని లక్ష్యానికి చేర్చడంతో ఇంగ్లండ్‌ శిబిరం సంబరాలు చేసుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement