అల్బేనియా అదుర్స్ | Albania Adhurs | Sakshi
Sakshi News home page

అల్బేనియా అదుర్స్

Published Tue, Jun 21 2016 12:07 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

అల్బేనియా   అదుర్స్ - Sakshi

అల్బేనియా అదుర్స్

రొమేనియాపై 1-0తో గెలుపు
యూరో టోర్నీలో తొలి విజయం
గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా ఫ్రాన్స్

 
 
లిలీ (ఫ్రాన్స్): అవకాశం కల్పిస్తే పసికూనలుగా భావించే జట్లు కూడా అద్భుతాలు చేస్తాయని అల్బేనియా జట్టు నిరూపించింది. కేవలం 29 లక్షల జనాభా ఉన్న అల్బేనియా యూరో టోర్నీ చరిత్రలో తొలిసారి అర్హత పొంది తమ ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రూప్ ‘ఎ’లో తాము ఆడిన తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోయిన అల్బేనియా... చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్ రొమేనియా జట్టుపై 1-0తో సంచలన విజయం సాధించి నాకౌట్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 42వ స్థానంలో ఉన్న అల్బేనియా జట్టు ఓ ప్రధాన టోర్నమెంట్‌లో గోల్ చేయడం, విజయం సాధించడం ఇదే ప్రథమం.

ఈ గెలుపుతో అల్బేనియా గ్రూప్ ‘ఎ’లో మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అన్ని గ్రూప్‌ల లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాకే అల్బేనియా జట్టుకు నాకౌట్ దశలో పోటీపడే అవకాశం లభిస్తుందో లేదో తెలుస్తుంది. తమకంటే మెరుగైన జట్టు రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో అల్బేనియా అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలిచింది. ఆట 43వ నిమిషంలో కుడి వైపు నుంచి లెడియన్ మెముషాజ్ కొట్టిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అర్మాండో సాదికు హెడర్ షాట్‌తో గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి అల్బేనియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో రొమేనియా స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా అల్బేనియా పట్టుదలతో పోరాడి ప్రత్యర్థి జట్టుకు నిరాశను మిగిల్చింది. ఈ ఓటమితో రొమేనియా జట్టు యూరో టోర్నీ నుంచి నిష్ర్కమించింది.


 తొలిసారి ప్రిక్వార్టర్స్‌కు స్విట్జర్లాండ్: మరోవైపు గ్రూప్ ‘ఎ’లో తొలి ‘డ్రా’ నమోదు చేసుకున్న ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు ఏడు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో ‘డ్రా’గా ముగిసింది. ఒక విజయం, రెండు ‘డ్రా’లతో స్విట్జర్లాండ్ జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందింది. 56 ఏళ్ల యూరో టోర్నీ చరిత్రలో కేవలం నాలుగోసారి పోటీపడుతున్న స్విట్జర్లాండ్ నాకౌట్ దశకు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.


 క్రొయేషియాపై లక్ష యూరోల జరిమానా: చెక్ రిపబ్లిక్‌తో జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్ సందర్భంగా... క్రొయేషియా అభిమానులు బాణాసంచా కాల్చి మైదానంలో విసిరేసి ఆటకు అంతరాయం కలిగించినందుకు ఆ దేశ ఫుట్‌బాల్ సంఘంపై ‘యూరో’ నిర్వాహకులు లక్ష యూరోలు (రూ. 76 లక్షల 43 వేలు) జరిమానా విధించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement