72 గంటల్లో సెకనుకు రెండు స్మార్ట్ఫోన్ల విక్రయం
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ షియోమి ఈ పండుగ సీజన్ లో దూసుకుపోతోంది. షియోమీ ఆన్ లైన్ అమ్మకాల్లో బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా షియోమీ ప్రకటించింది అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ టాటా క్లిక్ లాంటి ఇ-కామర్స్ సైట్ల ద్వారా 72 గంటల్లో ప్రతిసెకనుకు తమ స్మార్ట్ ఫోన్లు రెండు అమ్ముడుపోతున్నాయని ప్రకటించింది. గత ఏడాది పండుగ సీజన్ లో 5 లక్షల ఫోన్లను విక్రయించగా ఈ ఏడాది కేవలం మూడు రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామని షియోమి ఇండియా బిజినెస్ హెడ్ మను జైన్ తెలిపారు. ఆరు నెలల వ్యూహం, ముందస్తు ప్రణాళికతో చేసిన లాంచింగ్ లు దీనికి దోహదపడ్డాయని తెలిపారు. ఒక్క రోజులోనే రెండు లక్షల 70వేల మధ్యస్థాయి రెడ్ మీ 3ఎస్ స్మార్ట్ ఫోన్లు అమ్ముడు బోయాయన్నారు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే తమ విక్రయాలకు జోష్ పెంచిందన్నారు. అలాగే అమెజాన్ లో రెడ్ మీ నోట్ 3 టాప్ సెల్లింగ్ డివైస్ గా నిలిచిందని వెల్లడించారు.
ఇంత భారీ పరిమాణంలో డివైస్ లను అందించడానికి తమ తయారీ భాగస్వామి ఫాక్స్ కాన్ ఓవర్ టైం పని పనిచేసిందన్నారు. అయినప్పటికీ , అమెజాన్ లో ప్రస్తుతం తమ స్మార్ట్ ఫోన్లన్నీ ఔట్ ఆఫ్ స్టాక్ అని మను తెలిపారు.