చాలా కరెన్సీలతోనూ ‘బ్రేక్’ డ్యాన్సే!
న్యూఢిల్లీ: రూపాయి విలువ ఒక్క డాలరుతో మాత్రమే పాతాళానికి జారుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తోందంటే పొరపాటే. ప్రపంచంలోని ఇతర ప్రధాన కరెన్సీలన్నింటితో కూడా రూపాయి తుక్కుతుక్కు అవుతోంది. బ్రిటిష్ పౌండ్, యూరో, స్విస్ ఫ్రాంక్‌లతో పోలిస్తే అత్యంత ఘోరంగా కుప్పకూలింది. పౌండ్తో దేశీ కరెన్సీ 100 స్థాయిని ఇప్పటికే అధిగమించగా.. బుధవారం 106 దిగువకు పడిపోయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి జారిపోయింది.
యూరోతో 92, స్విస్ ఫ్రాంక్‌తో 75, కెనడా డాలర్‌తో 65, ఆస్ట్రేలియన్ డాలర్‌తో 60 కిందికి క్షీణించాయి. ఇంకా చాలా దేశాలన్నింటి కరెన్సీలు కూడా రూపాయిని ‘బ్రేక్’ డ్యాన్స్ ఆడిస్తున్నాయి. కువైట్ దినార్‌తో 240, బహ్రయిన్ దినార్‌తో 180, ఒమాన్ రియాల్‌తో 175 దిగువకు రూపాయి విలువ పడిపోయింది. విదేశీ పెట్టుబడుల తిరోగమనం, ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనం రూపాయిని దెబ్బకొడుతూవస్తున్నాయి.
వీటితో బలపడిందండోయ్...
రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీలతో కుప్పకూలుతుంటే.. కొన్ని దేశాలతో పోలిస్తే మాత్రం బలపడింది. అయితే, ఇవన్నీ అనామక దేశాలే! రూపాయి పుంజుకున్న జాబితాలో పనామా, టాంగో, సురినాం, తజికిస్థాన్, సాల్మన్ ఐలాండ్స్, సాల్వడార్, హైతి, కిర్గిస్థాన్, లైబీరియా, సిరియా, కాంగో, సోమాలియా, సియర్రా లియోన్ వంటివి ఉన్నాయి.
ప్రపంచంలో 8 దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ 100 కిందకి పడిపోయింది. యూరో, జోర్డాన్ దినార్లతో 90 కిందికి జారింది.
ఇక 50 దేశాల కరెన్సీలతో రూపాయి విలువ 50 దిగువకు క్షీణించడం గమనార్హం.
రూపాయితో పోలిస్తే అధిక మారకం విలువ గల దేశాలు ప్రపంచంలో 100కు పైగానే ఉన్నాయి.