ఆస్ట్రేలియాలో పేలిన శాంసంగ్ గెలాక్సీ నోట్-7..
మెల్బోర్న్ః ఆస్ట్రేలియాలో మళ్ళీ శాంసంగ్ ఫోన్ పేలడం కలకలం సృష్టించింది. హోటల్ గదిలో ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా బ్యాటరీ అకస్మాత్తుగా పేలడంతో ఓ వ్యక్తికి కొద్దిపాటి గాయాలయ్యాయి. ఇప్పటికే బ్యాటరీ పేలిపోతుండటంతో శాంసంగ్ కంపెనీ.. మార్కెట్ నుంచీ గెలాక్సీ నోట్ 7 సరుకుమొత్తాన్ని విత్ డ్రా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక సరఫరా అయిన ఫోన్లను సైతం వెనక్కి తీసుకున్న కంపెనీ.. వారికి ఆ స్థానంలో మరో మోడల్ ను ఇచ్చింది.
విక్టోరియా స్టేట్ కు చెందిన థామ్ హువా.. పశ్చిమ ఆస్ట్రేలియాను సందర్శించేందుకు వెళ్ళాడు. అక్కడ తాను బస చేసిన హోటల్ గదిలో నిద్రిస్తుండగా శాంసంగ్ గెలాక్సీ నోట్-7 పేలిందని, దాన్నుంచి మంటలు వ్యాపించడంతో బాధితుడు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాలనుబట్టి తెలుస్తోంది. తన ఫోన్ నిద్రిస్తున్న సమయంలో ఛార్జింగ్ పెట్టి ఉంచానని ఉన్నట్లుండి అది పేలడంతో మంటలు వ్యాపించాయని హువా టెక్నాలజీ ఫోరమ్ లో పోస్ట్ చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాటరీ పేలడంవల్ల వచ్చిన మంటలతో మొబైల్ ఫోన్ పూర్తిశాతం కాలిపోయినట్లు హువా వివరించాడు. నిద్రించే ముందు తన ఫోన్ ను మంచంమీద పెట్టి, ఛార్జింగ్ పెట్టానని, అయితే పేలిన థాటికి నిద్ర మేల్కొన్న తనకు ఫోన్.. కార్పెట్ పై మండుతూ కనిపించిందని తెలిపాడు.
ఆగస్లు 19న మొదటిసారి ఫోన్ ప్రారంభించిన అనంతరం ఇప్పటివరకూ 35 పేలిన కేసులు నమోదవ్వగా.. కంపెనీ ఇప్పటికే గెలాక్సీ నోట్-7 కొనుగోలు చేసిన వారందరికీ ముందు జాగ్రత్తలు చెప్పింది. ఫోన్ ఎట్టిపరిస్థితిలో ఆన్ చేయవద్దని, కంపెనీ వెనక్కు తీసుకునే వరకూ మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలని సూచించింది. అయితే ఆస్ట్రేలియాలోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కూడా తమ కస్టమర్లకు గెలాక్సీ నోట్-7 స్వీచాఫ్ చేసి ఉంచాలని ముందే సూచించామని చెప్తోంది. కాగా తనకు ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి అనుభవం కలగలేదని, కాలిన ఫోన్ ను న్యూస్ పేపర్ లో చుట్టి, జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టుకొని శాంసంగ్ స్టోర్ కు వెళ్ళి అడిగినా... సదరు ఫోన్ గురించి సిబ్బందికి కూడా ఎటువంటి అవగాహనా లేనట్లు కనిపించిందని హువా చెప్తున్నాడు. ఇప్పటివరకూ 37 మంది కస్టమర్లే వారి ఫోన్లలో బ్యాటరీలు పేలిపోయినట్లు రిటైల్ షాపుల్లో ఫిర్యాదు చేసినా.. విషయం ప్రపంచ వ్యాప్తం కావడంతో శాంసంగ్ కంపెనీ మొత్తం ఫోన్లను వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ నష్టం కంపెనీకి కోలుకోలేని దెబ్బ తీసింది.