నిర్భయ్.. నాలుగోసారీ విఫలం
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన నిర్భయ్ క్షిపణి ప్రయోగం నాలుగోసారి కూడా విఫలమైంది. అయితే ఈ విషయమై డీఆర్డీఓ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, బుధవారం ఒడిశాలోని చాందీపూర్‌లో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రయోగకేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. కానీ సాంకేతిక లోపాల కారణంగా ఇది విఫలమైందని సమాచారం. టేకాఫ్ వరకు బాగానే ఉన్నా.. అది వెళ్లాల్సిన మార్గం నుంచి అది పక్కకు పోయిందని అంటున్నారు. అది ఎక్కడైనా భూమ్మీద పడే ప్రమాదం ఉండటంతో.. దాన్ని మధ్యలోనే, ప్రయోగించిన కొద్ది నిమిషాలకే పేల్చేశారు.
ఆరు మీటర్ల పొడవైన నిర్భయ్ క్షిపణి.. 1500 కిలోల బరువు ఉంటుంది. ఇది వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించేలా దీన్ని తయారుచేశారు. ఇది సంప్రదాయ, అణు వార్ హెడ్లను కూడా మోసుకెళ్లగలదు. తొలిసారి దీన్ని 2013 మార్చి 12న ప్రయోగించగా, 20 నిమిషాల తర్వాత విఫలమైంది. 2014 అక్టోబర్ 17న చేసిన రెండో ప్రయోగం కూడా అది తగినంత ఎత్తు వెళ్లలేక విఫలమైంది. ఆ తర్వాత 2015 అక్టోబర్ 16న మూడోసారి చేసిన ప్రయోగంలో అది 128 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత.. బంగాళాఖాతంలోకి పడిపోయింది. ప్రస్తుతం భారత అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మోస్ కూడా అణు వార్హెడ్లను తీసుకెళ్లగలదు. కానీ అది 290 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. దాంతో దీర్ఘశ్రేణి క్షిపణి అవసరం అవుతుందని దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.