Fake IAS officer
-
ఐఏఎస్ అని చెప్పి పెళ్లి..
-
రైల్వేలో డీఈ, ఆపై జాయింట్ కలెక్టర్.. కట్ చేస్తే!
సాక్షి, మంచిర్యాలక్రైం: నకిలీ ఐఏఎస్ బర్ల లక్ష్మినారాయణ మోసాలు.. అక్రమాలకు అంతులేకుండా సాగింది. తక్కువ సమయంలో.. ఎక్కువ డబ్బు, హోదా సంపాదించాలన్న అతడి దురాశ.. తన తల్లిదండ్రులనే మోసం చేయించింది. తన మాటలకు కన్నవారు మోసపోయారు..! ఇక ఇతరులు మోసపోరా..? అనుకున్నాడో ఏమోగాని.. వెంటనే తన పథకాన్ని అమల్లోకి తెచ్చి చివరకు కటకటాల పాలయ్యాడు. ఈనెల 12న వెలుగులోకి వచ్చిన నకిలీ ఐఏఎస్ బర్ల లక్ష్మీనారాయణ (22) మంచిర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడి వివరాలను స్థానిక డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన బర్ల శంకరయ్య కుమారుడు లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లోని సిద్దార్థ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుండగా.. పాకెట్ మనీ కోసం సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఎస్బీఐ కార్డ్స్ డివిజన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. అదే సమయంలో రైల్వేలో ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు. తాను పరీక్షలో పాసయ్యాయనని, రైల్వేలో డీఈగా ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులను నమ్మించాడు. లక్ష్మినారాయణ చిన్నతనంలోనే మంచి ఉద్యోగం సాధించాడని పేర్కొంటూ గ్రామస్తులు, బంధువులు ఘనంగా సన్మానం కూడా చేశారు. తల్లిదండ్రులతో ఓ బ్రీజా కారు కొనిపించుకున్నాడు. అప్పటినుంచి జల్సాలకు అలవాటు పడ్డాడు. తల్లి దండ్రులను ఈజీగా నమ్మించి మోసం చేసిన లక్ష్మినారాయణ.. ఇలాగే ప్రజలను కూడా మోసం చేయొచ్చని భావించాడు. అప్పటినుంచే మోసాలకు తెరలేపాడు. ఏకంగా తాను ఐఏఎస్ అయ్యానని, జాయింట్ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని నమ్మించాడు. మంచిర్యాల జేసీగా ప్రచారం.. తనకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని, మంచిర్యాల రైల్వేస్టేషన్లో డీఈగా పని చేస్తున్నానని నమ్మించాడు. తన కారుకు బీర్పూర్కు చెందిన తాళ్లపెల్లి రమేష్‌ను డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. అతడికి నెలకు రూ.25వేలు వేతనంగా చెల్లించాడు. తాను సివిల్స్ పరీక్ష రాశానని, త్వరలోనే రిజల్ట్ వస్తుందని చెప్పాడు. 2020 డిసెంబర్లో తాను ఐఏఎస్‌గా సెలక్ట్ అయ్యానని, మంచిర్యాల జేసీగా పోస్టింగ్ ఇచ్చారని నమ్మ బలికాడు. దీంతో తన మకాం మంచిర్యాలకు మార్చాడు. జిల్లాకేంద్రంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్స్‌లో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగాడు. డ్రైవర్ రమేష్‌ను పర్మినెంట్ చేస్తానని చెప్పి అతడి నుంచి రూ.3 లక్షలు వసూలు చేశాడు. అప్పటి నుంచి రమేష్‌కు రూ.నెలకు 45వేల జీతం ఇచ్చాడు. రమేష్‌కు తెలిసిన మరో స్నేహితుడు దండేపల్లి మండలం రెబ్బెనపెల్లికి చెందిన మహేందర్‌ను పీఏ (పర్సనల్ అసిస్టెంట్)గా నియమించుకున్నాడు. రమేష్, మహేందర్‌లు తాము కలెక్టర్ వద్ద పనిచేస్తున్నామని గర్వంగా తమతమ ఊళ్లో చెప్పుకున్నారు. ఓ రోజు రమేష్, మహేందర్‌తో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తాను ఐఏఎస్ అయినందున పర్సనల్ కోటా కింద 30మంది వరకు ఉద్యోగాలు ఇప్పించే అవకాశం ఉంటుందని, ఎవరైనా ఉద్యోగం కోసం వస్తే తనవద్దకు పంపాలని నమ్మించాడు. ఆయన మాటలు నమ్మిన రమేశ్, మహేందర్ తమకు తెలిసిన వారికి ఈ విషయం చెప్పడంతో చాలామంది లక్ష్మినారాయణను ఆశ్రయించారు. వీరిలో కొందరి సర్టిఫికెట్లు పరిశీలించి.. కొంత ఖర్చు అవుతుందని చెప్పి సుమారు 29మంది నుంచి రూ.80 లక్షలు వరకు వసూలు చేశాడు. వీటితో రెండు విలువైన కార్లు, బుల్లెట్ బైక్, జగిత్యాలలో ఓ ఇళ్లు, ఓ ఓపెన్ స్లాబ్ కొనుగోలు చేశాడు. వెలుగు చూసిందిలా.. లక్ష్మీనారాయణ వ్యవహారంపై అనుమానం కలిగిన రమేష్ మంచిర్యాల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈనెల 12న లక్ష్మినారాయణ ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ ఐఏఎస్ బోర్డు, నల్ల కోటు కనిపించడంతో స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు బాధితులు కూడా పెద్ద సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు లక్ష్మినారాయణను శనివారం అరెస్ట్ చేసి.. అతడి నుంచి రెండు కార్లు, బుల్లెట్ బైక్, బాధితుల సర్టిఫికెట్స్, ఏడు రిజిస్టర్లు, రూ.2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అభినందించిన సీపీ, డీసీపీ, ఏసీపీ నకిలీ ఐఏఎస్‌ను పటుకున్న సీఐ ముత్తి లింగయ్య, ఎస్సై దేవయ్య, కిరణ్‌కుమార్‌ను సీపీ సత్యనారాయణ డీసీపీ, ఏసీపీ అభినందించారు. -
నకిలీ ఐఏఎస్ అరెస్ట్
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): నకిలీ ఐఏఎస్ అధికారి అవతారమెత్తి వసూళ్లకు పాల్పడుతున్న పెద్దాడ విజయలక్ష్మి అనే ఓ కిలాడీ లేడి కృష్ణాజిల్లా, హనుమాన్‌జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్‌నంటూ వసూళ్లు చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు సోమవారం విలేకరులకు వెల్లడించారు. రిటైర్డ్ ఐఏఎస్ సుజాతరావుగా నమ్మించి... గుంటూరు జిల్లా మంగళగిరిలోని మన్యం వారి వీధికి చెందిన పెద్దాడ విజయలక్ష్మి... పద్మభూషణ్ కేఎల్ రావు కుమార్తె, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.సుజాతరావు పేరుతో పలువురిని నమ్మించి కేఎల్ రావు విగ్రహ ఏర్పాటు పేరుతో వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఎలా చిక్కిందంటే.. హనుమాన్‌జంక్షన్‌లోని వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావుకు చెందిన సీతామహాలక్ష్మి నర్సింగ్ హోంకు ఈ నెల 8వ తేదీన ఓ కారులో వచ్చిన విజయలక్ష్మి తాను ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్ సుజాతరావునని, తాను తిరుపతి వెళుతున్నానని, పూజల కోసం రూ.3,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానించిన రామచంద్రరావు తనయుడు రవిశంకర్ నేరుగా కె.సుజాతరావుకు ఫోన్ చేయగా, తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ఆమె చెప్పారు. నకిలీ అధికారి ఫోటోలు తీసేందుకు యత్నించటంతో వెంటనే పరారయ్యారు. ఆ తర్వాత ఎస్పీ రవీంద్రబాబుకు కె.సుజాతరావు ఫోన్ చేసి నకిలీ అధికారిని పట్టుకోవాలని కోరారు. రవిశంకర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం రాత్రి ఆమెను విజయవాడలో పట్టుకున్నారు. టీడీపీతో కిలాడీ లేడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణలో వెల్లడించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో దిగిన ఫోటో ఆమె వద్ద పోలీసులకు లభించింది. -
అడ్డంగా బుక్కైన నకిలీ ఐఏఎస్
సాక్షి, విశాఖపట్నం : ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన గెదేల అనిల్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్‌నంటూ ఒక ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి అమాయకులను టార్గెట్ చేయడం ప్రారంభించాడు. ఇదివరకే భూ సెటిల్మెంట్లు చేస్తానని చెప్పి పలువురి దగ్గర సుమారు రూ. 9 లక్షలు తీసుకున్నట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో భూమి సమస్య పరిష్కరిస్తానంటూ అనిల్ నకిలీ ఐఏఎస్‌గా తనను తాను పరిచయం చేసుకొని ఓ వ్యక్తి వద్ద రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. బాధితునికి అనిల్ ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనిల్ కుమార్‌ను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి: విశాఖ ‘సిట్’ గడువు పెంపు) ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఒకరి అరెస్ట్ ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న శ్రీకాకులపు శ్రీనివాస్ అనే వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ కంపెనీలో ఏజీఎంగా ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెట్టి ఓ వ్యక్తి నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఈ మేరకు చర్య తీసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే మల్కాపురంతో పాటు విజయనగరం జిల్లా గరివిడి, విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లలోనూ చీటింగ్ కేసులు నమోదయ్యాయి. -
నకిలీ ఐఏఎస్ ఆటకట్టు
చాదర్‌ఘాట్: ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాదర్‌ఘాట్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా, నారాపల్లికి చెందిన సూరప్పగారి సంపత్‌కుమార్ (29) ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. 2011లో అతను ఢిల్లీలోని వజీరామ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. 2013లో పార్లమెంట్ లో కాంట్రాక్టు ప్రాతిపదినక పీఆర్ఓగా పని చేసేవాడు. ఆ సమయంలో అతడికి పార్లమెంట్లో బెనర్జీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా అతను ఐఏఎస్ అధికారులకు హడ్కో ద్వారా విల్లాలు మంజూరవుతున్నాయని, అందులో మధ్యవర్తిత్వం చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చునని సంపత్‌కుమార్‌కు తెలిపాడు. దీంతో తానే ఐఏఎస్ అధికారిగా మారితే ఎక్కువ మందిని నమ్మించవచ్చునని భావించిన సంపత్ పార్లమెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్నట్లు నకిలీ గుర్తింపు కార్డను తయారు చేసుకుని మోసాలకు శ్రీకారం చుట్టాడు. ఈ నేపథ్యంలో వరంగల్‌కు చెందిన రిటైర్డ్ పీపీ తన కుమార్తెకు మెడికల్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇప్పించాలని కోరుతూ సంపత్‌కు రూ.20 లక్షలు ఇచ్చాడు. అయితే పని పూర్తికాకపోవడంతో అతను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం నగరానికి మకాం మార్చిన సంపత్ కుమార్ మలక్‌పేట్‌కు చెందిన తన స్నేహితుడు వెంకన్నతో మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో మలక్‌పేట హరిహర క్షేత్రానికి వెళ్లిన వెంకన్నకు పూజారి ద్వారా వనస్థలిపురం ప్రాంతానికి చెందిన వ్యక్తితో పరిచయం పరిచయం ఏర్పడింది, సదరు వ్యక్తి వరంగల్‌లో గుడి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పడంతో వెంకన్న అతడికి రూ.60 వేలు విరాళంగా అందచేశాడు. ఇదే సందర్భంగా తనకు తెలిసిన ఐఏఎస్ ద్వారా బంజారాహిల్స్ ప్రాంతంలో రూ.3.5 కోట్ల విలువైన విల్లాను కేవలం రూ.1.5 కోట్లకే ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో సదరు వ్యక్తి తన బావమరిదికి విల్లా ఇప్పించాలని కోరుతూ రూ.1.38 కోట్లు సంపత్‌కుమార్‌కు ముట్టజెప్పాడు. అదేవిధంగా సదరు వ్యక్తి ఇంట్లో ట్యూటర్‌గా పనిచేస్తున్న మహిళకు డీఆర్డీఓలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.12 లక్షలు తీసుకున్నాడు. అయితే రోజులు గడిచిని విల్లా ఇప్పించకపోవడంతో బాధితుడు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సంపత్‌కుమార్ దిల్సుఖ్నగర్ లో ఉన్నట్లు సమాచారం అందడంతో సోమవారం అతడిని అరెస్ట్ చేశారు. అతడికి బెనర్జీ, వెంకన్న పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. నిందితుడి నుంచి ల్యాప్‌ట్యాప్, 4.7 తులాల బంగారం, రూ. వెయ్యి నగదు ఐదు డెబిట్, క్రెడిట్ కార్టులు స్వాధీనం చేసుకున్నారు. -
నేనెవరో తెలియదా నీకు?’ అంటూ... హల్చల్
అమలాపురం రూరల్ : పల్లె క్రాంతిలో భాగంగా గ్రామగ్రామానా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇదే అదునుగా ఓ నకిలీ ఐఏఎస్ హల్చల్ చేసిన వైనమిది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ లోని తాండవపల్లి యూపీ స్కూల్‌ను స్థానిక మండల వ్యవసాయాధికారి ఎన్వీవీ సత్యనారాయణ శుక్రవారం తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో సూటూ బూటూ వేసుకుని, ఆటోలో వచ్చిన ఓ వ్యక్తి తన పేరు దాకే శ్రీధర్ అని, ఐఏఎస్ అధికారినని ఐడీ కార్డు చూపించాడు. ‘నేనెవరో తెలియదా నీకు?’ అంటూ ప్రధానోపాధ్యాయుడు కేకేవీ నాయుడును ఏకవచనంతో సంబోధించాడు. ‘రికార్డులు చూపించండి. ఎంతమంది ఉపాధ్యాయులున్నారో అందరినీ నా ముందుకు రమ్మనండి. మధ్యాహ్న భోజనం ఏం చేస్తున్నారు? మీపై డీఈఓకు ఫిర్యాదు చేస్తాను’ అంటూ హడావుడి చేశాడు. అనుమానం వచ్చిన హెచ్ఎం అతడిని నిలదీశాడు. ఐడీ కార్డుపై ‘దాకే శ్రీధర్, డిఫెన్స్’ అని రాసి ఉంది. డిఫెన్స్‌కు పాఠశాలకు సంబంధమేమిటని, కావాలంటే డీఈఓతో మాట్లాడడండి.. ఫోన్ చేసి ఇస్తానంటూ హెచ్ఎం గదమాయించడంతో అతడు ఆటో ఎక్కి ఉడాయించాడు. కొంతసేపటికి చిందాడగరువు యూపీ స్కూల్‌కు వెళ్లాడు. డిఫెన్స్ అధికారినని, పాఠశాల తనిఖీకి వచ్చానని హడావిడి చేశాడు. ‘నేనొచ్చానని చెప్పి మీ ఎంఈఓను వెంటనే రమ్మనండి’ అంటూ దర్పం వెలగబెట్టాడు. అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు తాండవపల్లి స్కూల్ హెచ్ఎం నాయుడుకు కూడా విషయం చెప్పారు. అనుమానం వచ్చిన నాయుడు తాను వచ్చేవరకూ అతనిడిని అక్కడే ఉంచమని చెప్పారు. ఆయన వెళ్లేలోగానే ఆ వ్యక్తి ఉడాయించాడు. ఆ వ్యక్తి నాలుగు రోజుల క్రితం సమనసలోని ఓ పాఠశాలకు వెళ్లి సొమ్ములు డిమాండ్ చేసినట్టు సమాచారం. మొత్తమ్మీద నకిలీ ఐఏఎస్ వ్యవహారం సంచలనం రేపుతోంది. -
నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
హైదరాబాద్: నకిలీ ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరెడ్డి గుట్టును అల్వాల్ పోలీసులు శనివారం రట్టు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లి ఐఏఎస్ అధికారినంటూ రాఘవేంద్రరెడ్డి తనకు తాను పరిచయం చేసుకునే వాడు. అనంతరం వారితో పరిచయాలు పెంచుకుని... వారి పేర్లు ఉపయోగించుకునే వాడు. ఆ క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదవారికి పట్టాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి... నిరుద్యోగులు, పేదల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము దండుకుని అక్కడనుంచి పరారయ్యేవాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు రాఘవేంద్రరెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. అతడి బారిన పడిన వారిలో జంటనగరాలకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఉన్నారని సమాచారం. -
ఊచలు లెక్కిస్తున్న నకిలీ ఐఏఎస్
నకిలీ ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తి జైలు పాలయ్యాడు ఓ యువకుడు.నాంపల్లి ఎస్సై నిపుణ్ తెలిపిన వివరాల ప్రకారం... జార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగి నీరజ్ కుమార్ చతుర్వేది పట్టభద్రుడు. మూడేళ్ల క్రితం నకిలీ ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తారు. పుణే కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలను నిర్వహించాడు. ఏపీకి చెం దిన హార్టస్ కంపెనీ సీఈఓ రోహిత్‌కు ఒక రోజు రైలులో నీరజ్ కుమార్ చతుర్వేది ఐఏఎస్ అధికారిగా పరిచయం అయ్యారు. ఏవైనా పనులుం టే తన దృష్టికి తీసుకువస్తే చేసిపెడుతానని చెప్పాడు. ఇటీవల హార్టస్ కంపెనీకి ఆదాయపన్ను శాఖ అధికారులతో పన్ను చెల్లింపు విషయంలో తగాదా వచ్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు రోహిత్, నీరజ్ కు మార్ చతుర్వేదిని ఫోన్లో సంప్రదించారు. హైదరాబాదు శాంతినగర్‌లో ఉండే ఆదాయపు పన్న శాఖ కమిషనర్ డి.శ్రీనివాస్‌ను కలిసేం దుకు నీరజ్ కుమార్ చతుర్వేది వచ్చారు. డి.శ్రీనివాస్‌తో నీరజ్ కుమార్ చతుర్వేది తాను ఒక ఐఏఎస్ అధికారినంటూ పరిచయం చేసుకున్నారు. ఈ పరిచయంలో ఆదాయపు శాఖ కమిషనర్ డి.శ్రీనివాస్‌కు అనుమా నం వచ్చింది. వివరాలను సేకరిస్తే నకిలీ ఐఏఎస్ అధికారిగా తేలింది. దీంతో నాంపల్లి పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
నకిలీ ఐఏఎస్‌కు అరదండాలు
హైదరాబాద్ : ఐఏఎస్ అధికారినంటూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఆరు లక్షల రూపాయలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. వెంకట్రామిరెడ్డి అలియాస్ వెంకట్రామారావు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం వీఐపీ టికెట్లు ఇస్తానంటూ 14 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అందులో 6 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు.