చాదర్‌ఘాట్: ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాదర్‌ఘాట్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా, నారాపల్లికి చెందిన సూరప్పగారి సంపత్‌కుమార్ (29) ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. 2011లో అతను ఢిల్లీలోని వజీరామ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందాడు. 2013లో పార్లమెంట్ లో కాంట్రాక్టు ప్రాతిపదినక పీఆర్‌ఓగా పని చేసేవాడు. ఆ సమయంలో అతడికి పార్లమెంట్‌లో బెనర్జీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా అతను ఐఏఎస్ అధికారులకు హడ్కో ద్వారా విల్లాలు మంజూరవుతున్నాయని, అందులో మధ్యవర్తిత్వం చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చునని సంపత్‌కుమార్‌కు తెలిపాడు. దీంతో తానే ఐఏఎస్ అధికారిగా మారితే ఎక్కువ మందిని నమ్మించవచ్చునని భావించిన సంపత్ పార్లమెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్నట్లు నకిలీ గుర్తింపు కార్డను తయారు చేసుకుని మోసాలకు శ్రీకారం చుట్టాడు.
ఈ నేపథ్యంలో వరంగల్‌కు చెందిన రిటైర్డ్ పీపీ తన కుమార్తెకు మెడికల్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇప్పించాలని కోరుతూ సంపత్‌కు రూ.20 లక్షలు ఇచ్చాడు. అయితే పని పూర్తికాకపోవడంతో అతను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం నగరానికి మకాం మార్చిన సంపత్ కుమార్ మలక్‌పేట్‌కు చెందిన తన స్నేహితుడు వెంకన్నతో మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో మలక్‌పేట హరిహర క్షేత్రానికి వెళ్లిన వెంకన్నకు పూజారి ద్వారా వనస్థలిపురం ప్రాంతానికి చెందిన వ్యక్తితో పరిచయం పరిచయం ఏర్పడింది, సదరు వ్యక్తి వరంగల్‌లో గుడి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పడంతో వెంకన్న అతడికి రూ.60 వేలు విరాళంగా అందచేశాడు. ఇదే సందర్భంగా తనకు తెలిసిన ఐఏఎస్ ద్వారా బంజారాహిల్స్ ప్రాంతంలో రూ.3.5 కోట్ల విలువైన విల్లాను కేవలం రూ.1.5 కోట్లకే ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో సదరు వ్యక్తి తన బావమరిదికి విల్లా ఇప్పించాలని కోరుతూ రూ.1.38 కోట్లు సంపత్‌కుమార్‌కు ముట్టజెప్పాడు. అదేవిధంగా సదరు వ్యక్తి ఇంట్లో ట్యూటర్‌గా పనిచేస్తున్న మహిళకు డీఆర్‌డీఓలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.12 లక్షలు తీసుకున్నాడు. అయితే రోజులు గడిచిని విల్లా ఇప్పించకపోవడంతో బాధితుడు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సంపత్‌కుమార్ దిల్‌సుఖ్‌నగర్ లో ఉన్నట్లు సమాచారం అందడంతో సోమవారం అతడిని అరెస్ట్ చేశారు. అతడికి బెనర్జీ, వెంకన్న పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. నిందితుడి నుంచి ల్యాప్‌ట్యాప్, 4.7 తులాల బంగారం, రూ. వెయ్యి నగదు ఐదు డెబిట్, క్రెడిట్ కార్టులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment