నేనెవరో తెలియదా నీకు?’ అంటూ... హల్‌చల్
అమలాపురం రూరల్ : పల్లె క్రాంతిలో భాగంగా గ్రామగ్రామానా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇదే అదునుగా ఓ నకిలీ ఐఏఎస్ హల్‌చల్ చేసిన వైనమిది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ లోని తాండవపల్లి యూపీ స్కూల్‌ను స్థానిక మండల వ్యవసాయాధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ శుక్రవారం తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో సూటూ బూటూ వేసుకుని, ఆటోలో వచ్చిన ఓ వ్యక్తి తన పేరు దాకే శ్రీధర్ అని, ఐఏఎస్ అధికారినని ఐడీ కార్డు చూపించాడు. ‘నేనెవరో తెలియదా నీకు?’ అంటూ ప్రధానోపాధ్యాయుడు కేకేవీ నాయుడును ఏకవచనంతో సంబోధించాడు.
‘రికార్డులు చూపించండి. ఎంతమంది ఉపాధ్యాయులున్నారో అందరినీ నా ముందుకు రమ్మనండి. మధ్యాహ్న భోజనం ఏం చేస్తున్నారు? మీపై డీఈఓకు ఫిర్యాదు చేస్తాను’ అంటూ హడావుడి చేశాడు. అనుమానం వచ్చిన హెచ్‌ఎం అతడిని నిలదీశాడు. ఐడీ కార్డుపై ‘దాకే శ్రీధర్, డిఫెన్స్’ అని రాసి ఉంది.
డిఫెన్స్‌కు పాఠశాలకు సంబంధమేమిటని, కావాలంటే డీఈఓతో మాట్లాడడండి.. ఫోన్ చేసి ఇస్తానంటూ హెచ్‌ఎం గదమాయించడంతో అతడు ఆటో ఎక్కి ఉడాయించాడు. కొంతసేపటికి చిందాడగరువు యూపీ స్కూల్‌కు వెళ్లాడు. డిఫెన్స్ అధికారినని, పాఠశాల తనిఖీకి వచ్చానని హడావిడి చేశాడు. ‘నేనొచ్చానని చెప్పి మీ ఎంఈఓను వెంటనే రమ్మనండి’ అంటూ దర్పం వెలగబెట్టాడు.
అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు తాండవపల్లి స్కూల్ హెచ్‌ఎం నాయుడుకు కూడా విషయం చెప్పారు. అనుమానం వచ్చిన నాయుడు తాను వచ్చేవరకూ అతనిడిని అక్కడే ఉంచమని చెప్పారు. ఆయన వెళ్లేలోగానే ఆ వ్యక్తి ఉడాయించాడు. ఆ వ్యక్తి నాలుగు రోజుల క్రితం సమనసలోని ఓ పాఠశాలకు వెళ్లి సొమ్ములు డిమాండ్ చేసినట్టు సమాచారం. మొత్తమ్మీద నకిలీ ఐఏఎస్ వ్యవహారం సంచలనం రేపుతోంది.