ఫసల్‌బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జేడీఏ సుచరిత
కరీంనగర్‌అగ్రికల్చర్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేడీఏ సుచరిత తెలిపారు. పంట రుణం తీసుకున్న, తీసుకోని రైతులు ఈ నెల 31 వరకు బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించేందుకు గడువుందని తెలిపారు. జిల్లాలో బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు పంటల బీమా చేస్తున్నారని పేర్కొన్నారు.
పంట కోతల అనంతరం తుపాను, తుపానుతో కూడిన వర్షాలు, అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టానికి ఈ పథకంలో బీమా కల్పించినట్లు తెలిపారు. మూడవ విడత రుణమాఫీలో సగం నిధులను అన్ని బ్యాంకులకు విడుదల చేయడం జరిగిందని, రైతులు పంట రుణాలను రెన్యువల్ చేసుకోని ఫసల్‌బీమాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరి ఎకరానికి రూ.560, మొక్కజొన్నకు రూ.400, కందులకు రూ.260, పెసరకు రూ.200, వేరుశనగకు రూ.320, మిర్చికి రూ.1250, పసుపుకు రూ.990 ప్రీమియం చెల్లించాలని తెలిపారు.