‘మోదీగారూ.. కశ్మీర్ ఆక్రందన వినండి’
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఆందోళన చేస్తున్న ప్రజల ఆవేదనను వినాలంటూ.. ఫాతిమా షహీన్ అనే ఎన్నారై యువతి (17) ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘డియర్ పీఎం, కశ్మీరీల కోసం మనం ఆలోచించినట్లయితే.. వారికి బయటి ప్రపంచంతో సంబంధాలను తెంచేసి (ఇంటర్నెట్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపేయటం) వారి హక్కులను నిరోధించే వాళ్లం కాదు’ అమెరికాలోని జార్జియాలో ఉంటున్న ఫాతిమా లేఖలో పేర్కొన్నారు.
జూలై 10న కశ్మీర్ లోయలోని తన బంధువుల ఇంటికి వచ్చానని.. అసలు లోయలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న సంగతి తనకు తెలియదన్నారు. ‘కశ్మీర్ (భూభాగం) అందరికీ కావాలి. కానీ కశ్మీరీల సంగతి మాత్రం ఎవరికీ పట్టదా?’ అని లేఖలో ప్రశ్నించారు.