రాబందులు చిక్కేనా?
కలెక్టరేట్ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుం బాల కోసం ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తోంది. ఇటు పౌరసరఫరాల శాఖ అధికారులతోపాటు అటు ఎఫ్‌సీఐ అధికారులు కుమ్మక్కవడం వల్ల ఈ పథకం పేదోడికన్నా పెద్దోళ్లకే ప్రయోజనం చేకూరుస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అర్సపల్లిలో పీ డీఎస్ బియ్యం పట్టుబడడంతో ఈ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఈనెల 14వ తేదీన నగరంలోని అర్సపల్లి ప్రాంతం లో గల ఓ రైస్‌మిల్లుపై పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలి సిందే. లారీలో ఉన్న 202 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కనిపించడంతో మిల్లును సీజ్ చేశా రు. ఆ మిల్లులో 1,381 క్వింటాళ్ల ధాన్యం, 273 క్వింటాళ్ల బియ్యం, 4 క్వింటాళ్ల నూకలు ఉన్నాయి. వీటి విలువ రూ. 29.35 లక్షలని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఇన్చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వరరావుకు నివేదిక సమర్పించారు.
ఇదీ వరుస?
పీడీఎస్ బియ్యం ఎఫ్‌సీఐ గోదాం నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అవుతోంది. తిరిగి ఆ దుకాణాలనుంచి రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసి జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, సంచులు మార్చి ఎఫ్‌సీఐకి లెవీ రూపంలో తరలిస్తున్నారు. ఇలా నెలనెలా టన్నుల కొద్దీ బియ్యం ఎఫ్‌సీఐనుంచి రేషన్ దుకాణాలు, రైస్ మిల్లుల మీదుగా ప్రయాణించి ఎఫ్‌సీఐని చేరుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని భారత్ ఇండస్ట్రీస్, రామకృష్ణ అగ్రో ఇండస్ట్రీస్, మురళీ కృష్ణ ఇండస్ట్రీస్, సముద్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌లు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.
పక్క రాష్ట్రాలకూ
రూపాయి కిలో బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేసి, నగరంలోని మారుమూల ప్రాంతం లో ఉన్న రైస్‌మిల్లులలో రీసైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐతోపాటు పక్కనున్న మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందేడ్, జాల్నా, కర్ణాటకలోని బీదర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడం వల్ల అక్రమా ర్కులు తమ దందాకు జిల్లాను అడ్డాగా మార్చుకున్నారని తెలుస్తోంది. వీరు జిల్లాలోని రేషన్ షాప్లనుంచే కాకుండా ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలనుంచీ రేషన్ బి య్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ దందాలో రైస్‌మిల్లర్లతోపాటు జిల్లా పౌరసరఫరాల శాఖ, ఎల్ఎంఎస్ పాయింట్లు, ఎఫ్‌సీఐ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలున్నాయి.
చర్యలు కరువు
నగరంలో ఇంత పెద్ద ఎత్తున రూపాయి బియ్యం పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. ఒకే రైసుమిల్లులో సుమారు రూ. 30 లక్షల వరకు అక్రమ సరుకును గుర్తించినా తీసుకున్న చర్యలు శూన్యమే. వారం క్రితం అర్సపల్లిలోని ఓ రైస్‌మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నా.. ఇప్పటికీ సరైన వివరాలు సేకరించలేకపోయారు. కనీసం రికార్డులు సైతం తనిఖీ చేయలేదని తెలుస్తోంది. బియ్యం లెక్కలు వేయడం తప్ప అధికారులు ఈ కేసులో పురోగతి సాధించలేకపోయారు.
నిందితుడిని తప్పించారా?
కలెక్టర్ ప్రద్యుమ్న బదిలీ కాగానే అక్రమార్కులను కాపాడే యత్నాలు మొదలయ్యాయి. తన మిల్లుపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయం తెలుసుకొని రామకృష్ణ అగ్రో ఇండస్ట్రీస్ యజమాని మహమూద్ పారిపోయిన విషయం తెలిసిందే. గురువారం ఆయన మిల్లుకు వచ్చారని, విచారణ జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. కాగా అసలు నిందితుడు మహమూద్‌ను ఈ కేసు నుంచి తప్పించి, ఆయన స్థానంలో మరొకరిని చూపేందుకు అధికారులు యత్నిస్తున్నారని తెలుస్తోంది