FCRA
-
విదేశాల్లో బంధువులున్నారా? మీకో గుడ్‌న్యూస్: నిబంధనలు మారాయ్!
సాక్షి,న్యూఢిల్లీ: విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించింది. ఈ మేరకు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు, వారి బంధువులకు శుభవార్త అందించింది. తాజా సవరణతో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందించాల్సిన అవసరం లేకుండానే పది లక్షల రూపాయల వరకు భారతీయ బంధువులకు, కుటుంబీకులకు విదేశాల్లో ఉంటున్న వారు పంపించుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు సవరించిన నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు ఏడాదిలో రూ.10 లక్షలకు మించి నిధులు అందిన 90 రోజుల్లోగా ప్రభుత్వానికి అధికారికంగా వెల్లడించేలా నిబంధనలు మార్చింది. ఇప్పటివరకు ఈ వ్యవధి 30 రోజులు మాత్రమే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఎ)కి సంబంధించిన కొన్ని నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. దీనికి సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ నిబంధనలు, 2022 గెజిట్ నోటిఫికేషన్‌ను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కాగా విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం 2011లో, రూల్ 6 ప్రకారంలో ఏ వ్యక్తి అయినా తన బంధువుల నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన విదేశీ విరాళాన్ని స్వీకరిస్తే, అటువంటి సహకారం అందిన 30 రోజులలోపు కేంద్రానికి వివరాలు తెలియజేయాల్సి ఉండింది. ప్రస్తుత నిబంధన ప్రకారం 10 లక్షలకు మించి విదేశీ నిధులను స్వీకరిస్తే 90 రోజులలోపు సమాచారాన్ని కేంద్రానికి అందించాలి. అదేవిధంగా, ఎఫ్సీఆర్ఏ నిధులను స్వీకరించడానికి 'రిజిస్ట్రేషన్' లేదా 'ముందస్తు అనుమతి' పొందే నిబంధన 9కి కూడా మార్పులు చేసింది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు లేదా ఎన్జీవోలు తమకు అందిన నిధులు, బ్యాంకు ఖాతా సమాచారాన్ని హోంమంత్రిత్వ శాఖకు అందించే గడువు 45 రోజులకు పెంచింది. ఇప్పటివరకు ఇది 30 రోజులు మాత్రమే. ఎన్జీవోలు లేదా సంస్థలు, వ్యక్తులు విదేశీ నిధులను స్వీకరణకు సంబంధించి తన అధికారిక వెబ్సైట్లో ప్రతీ త్రైమాసికంలో వివరాలను అందించాలనే మరో నిబంధనను కూడా తొలగించింది. ఒక వేళ బ్యాంకు ఖాతా, పేరు, చిరునామా లేదా విదేశీ నిధులు మారిన పక్షంలో, ఆ సమాచారాన్ని మునుపటిలా 15 రోజుల ముందు కాకుండా 45 రోజులలోపు అందించాలి. అలాగే ఆయా నిధుల వినియోగంపై ఆడిటెడ్ స్టేట్మెంట్ అందించడానికి ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 9 నెలల సమయం ఉంటుంది. -
మిషనరీస్ ఆఫ్ చారిటీకి లైసెన్స్ పునరుద్ధరణ
న్యూఢిల్లీ: మదర్ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ(ఎంఓసీ)’ ఎన్జీవోకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌ను కేంద్ర హోం శాఖ శుక్రవారం పునరుద్ధరించింది. విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇకపై విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి దక్కాయి. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఎంఓసీ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల ఖాతాలో నిల్వ ఉన్న నగదు మొత్తాలను వినియోగించుకునే అవకాశం చిక్కింది. నిరుపేదలకు శాశ్వత సేవే ఆశయంగా నోబెల్ గ్రహీత మదర్ థెరిస్సా 1950లో కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను నెలకొల్పారు. ‘నాటి నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఇకమీదటా కొనసాగుతాయి. లైసెన్స్ పునరుద్ధరించారనే వార్త మా సంస్థకు నిజంగా పెద్ద ఊరట. లైసెన్స్ రాని ఈ రెండు వారాలూ దేశీయ విరాళాలతో మాకు పూర్తి సహాయసహకారాలు అందించిన దాతల దాతృత్వం అమూల్యం’ అని ఎంఓసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎంఓసీకి వచ్చిన గత విదేశీ విరాళాలకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారం ఉందనే కారణంతో 2021 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునే ఆ సంస్థ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించడం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాలతోపాటు భిన్న వర్గాల నుంచి మోదీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నాళ్లూ ముస్లింలను వేధించిన బీజేపీ సర్కార్ తాజాగా క్రిస్టియన్ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుందని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్‌ను పునరుద్ధరించడం గమనార్హం. భారత్‌లోని ఏదైనా ఎన్జీవో.. విదేశీ విరాళాలను పొందాలంటే లైసెన్స్ తప్పనిసరి. తప్పుగా కనబడింది.. 15 రోజుల్లో ఒప్పయిందా?: తృణమూల్ ఎంపీ డిరెక్ విరాళాల్లో అసంబద్ధ సమాచారం ఉందంటూ దరఖాస్తును తిరస్కరించిన 15 రోజుల్లోనే మళ్లీ లైసెన్స్‌ను కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని మోదీ సర్కార్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డిరెక్ ఓబ్రియన్ సూటిగా ప్రశ్నించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను రాబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందన్నారు. క్రైస్తవుల ప్రేమకు మోదీ తలొగ్గారన్నారు. ‘పవర్ ఆఫ్ లవ్ గ్రేటర్ దన్ ది పవర్ ఆఫ్ 56 ఇంచెస్’ అని ట్వీట్‌చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీనుద్ధేశిస్తూ 56 అంగుళాల ఛాతి అని గతంలో వ్యాఖ్యానించడం తెల్సిందే. -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్‌ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్‌యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్‌లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
ఆమ్నెస్టీ కార్యాలయంపై సీబీఐ దాడులు
సాక్షి, బెంగళూరు: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బెంగళూరు, ఢిల్లీలోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యాలయాలపై శుక్రవారం దాడులు నిర్వహించింది. దాడులపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ సీబీఐ అధికారులు ఆరుగురు ఇవాళ ఉదయం 8.30 గంటలకు బెంగళూరు ఆమ్నెస్టీ కార్యాలయానికి చేరుకున్నారని, సాయంత్రం అయిదు గంటల వరకు సోదాలు కొనసాగించారని తెలిపారు. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిసారీ వేధింపులకు గురవుతున్నామని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ సంస్థ భారతీయ, అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొంది. గత ఏడాది కూడా విదేశీ మారకద్రవ్యాల ఉల్లంఘన (ఫెరా) కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. 2010లో ఫారన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ రద్దు కేసుతో ముడిపడి ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. -
జైసింగ్ దంపతుల ఇళ్లపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ప్రముఖ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్‌లపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) దాడులు నిర్వహించింది. విదేశీ నిధుల చట్టం నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. గురువారం తెల్లవారుజామున 5గంటలకు ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ ఇల్లు, జంగ్‌పురాలో లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆఫీస్, ముంబైలోని మరో ఆఫీస్‌లో దాడులు నిర్వహించినట్లు సీబీఐ ప్రకటించింది. ఆనంద్ గ్రోవర్ తన ఆధ్వర్యంలో నడుస్తోన్న లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థకు వచ్చిన విదేశీ విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.32.39 కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డారని హోం శాఖ ఫిర్యాదిచ్చింది. దీంతో సంస్థ అధ్యక్షుడు గ్రోవర్‌పై విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఎ) ఉల్లంఘించారన్న ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగానే గురువారం సోదాలు నిర్వహించింది. ఫిర్యాదులో ఇందిరను నిందితురాలిగా పేర్కొనలేదు. 2009–14లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఇందిర పనిచేశారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇందిర, గ్రోవర్, లాయర్స్ కలెక్టివ్ తరఫున ఓ ప్రకటన వెలువడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ మాజీ ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల కేసును ఇందిర వాదిస్తుండడంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఖండించిన రాజకీయ పార్టీలు.. సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. సీబీఐ దాడులను టీఎంసీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎంలకు చెందిన ఎంపీలు మూకుమ్మడిగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ మేరకు వారంతా ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. -
ఇందిరా జైసింగ్ నివాసంలో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ : విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్‌లపై సీబీఐ గురువారం దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ నివాసం, ఎన్జీవో ఆఫీస్, ముంబయిలోని మరో ఆఫీసులో గురువారం ఉదయం 5గంటలకు దాడులు నిర్వహించినట్లు సీబీఐ పేర్కొంది. లాయర్స్ కలెక్టివ్ పేరిట ఎన్జీవోను స్థాపించి విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఎ) ఉల్లఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఆనంద్‌గ్రోవర్ పై కేసు నమోదైనట్లు వెల్లడించింది. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ 'లాయర్ కలెక్టివ్' ఎన్జీవో సంస్థ ద్వారా దాదాపు రూ.32 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఫిర్యాదులో ఇందిరా జైసింగ్‌ను నిందితురాలిగా పేర్కొనలేదని, కానీ లాయర్స్ కలెక్టివ్ నుంచి ఆమెకు రూ.96.60లక్షలు ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ స్పష్టం చేసింది. మరోవైపు ఇందిరా జైసింగ్ 2009 నుంచి 2014 వరకు అదనపు సొలిసిటర్గా భాద్యతలు నిర్వహించిన సమయంలో తన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులను హోంశాఖ అనుమతి లేకుండానే ఎన్జీవో సంస్థ నుంచి పొందినట్లు సీబీఐ తెలిపింది. సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ పై సీబీఐ నిర్వహించిన దాడులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ' రాజ్యాంగ విలువలను కాపాడడానికి వాళ్ల జీవితం మొత్తాన్ని అంకితం చేశారని, అటువంటి వారిపై అభియోగం మోపడం చాలా భాదాకరమని' కేజ్రీవాల్ ట్విటర్లో పేర్కొన్నారు. -
'కేసు తెలియదుగానీ సస్పెన్షన్ మాత్రం సరికాదు'
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్ స్వచ్ఛంద సంస్థకు అనుమతిచ్చి సస్పెండ్‌కు గురైన కేంద్ర హోంశాఖ అధికారులకు హోంశాఖ మాజీ కార్యదర్శి దన్నుగా నిలిచారు. వారిని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ఏదైన ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలంటే కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా విదేశాల నుంచి నిధులు పొందే సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఏ) ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి. అయితే, జకీర్ నాయక్ కూడా ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్చంద సంస్థను స్థాపించి ఎఫ్సీఏ అనుమతి కోరగా దానికి అప్పుడు ఉన్న హోంశాఖ అధికారులు లైసెన్స్ ఇచ్చారు. అయితే, జకీర్ నాయక్ ఇటీవల రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ వివాదాలకు తెరతీసిన విషయం తెలిసిందే. దీంతో జకీర్ నాయక్ పై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆయన స్వచ్చంద సంస్థ గుర్తింపు రద్దు చేశారు. దానికి అనుమతిచ్చిన నలుగురు అధికారులను ఈ నెల(సెప్టెంబర్) 1న సస్పెండ్ చేశారు. దీనిపై హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై స్పందించారు. 'జకీర్ నాయక్‌పై కేసు వివరాలు ఏమిటో నాకు తెలియదు. కానీ సస్పెండ్ చేయడం సరికాదు. అలాంటి చర్యలు సాధారణంగా ప్రజలను నిరుత్సాహపరుస్తాయి. ఇలాంటి చర్యలే తీసుకుంటూపోతే బ్యూరోక్రసీ ఆగిపోయే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ఆగిపోయే ప్రమాదం ఉంది. నా అనుభవం ప్రకారం హోంశాఖ కార్యదర్శి ఇలాంటి కేసుల్లో తన అధికారులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది' అని ఆయన చెప్పారు.