female singer
-
27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?
ప్రముఖ లేడీ సింగర్ రుక్సానా బానో (27) చనిపోయింది. ఒడిశా సంబల్‌పూర్‌కి చెందిన ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ బాగానే గుర్తింపు తెచ్చకుంది. అనారోగ్య సమస్యలతో ఆగస్టు 27న ఆస్పత్రిలో చేరిన ఈమె.. ఇప్పుడు ఇలా చనిపోవడం అభిమానులకు షాక్‌కి గురిచేసింది. మరి చిన్న వయసులోనే తనువు చాలించడంపై ఆమె తల్లి, సోదరి చేసిన కామెంట్స్ మాత్రం చర్చనీయాంశంగా మారిపోయాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)ఒడియా సాంగ్స్ పాడుతూ ఫేమస్ అయిన రుక్సానా బానో.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ కోసం బోలంగిర్ అనే ఊరు వెళ్లింది. జ్యూస్ తాగిన తర్వాత అనారోగ్యానికి గురైంది. వెంటనే భవానీపట్నలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇదంతా ఆగస్టు 27న జరిగింది. బోలంగిర్‌లోని పెద్దస్పత్రిలో చూపించినప్పటికీ ఫలితం లేకపోవడంతో బార్గర్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడి కూడా అవ్వకపోయేసరికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కి తరలించారు. అప్పటినుంచి చికిత్స అందించారు కానీ ఫలితం కనిపించలేదు. ఈ బుధవారం రాత్రి చనిపోయింది.ఆస్పత్రి వర్గాలు.. రుక్సానా బానో విషపురుగు కాటుకి గురైందని అంటుడగా ఈమె తల్లి, సోదరి మాత్రం ప్రత్యర్థి సింగర్ ఈమెకు విషమిచ్చి చంపేసిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఒడిశా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్) -
దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా?
మన సినిమాల్లో పాటలు ఎంత ముఖ్యమో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటివల్ల మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఫేమస్ అవుతారు. సంపాదన విషయానికొచ్చేసరికి మాత్రం సింగర్స్‌కి వచ్చేది నామమాత్రమే అని చెప్పొచ్చు. స్టార్ సింగర్స్‌కి తప్పితే మిగతా వాళ్లందరికీ వేలల్లోనే ఇస్తుంటారు. అలాంటిది మన దేశంలోనే రిచెస్ట్ సింగర్ ఒకరున్నారు. ఆమె ఆస్తే వందల కోట్లు ఉంటుందని మీకు తెలుసా? అవును పైన చెప్పింది కరెక్టే. భారతీయ సినిమాల్లో పాటలు పాడే ఓ లేడీ సింగర్ ఆస్తి అక్షరాలా రూ.200 కోట్లు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అయితే ఈమె మీరనుకున్నట్లు అత్యంత ధనిక సింగర్ శ్రేయా ఘోషల్, నేహా కక్కర్, ఆశా భోంస్లే కాదు తులసి కుమార్. ఈమె ఎవరబ్బా? ఎప్పుడు పేరే వినలేదు అనుకుంటున్నారు కదా! అవును ఎక్కువగా హిందీ పాటలే పాడుతూ బాలీవుడ్ లో ఉండటం వల్ల ఈమె దక్షిణాది సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం లేదు. (ఇదీ చదవండి: ట్రాక్ తప్పుతున్న రైతుబిడ్డ.. నామినేషన్స్‌లో ఒక్క పాయింట్ తిన్నగా లేదు!) అయితే ఈమె పాటలు మాత్రం మీరు కచ్చితంగా వినే ఉంటారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌కి ఈమె స్వయానా చెల్లెలు అవుతుంది. 2009లో 'లవ్ హో జాయేగా' ఆల్బమ్‌తో గాయని కెరీర్ ప్రారంభించిన తులసి కుమార్. ఆ తర్వాత అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో పాడింది. 'ఆషికి 2'లోని హమ్ మర్ జాయేంగే, పియా ఆయేనా లాంటి పాటలతో పాటు బోలెడన్ని సాంగ్స్ ఈమె పాడింది. ఒక్కో పాటకు రూ.35 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్న తులసి కుమార్.. ఓ సినిమాకు గానూ రూ.80 లక్షలు అందుకుంటోంది. బ్రాండ్స్, లైవ్ షోలు, యాడ్స్ ఇవన్నీ అదనం. అలా ప్రతి ఏడాది ఆదాయంతో పాటు ఆస్తిని పెంచుకుంటున్న తులసి కుమార్‌కి ప్రస్తుతం రూ.200 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె తర్వాత ఎక్కువ ఆస్తి ఉన్న సింగర్స్‌లో స్థానాల్లో శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, ఆశా భోంస్లే, నేహా కక్కర్ ఉంటారు. (ఇదీ చదవండి: జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. సరికొత్త చరిత్ర) View this post on Instagram A post shared by Tulsi Kumar 🧿 #TrulyKonnected #BoloNa (@tulsikumar15) -
వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు.. అసలేం జరిగింది!
ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నుదురు, ముఖంపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నైలోని ఆమె ఇంటిని స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పని మనిషి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె ఇంటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరీశీలిస్తున్నారు. ఆమెది సాధారణ మృతి కాదని, ఎవరో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కాలింగ్ బెల్ కొట్టినా తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి లోపలికి వెళ్లినట్లు పనిమనిషి పోలీసులకు తెలిపింది. ఇటీవలే ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. -
స్ఫూర్తి: తలవంచని పాట
పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు... దక్షిణ కశ్మీర్‌లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు. మిలే సుర్ (డిడి కశ్మీర్) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్’ కోసం తాను పాడిన పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు. బాలీవుడ్ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు. ఎక్కడికైనా బస్‌లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవారు. ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే. ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డ్, బక్షీ మెమోరియల్ కమిటీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది. 2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు. ‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది. -
ఏఆర్ రెహమాన్ పరిచయం చేసిన సింగర్లు
లతా అతని కోసం ‘జియా జలే జాన్ జలే’ పాడింది. ఆశా భోంస్లే ‘మై హూ రంగీలారే’ పాడింది. చిత్ర ‘కన్నానులే’తో అశేష అభిమానులను పొందింది. ‘చిన్ని చిన్ని ఆశ’ పాడిన మిన్మిని ఆ ఒక్క పాటతో చరిత్రలో నిలిచిపోయింది. ఏ.ఆర్.రహమాన్ కొత్త సంగీతం మాత్రమే తేలేదు. భారతీయ సంగీతంలో కొత్త గాయనీమణుల గొంతులెన్నో తెచ్చాడు. ‘గుంజుకున్నా.. నిన్ను ఎదలోకే’ పాడిన శక్తిశ్రీ గోపాలన్ గొంతు అతడు వినిపించకపోతే తెలిసేదా. లోకం ఒమిక్రాన్ కలకలంలో ఉంది. ఇవాళ ఈ పాటలే కాసింత స్వస్థత. ప్రతి పాట పాడటానికీ ఒక కోకిల పుట్టి ఉంటుంది. చేయాల్సింది ఏమిట్రా అంటే ఆ కోకిలను వెతకడం. సరైన చివురు ఉన్న కొమ్మపై కూచోబెట్టి కూకూ అనిపించడం. సుశీల, జానకి, చిత్ర... వీళ్లే ఎన్ని కొమ్మల మీద వాలతారు? ప్రతిసారి తమ గొంతు విప్పుతారు. కొత్త గొంతులు రావాలి. వేల కోకిలమ్మలు పాటల చెట్టుపై వాలాలి అనుకున్నవాడు ఏ.ఆర్.రహమాన్. అతడే బాల సుబ్రహ్మణ్యం ఏక గాయకుడిగా వెలుగుతున్నప్పుడు అనేకమంది మేల్ సింగర్స్‌ను తీసుకువచ్చాడు. అతడే జానకి, చిత్రలకు అలవాటు పడిన చెవులకు కొత్త స్త్రీ గొంతుక లు వినిపించాడు. 1992లో తన తొలి సినిమా ‘రోజా’లో ఒక్క పాట కూడా జానకి, సుశీల వంటి సీనియర్లకు ఇవ్వలేదు రహమాన్. సినిమాను నిలబెట్టిన ‘చిన్ని చిన్న ఆశ’ పాటను కూడా చిత్రకు ఇవ్వలేదు. ఆ పాటకు కొత్త గాయని మిన్మినిని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకు మిన్మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... ఆ తర్వాత ఆ గాయని అనారోగ్య కారణాల రీత్యా పాటకు దూరమైంది. కాని ఇప్పటికీ ఆ పాటే ఆమెకు గుర్తింపు, ఉనికి, ఉపాధి అయ్యింది. కన్నులతో చూసేదీ గురువా... ‘జీన్స్’ ఈ పాట ఇప్పటికీ డాన్స్ నంబర్. ఐశ్వర్య రాయ్ స్టేజ్ మీద స్టెప్పులేస్తుంటే థియేటర్లో ఆడియన్స్ జత కలిశారు. కాని ఆ పాటలో ఒక కొత్తదనం ఉంటుంది. ఏమిటది? దానిని ఏఆర్ రహమాన్ క్లాసికల్ సింగర్ నిత్యశ్రీ మహదేవన్ చేత పాడించాడు. ఆమె మహాగాయని పట్టమ్మాళ్ మనవరాలు. ఆమెకు ఇదే తొలి సినిమా గీతం. అందుకే ఆ ఫ్రెష్‌నెస్. ఒక సొగసు. ‘బొంబాయి’ సినిమాలో ‘కన్నానులే’ పాటను చిత్ర చేత పాడించాను రహమాన్. దానిని మణిరత్నం ముందు స్పీడ్ నంబర్‌గా కోరాడు. కాని చివరి నిమిషంలో మెలొడీ ఉండాలి... అందరూ కన్నార్పకుండా ‘వినాలి’ అన్నాడు. ఆ సూఫీ స్టయిల్ గీతం చిత్రకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చింది. అందమైన ప్రేమరాణి బాలూ కుమార్తె ఎస్.పి. పల్లవి మంచి గాయని. కాని ఆమె ఆ రంగాన్ని సీరియస్‌గా ఎంచుకోలేదు. కాని రహమాన్ తనకున్న చనువు కొద్దీ పల్లవితో ఒక పాట పాడించాడు. అదే ‘ప్రేమికుడు’లోని ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే’. అదే పాటకు బాలూ కూడా గొంతు అందించారు. చిన్న వయసులోనే మరణించిన గాయని స్వర్ణలత చేత రహమాన్ పెద్ద హిట్స్ పాడించాడు. ‘ప్రేమికుడు’లోని ‘ముక్కాలా ముకాబలా’లో ‘తుపాకీ లోడ్ చేసి గురి పెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా’ అని స్వర్ణలత పాడిన అందం రహమాన్ వల్లే సాధ్యం. ఈ స్వర్ణలతే ‘బొంబాయి’లో ‘కుచ్చికుచ్చి కునమ్మా పిల్లనివ్వు’ పాడింది. కొంచెం నిప్పు కొంచెం నీరు మణిరత్నం తీసిన ‘దొంగ దొంగ’ ఆడాల్సినంత ఆడలేదు. కాని అందులోని పాట నేటికీ నిలుచుని ఉంది. అదే ‘కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోనా’. ఈ పాటను అనుపమ చేత పాడించాడు రహమాన్. పల్లవి చివర ‘చంద్రలేఖా’...అనే ఆలాపన ఒక తరంగంలా వ్యాపిస్తుంది. ఈ పాట పాడుతున్నట్టుగా ఉండదు. అరుస్తున్నట్టుగా, నీల్గుతున్నట్టుగా, రహస్యం చెబుతున్నట్టుగా ఉంటుంది. ఇటీవలి ఇండియన్ ఐడెల్ గాయని షణ్ముఖ ప్రియ ఈ స్టయిల్లోనే పాడుతుంది. అనుపమ ఆ తర్వాత ఎక్కువ పాటలు పాడలేదు. కాని ఈ పాట ఆమెకు ఇప్పటికీ పాస్‌పోర్ట్. రంగీలారే మన రామ్‌గోపాల్ వర్మ ద్వారా రహమాన్ హిందీలో ప్రవేశించాడు. తొలి సినిమా ‘రంగీలా’. మొదటిసారి ఆశాభోంస్లే చేత పాడించాడు. ‘యాయిరే యాయిరే జోర్ లగాకే నాచెరే’... అరవై దాటిన ఆశాభోంస్లేకు కొత్త హుషారు వచ్చింది ఆ పాటతో. అదే సినిమాలో ‘తన్హా తన్హా యహాపే జీనా’ ఆశా గొంతులో మరింత సరసంగా వినిపించింది. ఆ తర్వాత లతా మంగేష్కర్ చేత రహమాన్ ‘దిల్ సే’లో పాడించాడు. ‘దియా జలే జాన్ జలే’ పాట బహుశా పాడిన కొత్తరకం పాటల్లో ముఖ్యమైనది. ‘దిల్సే’లో సూపర్‌హిట్ అయిన ‘ఛయ్య ఛయ్య’ కోసం సప్న అవస్థిని వెతికి ఆమె వల్ల పాటకు కొత్త ఫీల్ తెచ్చాడు. ఎందరో గాయనులు ‘కడలి’లో ‘గుంజుకున్నా’ పాడిన శక్తిశ్రీ గోపాలన్, ‘ఇందిర’లో ‘లాలి లాలి అని’ పాడిన హరణి, ‘రోబో’లో ‘కిలిమంజారో భళా భలిమంజారో’ పాడిన చిన్మయి, ‘జంటిల్మన్’ లో ‘నెల్లూరు నెరజాణ’ పాడిన మహలక్ష్మి అయ్యర్, ‘శివాజీ’లో ‘వాజి వాజి వాజి రారాజే నా శివాజీ’ పాడిన మధుశ్రీ... వీరంతా తెలుగు పాటకు కొత్త గుబాళింపును తెచ్చారు రహమాన్ వల్ల. ఇవాళ రహమాన్ పుట్టినరోజు. వేయి పాటలు అతడు చేయనీ. పదివేల కొత్త గాయనీమణుల గళాలు వినిపించనీ. -
Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్?
బాబిడోస్ సింగర్ రిహాన రైటర్, నటి, ఫ్యాషన్ డిజైనర్ కూడా. ‘మ్యూజిక్ ఆఫ్ ది సన్’ ఆల్బమ్ ఆమెను లోకానికి పరిచయం చేసింది. ‘ఏ గర్ల్ లైక్ మీ’ రిహానను బిల్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిపింది. ‘గుడ్ గర్ల్ గాన్ బ్యాడ్’ ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించింది. ‘అంబ్రెల్ల’ పాట ‘గ్రామీ అవార్డ్’ను తెచ్చిపెట్టింది. మీరు ఏ కాస్త తీరిగ్గా ఉన్నా....‘వాట్స్ మై నేమ్’ పాటను అందుకోండి...‘యూ ఆర్ సో అమేజింగ్’ అని, ‘వుయ్ ఫౌండ్ లవ్’ పాటను ‘వుయ్ ఫౌండ్ లవ్ ఇన్ ఏ హోప్లెస్ ప్లేస్ ఎల్లో డైమండ్ ఇన్‌ది లైట్’ అంటూ బేషుగ్గా పాడుకోవచ్చు. ‘రిచెస్ట్ ఫిమేల్ మ్యూజిషియన్ ఆన్ ది ప్లానెట్’గా ఘనత సాధించిన రిహాన సెల్ఫ్–మేడ్ ఆర్టిస్ట్. రిహాన ‘రిచెస్ట్’ కావడానికి మ్యూజిక్ మాత్రమే కారణం కాదు...ఆమె మంచి ఎంటర్ప్రెన్యూర్ కూడా. చదవండి: పదేళ్ల బాలుడికి అంతర్జాతీయ యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు..!! -
నన్ను విచిత్రంగా చూశారు
ఉషా ఉతుప్... మాంచి జోష్ ఉన్న సింగర్. ఫీమేల్ సింగర్ అంటే వాయిస్ సున్నితంగా ఉండాలి అనుకునే ఆలోచనని తన బేస్ వాయిస్‌తో బద్దలుకొట్టారు. పేద్ద బొట్టు, తల నిండా పువ్వులు, చీర కట్టుతోనే మనందరికీ ఎప్పుడూ కనిపిస్తారు. కెరీర్ స్టార్టింగ్‌లో తన వేషధారణ వల్ల ఎదుర్కొన్న ఓ విచిత్ర అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘కెరీర్ స్టార్టింగ్‌లో నైట్ క్లబ్లో పాటలు పాడేదాన్ని. నైట్ క్లబ్‌కి కూడా చీర కట్టుకొని వెళ్లేదాన్ని. అక్కడికి వచ్చిన వాళ్లంతా నన్ను స్టైజ్ మీద చూసి ‘ఈ అమ్మ ఏం పాడుతుందిలే..’ అన్నట్టుగా నన్ను విచిత్రంగా చూసేవారు. తీరా నేను పాడటం అయిపోయిన తర్వాత ‘వావ్’ అన్నట్టుగా ముఖాలు పెట్టేవారు. చాలా మంది అనుకుంటారు ఉషా ఉతుప్ అనగానే చీర, పెద్ద బొట్టుతో కనిపిస్తారు.. ఇది మార్కెటింగ్ స్ట్రాటెజీ అని. కానీ అలా ఏం కాదు. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా అమ్మగారు ఎప్పుడూ చీరే కట్టుకునేవారు. నాకు తెలిసిన డ్రెస్ అదొక్కటే. అలాగే నేను చీర కట్టుకొని వెళ్లడం వల్ల నైట్‌క్లబ్‌కి ఫ్యామిలీలు కూడా రావడం స్టార్ట్ అయ్యారు. అలా నైట్ క్లబ్ ఫ్యామిలీ ప్లేస్‌లా మారిపోయింది. ఆడియన్స్‌లో చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అలాగే భార్యలందరికీ తమ భర్తల మీద ఓ భరోసా ఉండేది. నా శరీరాకృతి, నా అందం చూసి వాళ్ల భర్తల మనసు చలించదు అని (నవ్వుతూ)’’ అంటూ తన మీద తానే జోక్ వేసుకుంటూ, పాత అనుభవాలను పంచుకున్నారు ఉషా ఉతుప్. -
ప్రముఖ గాయని రాణి మృతి
టాలీవుడ్ సీనియర్ గాయని కె. రాణి (75) ఇక లేరు. హైదరాబాద్ కల్యాణ్ నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంట శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందినట్టు చిన్న కుమార్తె కవిత ధృవీకరించారు. 1942లో కర్ణాటకలోని తుముకూరు పట్టణంలో కిషన్, లలిత దంపతులకు జన్మించారామె. అసలు పేరు కె. ఉషారాణి. ఈ కుటుంబం కడపలో స్థిరపడింది. 8 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ చిత్రంలో ‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’, ‘చెలియ లేదు.. చెలిమి లేదు..’ అనే పాటలతో రాణి పాపులర్ అయ్యా రు. ‘బాటసారి, జయసింహ, ధర్మదేవత, సంపూర్ణ రామాయణం, లవకుశ’ వంటి పలు చిత్రాల్లో తన మధురమైన గానంతో శ్రోతలను అలరించారు. ఆమె పాడిన చివరి చిత్రం ‘విశాల హృదయాలు’. ఆ సినిమాలో ఆమె ‘ఒక్క మాట..’ అనే పాట పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, సింహళ, ఉజ్బెక్ వంటి పలు భాషలలో సుమారు 500 పాటలు పాడారామె. శ్రీలంక జాతీయ గీతం కూడా ఆలపించారు రాణి. రాష్ట్రపతి భవన్లో తన గానామృతంతో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణని ఆకట్టుకున్న ఘనత రాణి సొంతం. సింహళ, ఉజ్బెక్ భాషలలో పాడిన తొలి ఇండియన్ సింగర్ ఆమె కావడం విశేషం. అలాగే, అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె. కామరాజ్ ‘మెల్లిసై రాణి’ అనే బిరుదు ఇచ్చారు. 1966లో జి. సీతారామరెడ్డితో రాణి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంట్లో రాణి ఉంటున్నారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
వీరాభిమాని అశ్లీల వీడియోలు.. సింగర్ షాక్!
ముంబై : వీరాభిమానం తప్పుదోవ పడితే చివరికి కటకటాలపాలు కావాల్సిందే. తనను కలుసుకోవడం లేదన్న కారణంగా ఓ ఫీమేల్ సింగర్‌కు అసభ్య సందేశాలు, వీడియోలు పంపండంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. 26 ఏళ్ల యువతి పలు బాలీవుడ్ మూవీలకు ప్లే బ్లాక్ సింగర్‌గా చేశారు. ఆమెకు బిహార్‌కు చెందిన రాజేశ్‌కుమార్ శుక్లా(30) వీరాభిమాని. తన ఆరాధ్య సింగర్‌ను ఎలాగైనా కలవాలని రెండు వారాల కిందట ముంబైకి వచ్చాడు. ఎలాగోలా కష్టపడి ఆమె ఫోన్ నెంబర్, అడ్రస్ సేకరించాడు. మిమ్మల్ని కలుసుకోవాలని ఉందని పలుమార్లు సందేశాలు పంపినా సింగర్ పట్టించుకోలేదు. ఇదే అదునుగా భావించిన ఆ వీరాభిమాని కీచకపర్వం మొదలుపెట్టాడు. నన్ను కలుసుకోవా నీ పని చెబుతానంటూ ఆమెకు అసభ్య సందేశాలు, అశ్లీ వీడియోలు పంపసాగాడు. వేధింపులను భరించలేని సింగర్ తన తల్లితో కలిసి అంబోలీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వీరాభిమాని అని చెప్పి ఓ వ్యక్తి వేధిస్తున్నాడని, తనను కలవడానికి బిహార్ నుంచి వచ్చా అని ఫోన్లు, మెస్సేజ్‌లు చేస్తున్నాడన్నారు. ఐపీసీ 354డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తన ఆరాధ్య సింగర్ కలుసుకునేందుకు నిరాకరించడంతో ఈ పిచ్చి చేష్టలకు పాల్పడినట్లు నిందితుడు శుక్లా అంగీకరించాడు. -
అపురూపం: తియ్యని స్వరానుబంధం
లతామంగేష్కర్ - పి.సుశీల నైటింగేల్స్ ఆఫ్ ఇండియా. జాతి గర్వపడే కోయిలలు. ఒకరు ఉత్తరాన్ని ఏలితే ఇంకొకరు దక్షిణాది సంగతి చూసుకున్నారు. అనుకరణకు ఏమాత్రం వీలు కాని తియ్యటి గొంతులు వారివి. భాష ఉచ్ఛారణలో, భావ ప్రకటనలో ఇప్పటివారికి వారే డిక్షనరీ! లతాజీకి సుశీలగారంటే ఎంతో అభిమానం. అలాగే సుశీలగారికి లతాజీ అంటే గురుభావం! గాత్రం రీత్యా, రూపం రీత్యా ఇద్దరికీ దగ్గర పోలికలు ఉండటంతో అక్కాచెల్లెళ్లలా అనిపిస్తారు. లతాజీ కూడా సుశీలగారిని తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు. చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు కాదు లతాజీ. అలాగే బొంబాయి వెళితే లతాజీని కలవకుండా వచ్చేవారు కాదు సుశీల! ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ గాయిని... ఇలా వ్యక్తిగత అవార్డులను భారత ప్రభుత్వం 1969 నుంచి ఇవ్వడం ప్రారంభించింది. ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా పి.సుశీలగారు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్‌గారు చెన్నైలో సుశీలగారికి పెద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన సాటి గాయనికి దక్కిన ఈ గౌరవానికి లతాజీ పొంగిపోయి బొంబాయి నుండి ప్రత్యేకంగా వచ్చి సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్‌ను కూడా బహుకరించారు. అది ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ సందర్భంగా వారిద్దరూ కాఫీ తాగుతూ ముచ్చటించుకుంటున్న స్టిల్(పైన) అప్పటిదే. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం సుశీలగారికి పద్మభూషణ్ ప్రదానం చేసిన సందర్భంలో తన మానసిక గురువు అయిన లతాజీ ఆశీస్సులు తీసుకోవడానికి బొంబాయి వెళ్లినప్పుడు వారిరువురూ కాఫీ సేవిస్తూ కబుర్లాడుకుంటున్న దృశ్యాన్నీ (కింది ఫొటో) చూడవచ్చు. సంవత్సరాలు మారాయి! కానీ వారి మధ్య సంబంధాలు మారలేదు! వారి అనుబంధం, స్వర బంధం అంత తియ్యనిదీ, చెరగనిదీ, తరగనిదీ కాబట్టే ఇన్నేళ్లయినా... ఎన్నాళ్లయినా అలా కొనసాగుతూనే ఉంది... ఉంటుంది!! - ఫొటోలు, రచన: సంజయ్ కిషోర్