టాలీవుడ్ సీనియర్ గాయని కె. రాణి (75) ఇక లేరు. హైదరాబాద్ కల్యాణ్ నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంట శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందినట్టు చిన్న కుమార్తె కవిత ధృవీకరించారు. 1942లో కర్ణాటకలోని తుముకూరు పట్టణంలో కిషన్, లలిత దంపతులకు జన్మించారామె. అసలు పేరు కె. ఉషారాణి. ఈ కుటుంబం కడపలో స్థిరపడింది. 8 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ చిత్రంలో ‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’, ‘చెలియ లేదు.. చెలిమి లేదు..’ అనే పాటలతో రాణి పాపులర్ అయ్యా రు. ‘బాటసారి, జయసింహ, ధర్మదేవత, సంపూర్ణ రామాయణం, లవకుశ’ వంటి పలు చిత్రాల్లో తన మధురమైన గానంతో శ్రోతలను అలరించారు.
ఆమె పాడిన చివరి చిత్రం ‘విశాల హృదయాలు’. ఆ సినిమాలో ఆమె ‘ఒక్క మాట..’ అనే పాట పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, సింహళ, ఉజ్బెక్ వంటి పలు భాషలలో సుమారు 500 పాటలు పాడారామె. శ్రీలంక జాతీయ గీతం కూడా ఆలపించారు రాణి. రాష్ట్రపతి భవన్‌లో తన గానామృతంతో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణని ఆకట్టుకున్న ఘనత రాణి సొంతం. సింహళ, ఉజ్బెక్ భాషలలో పాడిన తొలి ఇండియన్ సింగర్ ఆమె కావడం విశేషం. అలాగే, అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె. కామరాజ్ ‘మెల్లిసై రాణి’ అనే బిరుదు ఇచ్చారు. 1966లో జి. సీతారామరెడ్డితో రాణి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంట్లో రాణి ఉంటున్నారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment