లతా మంగేష్కర్ ఆశా భోంస్లే ఏ.ఆర్.రహమాన్
లతా అతని కోసం ‘జియా జలే జాన్ జలే’ పాడింది.
ఆశా భోంస్లే ‘మై హూ రంగీలారే’ పాడింది.
చిత్ర ‘కన్నానులే’తో అశేష అభిమానులను పొందింది.
‘చిన్ని చిన్ని ఆశ’ పాడిన మిన్‌మిని ఆ ఒక్క పాటతో చరిత్రలో నిలిచిపోయింది.
ఏ.ఆర్.రహమాన్ కొత్త సంగీతం మాత్రమే తేలేదు.
భారతీయ సంగీతంలో కొత్త గాయనీమణుల గొంతులెన్నో తెచ్చాడు.
‘గుంజుకున్నా.. నిన్ను ఎదలోకే’ పాడిన శక్తిశ్రీ గోపాలన్ గొంతు అతడు వినిపించకపోతే తెలిసేదా.
లోకం ఒమిక్రాన్ కలకలంలో ఉంది. ఇవాళ ఈ పాటలే కాసింత స్వస్థత.
ప్రతి పాట పాడటానికీ ఒక కోకిల పుట్టి ఉంటుంది. చేయాల్సింది ఏమిట్రా అంటే ఆ కోకిలను వెతకడం. సరైన చివురు ఉన్న కొమ్మపై కూచోబెట్టి కూకూ అనిపించడం. సుశీల, జానకి, చిత్ర... వీళ్లే ఎన్ని కొమ్మల మీద వాలతారు? ప్రతిసారి తమ గొంతు విప్పుతారు. కొత్త గొంతులు రావాలి. వేల కోకిలమ్మలు పాటల చెట్టుపై వాలాలి అనుకున్నవాడు ఏ.ఆర్.రహమాన్. అతడే బాల సుబ్రహ్మణ్యం ఏక గాయకుడిగా వెలుగుతున్నప్పుడు అనేకమంది మేల్ సింగర్స్‌ను తీసుకువచ్చాడు. అతడే జానకి, చిత్రలకు అలవాటు పడిన చెవులకు కొత్త స్త్రీ గొంతుక లు వినిపించాడు.
1992లో తన తొలి సినిమా ‘రోజా’లో ఒక్క పాట కూడా జానకి, సుశీల వంటి సీనియర్లకు ఇవ్వలేదు రహమాన్. సినిమాను నిలబెట్టిన ‘చిన్ని చిన్న ఆశ’ పాటను కూడా చిత్రకు ఇవ్వలేదు. ఆ పాటకు కొత్త గాయని మిన్‌మినిని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్‌లకు మిన్‌మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... ఆ తర్వాత ఆ గాయని అనారోగ్య కారణాల రీత్యా పాటకు దూరమైంది. కాని ఇప్పటికీ ఆ పాటే ఆమెకు గుర్తింపు, ఉనికి, ఉపాధి అయ్యింది.
కన్నులతో చూసేదీ గురువా...
‘జీన్స్’ ఈ పాట ఇప్పటికీ డాన్స్ నంబర్. ఐశ్వర్య రాయ్ స్టేజ్ మీద స్టెప్పులేస్తుంటే థియేటర్లో ఆడియన్స్ జత కలిశారు. కాని ఆ పాటలో ఒక కొత్తదనం ఉంటుంది. ఏమిటది? దానిని ఏఆర్ రహమాన్ క్లాసికల్ సింగర్ నిత్యశ్రీ మహదేవన్ చేత పాడించాడు. ఆమె మహాగాయని పట్టమ్మాళ్ మనవరాలు. ఆమెకు ఇదే తొలి సినిమా గీతం. అందుకే ఆ ఫ్రెష్‌నెస్. ఒక సొగసు. ‘బొంబాయి’ సినిమాలో ‘కన్నానులే’ పాటను చిత్ర చేత పాడించాను రహమాన్. దానిని మణిరత్నం ముందు స్పీడ్ నంబర్‌గా కోరాడు. కాని చివరి నిమిషంలో మెలొడీ ఉండాలి... అందరూ కన్నార్పకుండా ‘వినాలి’ అన్నాడు. ఆ సూఫీ స్టయిల్ గీతం చిత్రకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చింది.
అందమైన ప్రేమరాణి
బాలూ కుమార్తె ఎస్.పి. పల్లవి మంచి గాయని. కాని ఆమె ఆ రంగాన్ని సీరియస్‌గా ఎంచుకోలేదు. కాని రహమాన్ తనకున్న చనువు కొద్దీ పల్లవితో ఒక పాట పాడించాడు. అదే ‘ప్రేమికుడు’లోని ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే’. అదే పాటకు బాలూ కూడా గొంతు అందించారు. చిన్న వయసులోనే మరణించిన గాయని స్వర్ణలత చేత రహమాన్ పెద్ద హిట్స్ పాడించాడు. ‘ప్రేమికుడు’లోని ‘ముక్కాలా ముకాబలా’లో ‘తుపాకీ లోడ్ చేసి గురి పెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా’ అని స్వర్ణలత పాడిన అందం రహమాన్ వల్లే సాధ్యం. ఈ స్వర్ణలతే ‘బొంబాయి’లో ‘కుచ్చికుచ్చి కునమ్మా పిల్లనివ్వు’ పాడింది.
కొంచెం నిప్పు కొంచెం నీరు
మణిరత్నం తీసిన ‘దొంగ దొంగ’ ఆడాల్సినంత ఆడలేదు. కాని అందులోని పాట నేటికీ నిలుచుని ఉంది. అదే ‘కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోనా’. ఈ పాటను అనుపమ చేత పాడించాడు రహమాన్. పల్లవి చివర ‘చంద్రలేఖా’...అనే ఆలాపన ఒక తరంగంలా వ్యాపిస్తుంది. ఈ పాట పాడుతున్నట్టుగా ఉండదు. అరుస్తున్నట్టుగా, నీల్గుతున్నట్టుగా, రహస్యం చెబుతున్నట్టుగా ఉంటుంది. ఇటీవలి ఇండియన్ ఐడెల్ గాయని షణ్ముఖ ప్రియ ఈ స్టయిల్‌లోనే పాడుతుంది. అనుపమ ఆ తర్వాత ఎక్కువ పాటలు పాడలేదు. కాని ఈ పాట ఆమెకు ఇప్పటికీ పాస్‌పోర్ట్.
రంగీలారే
మన రామ్‌గోపాల్ వర్మ ద్వారా రహమాన్ హిందీలో ప్రవేశించాడు. తొలి సినిమా ‘రంగీలా’. మొదటిసారి ఆశాభోంస్లే చేత పాడించాడు. ‘యాయిరే యాయిరే జోర్ లగాకే నాచెరే’... అరవై దాటిన ఆశాభోంస్లేకు కొత్త హుషారు వచ్చింది ఆ పాటతో. అదే సినిమాలో ‘తన్హా తన్హా యహాపే జీనా’ ఆశా గొంతులో మరింత సరసంగా వినిపించింది. ఆ తర్వాత లతా మంగేష్కర్ చేత రహమాన్ ‘దిల్ సే’లో పాడించాడు. ‘దియా జలే జాన్ జలే’ పాట బహుశా పాడిన కొత్తరకం పాటల్లో ముఖ్యమైనది. ‘దిల్‌సే’లో సూపర్‌హిట్ అయిన ‘ఛయ్య ఛయ్య’ కోసం సప్న అవస్థిని వెతికి ఆమె వల్ల పాటకు కొత్త ఫీల్ తెచ్చాడు.
ఎందరో గాయనులు
‘కడలి’లో ‘గుంజుకున్నా’ పాడిన శక్తిశ్రీ గోపాలన్, ‘ఇందిర’లో ‘లాలి లాలి అని’ పాడిన హరణి, ‘రోబో’లో ‘కిలిమంజారో భళా భలిమంజారో’ పాడిన చిన్మయి, ‘జంటిల్మన్’ లో ‘నెల్లూరు నెరజాణ’ పాడిన మహలక్ష్మి అయ్యర్, ‘శివాజీ’లో ‘వాజి వాజి వాజి రారాజే నా శివాజీ’ పాడిన మధుశ్రీ... వీరంతా తెలుగు పాటకు కొత్త గుబాళింపును తెచ్చారు రహమాన్ వల్ల.
ఇవాళ రహమాన్ పుట్టినరోజు.
వేయి పాటలు అతడు చేయనీ. పదివేల కొత్త గాయనీమణుల గళాలు వినిపించనీ.
Comments
Please login to add a commentAdd a comment