భారతీయ సినీ సంగీతాన్ని ఉర్రూతలూగించిన సంగీత సామ్రాట్ రెహ్మాన్. ఒకవైపు మృదుమధురమైన సంగీతంతో సమ్మోహితునుల్ని చేసే మ్యూజిక్ మాంత్రికుడు. మరోవైపు ర్యాప్, జాజ్, రాక్, ఇలా వెస్ట్రన్ సంగీతాన్ని మేళవించి ఆనందంతో ఊగిపోయేలా చేస్తాడు. కీ బోర్డ్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో లెజెండ్‌గా అవతరించాడు. విభిన్న రాగాలను మిళితం చేసి, లయల హొయలు ఒలికిస్తాడు. ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ బర్త్‌డే సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి.
జపాన్ సంగీతమైనా, ఆఫ్రికా సంగీతమైనా, ఖవ్వాలీ అయినా మరే ఇతర సంగీతమైనా ప్రజల హృదయాలను స్పందింప జేయాలి. అప్పుడే నా సంగీతానికి సార్థకత లభిస్తుంది అంటారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు రహ్మాన్. అలా తనదైన ప్రత్యేక శైలితో భారతీయ సినీ సంగీతాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతిభావంతుడు ఆయన. జనవరి 6 తేదీ 1967 సంవత్సరంలో ఆర్. కె. శేఖర్, కస్తూరి దంపతులకు జన్మించారు ఏఎస్ దిలీప్ కుమార్. అయితే 23 సంవత్సరాల వయస్సులో అల్లారఖా రెహ్మాన్‌గా తన పేరు మార్చుకున్నారు దిలీప్ కుమార్.
నాలుగేళ్ల వయసు నుంచే తండ్రి దగ్గర పియానో నేర్చుకున్నారు రెహ్మాన్ చిన్నతనంలోనే తండ్రి కోల్పోయిన రెహ్మాన్ ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని 11 ఏళ్ల నుంచే అసిస్టెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. రమేష్ నాయుడు, ఇళయరాజా, రాజ్-కోటి మొదలైన మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేస్తూ, తన టాలెంట్‌తో రాణించారు. అలా సినీ నేపథ్యంలోనిఎంట్రీ ఇవ్వక ముందే అనేక వాణిజ్య ప్రకటనలకు పనిచేశారాయన. ముఖ్యంగా రెహ్మాన్ స్వరపర్చిన ఎయిర్‌టెల్ వాణిజ్య ప్రకటన ఎంత పాపులర్ మనందరికీ తెలుసు.
సినిమాల్లో ప్రవేశించిన రెహ్మాన్ విభిన్న బాణీలతో తన శైలిని ప్రపంచ సంగీతాభిమానులకు రుచి చూపించారు. స్వరాలతో విభిన్నప్రయోగాలు చేశారు. స్వర లయలతో పరవళ్లు తొక్కించారు.అందుకే ఆయన బాణీలు విలక్షణంగా, విభిన్నంగా, అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. పాట వినగానే ఇది రెహ్మాన్ పాటే అనేంత పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలుగుతోపాటు, పలు భాషల మూవీలకు సంగీతాన్ని అందిసున్నారు. ముఖ్యంగా తెలుగులో రోజా, జెంటిల్‌మేన్, సఖి, జీన్స్ , ‘ఏ మాయ చేసావె ఇలా అనేక మూవీలకు అయన అందించిన స్వరాలు అజ రామరంగా నిలిచిపోతాయి. తొలి చిత్రం ‘రోజా’తోపాటు మెరుపు కలలు, లగాన్, అమృత సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. సఖి, జెంటిల్‌మేన్, నరసింహ, మిస్టర్ రోమియో, ప్రేమికుడు రోబో లాంటి సినిమాల్లో ఆణిముత్యాల్లాంటి పాటలను మనకందించారు. రెహ్మాన్ తొలిసారి నిర్మాతగా 99 సాంగ్స్, అనే చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది ఏప్రిల్ 16న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.
రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన కరియర్‌లో ఏ భారతీయ సంగీత దర్శకుడూ సాధించని ఘనతను సొంతం చేసుకున్నారు. నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 19 ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు వంటి ఎన్నో అవార్డులతో పాటు రివార్డులు రెహమాన్ చెంతకు చేరాయి.అలాగే స్లమ్‌డాగ్ మిలీయనీర్ మూవీకిగాను రెండు ఆస్కార్లూ, రెండు గ్రామీల్నీ, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందుకున్నారు. ఒకే ఏడాది రెండు ఆస్కార్లు అందుకున్న ఏకైక ఆసియా వ్యక్తి రెహ్మాన్. 2010లో కేంద్రం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందించింది. పేదపిల్లకు సంగీతంలో శిక్షణ , వసతి కల్పించేందుకు వీలుగా చెన్నైలో ‘‘కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ’’ ఏర్పాటు చేశారు రహ్మాన్.
Comments
Please login to add a commentAdd a comment