Fencing Championship
-
భవానీదేవికి కాంస్యం
న్యూఢిల్లీ: భారత ఫెన్సర్ భవానీదేవి ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. చైనాలోని వూగ్జీలో జరుగుతున్న ఈ టోరీ్నలో ఆమె కాంస్యం సాధించడం ద్వారా ఈ పోటీల్లో పతకం గెలిచిన తొలి భారత ఫెన్సర్‌గా ఘనతకెక్కింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో (సబ్రే ఈవెంట్) 29 ఏళ్ల భవాని 14–15తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జేనబ్ దేబెకొవా చేతిలో తుదికంటా పోరాడి ఓడింది. ఫలితం నిరాశపరిచినా ఆమె శ్రమకు కాంస్య పతకం లభించింది. ఈ టోర్నీలో భారత ఫెన్సర్ సంచలన విజయాలతో సెమీస్‌లోకి దూసుకొచి్చంది. క్వార్టర్ ఫైనల్లో భవాని 15–10తో ప్రపంచ చాంపియన్ ఫెన్సర్ మిసాకి ఎముర (జపాన్)ను కంగుతినిపించింది. మిసాకి గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. ఈ మేటి ప్రత్యరి్థతో గతంలో తలపడిన ప్రతీసారి ఓటమి పాలైన భవానీ ఈ ఈవెంట్లో అద్భుత విజయం సాధించింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్ కూడా అయిన భవాని ప్రిక్వార్టర్స్‌లోనూ తనకన్నా మెరుగైన మూడో సీడ్ ప్రత్యర్థి ఒజాకి సెరి (జపాన్)ని 15–11తో ఓడించింది. -
కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
లండన్: కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. పురుషుల ఈపీ టీమ్ ఈవెంట్లో చింగాఖమ్ సింగ్, సునీల్ కుమార్, ఉదయ్‌వీర్ సింగ్, సదాశివన్లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ 45–44తో స్కాట్లాండ్ను ఓడించింది. మహిళల సేబర్ టీమ్ ఈవెంట్లో భవాని దేవి, జగ్మీత్ కౌర్, క్రిస్టీ జోష్నా జోస్, ఖుషీ వబికలతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఇదే టోర్నీలో మహిళల సేబర్ వ్యక్తిగత విభాగంలో భవాని దేవి స్వర్ణ పతకాన్ని సాధించింది. చదవండి: Ind Vs Zim ODI Series: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. -
కామన్వెల్త్లో భారత ఫెన్సర్‌కు స్వర్ణం
లండన్: ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఇప్పుడు అక్కడే కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ జరుగుతుండగా ఇందులోనూ భారత ఫెన్సర్ సత్తా చాటింది. చెన్నైకి చెందిన భవానీ దేవి అద్భుత ప్రదర్శనతో స్వర్ణం నిలబెట్టుకుంది. టైటిల్ నిలబెట్టుకునే క్రమంలో 42వ ర్యాంకర్ భవాని 15–10తో రెండో సీడ్ వెరొనికా వాసిలెవా (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా ఘనత వహించిన ఆమె పసిడి పోరులో చక్కని ప్రతిభ కనబరిచింది. ఈ ఏడాది ఆరంభంలో తడబాటుకు గురైన ఆమె ఈ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిలకడైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. తొలుత ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో 23వ స్థానంలో నిలిచి నిరాశ పడింది. అనంతరం జూలైలో కైరోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఈ ఏడాది భవానీ దేవి పాల్గొన్న పదో అంతర్జాతీయ ఈవెంట్ ఈ కామన్వెల్త్ చాంపియన్‌షిప్ కాగా ఇందులో విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొంది. ‘ఫైనల్ పోటాపోటీగా సాగింది. హోరాహోరీ పోరులో స్వర్ణం గెలుపొందడం ఆనందంగా ఉంది. ఇదే జోరును ఇకపై కొనసాగిస్తాను’ అని భవాని తెలిపింది. -
ఫెన్సర్ భవానీ దేవి క్షమాపణలు.. స్పందించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఫెన్సింగ్‌లో పోటీపడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన భవానీ దేవి.. రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ మేనన్ బ్రూనెట్ చేతిలో 7-15 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె యావత్ దేశానికి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపింది. 'శక్తిసామర్థ్యాల మేరకు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయా. నన్ను క్షమించండి. ప్రతి ముగింపు ఓ ప్రారంభానికి నాంది. శిక్షణను కొనసాగిస్తా. 2024 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకు సాగుతా' అని ట్వీట్ చేసింది. భవానీ దేవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. Big Day 🤺 It was Excitement & Emotional. I won the First Match 15/3 against Nadia Azizi and become the First INDIAN Fencing Player to win a Match at Olympic but 2nd Match I lost 7/15 against world top 3 player Manon Brunet. I did my level best but couldn't win. I am sorry 🙏 🇮🇳 pic.twitter.com/TNTtw7oLgO — C A Bhavani Devi (@IamBhavaniDevi) July 26, 2021 You gave your best and that is all that counts. Wins and losses are a part of life. India is very proud of your contributions. You are an inspiration for our citizens. https://t.co/iGta4a3sbz — Narendra Modi (@narendramodi) July 26, 2021 ఆమె ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శక్తిమేరకు పోరాడావంటూ ట్విట్టర్ వేదికగా అభినందించారు. 'మీ అత్యుత్తమ సామర్థ్యం మేరకు పోరాడారు. మాకదే ముఖ్యం. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. మీ సేవలకు భారత్ గర్విస్తోంది. మన దేశ పౌరులందరికీ మీరు స్ఫూర్తిగా ఉండిపోతారు' అంటూ ప్రధాని ఆమెకు అండగా నిలిచారు. తమిళనాడుకు చెందిన చందలవాడ ఆనంద సుందరామన్ భవానీ దేవి అరంగేట్రం ఒలింపిక్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. తొలి రౌండ్లో నడియా అజిజిపై 15-3 తేడాతో గెలిచి ఔరా అనిపించారు. ఒలింపిక్స్ ఫెన్సింగ్‌లో ఓ మ్యాచ్‌లో గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. -
తెలంగాణకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు ఆకట్టుకుంది. గువాహటిలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఫాయిల్ ఈవెంట్ టీమ్ కేటగిరీలో కాంస్య పతకాన్ని సాధించింది. టి. భాగ్యశ్రీ,, శిరీష, ఫౌజియా, ప్రేరణ శీతల్‌లతో కూడిన తెలంగాణ బృందం పోటీల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి పతకాన్ని అందించిన క్రీడాకారులను శాట్స్ ఎండీ ఎ. దినకర్ బాబు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘శాట్స్’ ఫెన్సింగ్ కోచ్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ జట్టు ఇటీవల జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లోనూ పతకాన్ని గెలుచుకుంది. ఈ నెల ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8 వరకు జరుగనున్న ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారతజట్టుకు భాగ్యశ్రీ ఎంపికైంది. ఆమె ను దినకర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. -
ఫెన్సింగ్‌లో తెలంగాణకు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఫెన్సర్లు సత్తా చాటారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర ఫెన్సింగ్ జట్టు రజత పతకం సాధించగా... వ్యక్తిగత విభాగంలో ఓ కాంస్యం దక్కింది. ఫాయిల్ టీమ్ విభాగంలో టి. భాగ్యశ్రీ, షేక్ ఫౌజియా, కె. గౌరి, శిరీషలతో కూడిన రాష్ట్ర జట్టు ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫాయిల్ వ్యక్తిగత విభాగంలో భాగ్యశ్రీ కాంస్య పతకం చేజిక్కించుకుంది. -
రంగారెడ్డి జట్లకు టైటిల్స్
కరీంనగర్ : పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జట్లు సత్తా చాటాయి. కరీంనగర్‌లోని కొత్తపల్లి ఆల్ఫోర్స్ పాఠశాలలో జరిగిన ఈ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో రంగారెడ్డి జట్లు విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. అండర్–17 స్థాయిలో ఫాయిల్, ఇపీ, సాబెర్ విభాగాల్లో నిర్వహించిన ఈ టోర్నీలో రాష్ట్రంలోని 8 జిల్లాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ ఫెన్సింగ్ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్లకు ఎంపికయ్యారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. జట్ల వివరాలు ఫాయిల్ బాలుర జట్టు: జి. మణికంఠ, రోహిత్, తప్‌జ్యోత్‌సింగ్, సాయినివాస్; బాలికలు: కె. గౌరి, జి. శిరీష, హరిణి, జి. సుజాత. ఇపీ బాలుర జట్టు: రవితేజ, ఆకాశ్‌రెడ్డి, సుమిత్, పవన్‌కళ్యాణ్; బాలికలు: వై. ఉమామహేశ్వరి, ఎల్. నమ్రత జాదవ్, వి. భార్గవి, వర్షిత. సాబెర్ బాలుర జట్టు: ఎస్కే ఇమ్రాన్, శ్రావణ్, తప్‌జ్యోత్‌సింగ్, సాయిరాం; బాలికలు: బేబి రెడ్డి, ఎ. శిరీష, కె. ప్రజ్ఞ, వి. సరయు.