కెన్నెడీ హత్య ఎలా జరిగింది?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రోతోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలను అంతమొందించేందుకు సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) పన్నిన కుట్రకు సంబంధించినవి సహా మొత్తం 3వేల రహస్య పత్రాలను అమెరికా శుక్రవారం బహిర్గతం చేసింది. ఈ పత్రాల్లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కెన్నెడీ హత్య తర్వాత హంతకుడిని పట్టుకునేందుకు విచారణ సంస్థలు ఆధారాల కోసం వెతికిన తీరు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై వస్తున్న పుకార్లను తాజా వివరాలు వెల్లడించాయి.
కెన్నెడీని ఓస్వాల్డ్ అనే అమెరికా నౌకాదళ సభ్యుడు హతమార్చాడని అప్పటి ఏజెన్సీలు పేర్కొన్నప్పటికీ దీని వెనక భారీ కుట్ర దాగి ఉందని ఇప్పటికీ అమెరికన్లు భావిస్తున్నారు. 2018, ఏప్రిల్ 26 లోపల కెన్నెడీ హత్యలోని మరిన్ని ఆసక్తికర అంశాలను విడుదల చేయనున్నట్లు వైట్ హౌజ్ పేర్కొంది. క్యాస్ట్రోను హతమార్చేందుకు సీఐఏ పాత్ర గురించి తాజా పత్రాల్లో వెల్లడైంది. క్యూబాను హస్తగతం చేసుకోవటం కోసం చేసిన కుట్రకోణాలు వెల్లడయ్యాయి. కెన్నెడీ హత్యకు సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతోనే ఈ వివరాలు వెల్లడించినట్లు నేషనల్ ఆర్కైవ్స్ పేర్కొంది.
క్యాస్ట్రోను చంపించేందుకు..
‘ఫిడేల్ క్యాస్ట్రోను అంతమొందించాలని సీఐఏ ప్రయత్నించింది. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే’ అని తాజా నివేదికలు పేర్కొన్నాయి. ‘క్యాస్ట్రో’ పేరుతో ఉన్న 1975 నాటి ఓ డాక్యుమెంట్లో.. క్యూబా పీఠం నుంచి క్యాస్ట్రోను తప్పించేలా అమెరికా ప్రభుత్వం 1960ల్లో చేసిన ప్రయత్నాలున్నాయి. ఆపరేషన్ బౌంటీ పేరుతో గ్యాంగ్స్టర్ల సాయంతో లేదా మిలటరీ ఆపరేషన్తోనైనా క్యూబాపై పట్టు సంపాదించాలని అమెరికా కుట్రపన్నినట్లు వెల్లడైంది. క్యాస్ట్రో ప్రభుత్వంలోని అధికారులు, ముఖ్యమైన నాయకులను హతమార్చేందుకు.. రెండు సెంట్ల (0.16 డాలర్లు) నుంచి మిలియన్ డాలర్ల వరకు ఒక్కొక్కరి కి ఒక్కో రేటును నిర్ణయించింది. ఈ వివరాలున్న కరప త్రాల్ని విమానం ద్వారా క్యూబా అంతటా వదిలిపెట్టాలని కూడా అమెరికా ప్రణాళికలు రూపొందించింది.
తద్వారా క్యూబన్లే క్యాస్ట్రోను, అతని అనుచరులను చంపేందుకు ప్రోత్సహించాలని భావించింది. తమ పక్కలో బల్లెంలా ఉన్న క్యూబా అధ్యక్షుడి అడ్డు తప్పించేందుకు అమెరికా అత్యంత తక్కువ మొత్తాన్ని ఎరగా వేసింది. కెన్నెడీ హత్యకు ముందు.. క్యూబాలో కమ్యూనిజాన్ని అంతమొందించేందుకు ‘ఆపరేషన్ ముంగూస్’ ప్రణాళికలనూ 1962నాటి జాతీయ భద్రత మండలి దస్తావేజులు స్పష్టం చేశాయి. ‘సీఐఏ.. గ్యాంగ్‌స్టర్ సామ్ జియంకానా మధ్యవర్తిత్వంతో క్యాస్ట్రోను హతమార్చేందుకు ఓ షూటర్‌తో లక్షన్నర డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది’ అని అధ్యక్షుడు కెన్నెడీ సోదరుడు, అప్పటి అటార్నీ జనరల్ రాబర్ట్ కెన్నడీ ఎఫ్‌బీఐకి వెల్లడించినట్లు ఈ నివేదిక పేర్కొంది.
కెన్నెడీ హత్య వెనక
జాన్ ఎఫ్ కెన్నెడీ హంతకుడు లీ హార్వీ ఓస్వాల్డ్ నుంచి హత్యకు కొద్దిరోజుల ముందు ఎఫ్‌బీఐకి బెదిరింపు సందేశం వచ్చినట్లు ఈ రికార్డుల ద్వారా వెల్లడైంది. ఓస్వాల్డ్కు విదేశీ (రష్యా, క్యూబా) ఇంటెలిజెన్స్ సంస్థలతో సంబంధాలున్నాయని ఎఫ్‌బీఐ పేర్కొన్నట్లుగా రిపోర్టుల్లో ఉంది. 1963 మార్చి నుంచి డిసెంబర్ వరకు సంపాదించిన జాబితా ప్రకారం ప్యుర్టోరికన్లు, గ్యాంగ్స్టర్లు, మానసిక ఆరోగ్యం సరిగా లేనివాళ్లు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని ఎఫ్‌బీఐ భావించింది. కెన్నెడీ హత్యకు పదిరోజుల ముందు రాబర్ట్ సీ రాల్స్ అనే వ్యక్తి 100డాలర్ల బెట్టింగ్ పెట్టారని ఆయన్ను సీక్రెట్ సర్వీస్ విచారించిందని వెల్లడైంది. బార్లో ఓ వ్యక్తి కెన్నెడీ హత్య గురించి మాట్లాడుతుండగా విన్నానని.. అయితే చీకట్లో, మద్యం మత్తులో అతని ముఖం చూడలేదని రాల్స్ వెల్లడించారు.
కెన్నెడీ హత్యకు కొద్ది ముందు..
జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు కొద్ది సేపటిముందు ‘కేంబ్రిడ్జ్ న్యూస్’ అనే బ్రిటీష్ పత్రికకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని.. అమెరికాకు సంబంధించి పెద్ద వార్త రాబోతోందనే సందేశాన్నిచ్చిందని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. 1969 నవంబర్ 26న ఎఫ్‌బీఐకి సీఐఏ రాసిన రాసిన లేఖలో ఈ వివరాలున్నాయి. ‘కేంబ్రిడ్జ్ న్యూస్ రిపోర్టర్ లండన్‌లోని అమెరికన్ ఎంబసీకి ఈ విషయాలని తెలపాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు’ అని నివేదిక పేర్కొంది. బ్రిటన్ ఎమ్ఐ5 ఇంటెలిజెన్స్ సర్వీస్ వివరాల ప్రకారం హత్యకు 25 నిమిషాల ముందు ఈ కాల్ వచ్చినట్లు తెలిసింది. కాల్ అందుకున్న రిపోర్టర్ మంచివాడని.. ఎలాంటి నేర చరిత్ర లేదని ఎమ్ఐ5 ధ్రువీకరించింది.
ట్రంప్ ఆదేశాలతోనే..
1963, నవంబర్ 22న డాలస్‌లో జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించిన 2,891 రికార్డులను విడుదల చేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో నేషనల్ ఆర్కైవ్స్ వీటిని బహిర్గతం చేసింది. అయితే భద్రత ఏజెన్సీల విన్నపం మేరకు పలు పత్రాలను విడుదల చేయకుండా ఉండేందుకు ట్రంప్ అంగీకరించారు. ‘రక్షణ, భద్రత, ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు, చట్ట బద్ధ సంస్థలకు నష్టం జరగకుండా కాపాడేందుకు, విదేశీ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని పలు వివరాలు వెల్లడి చేయకుండా తాత్కాలిక నిషేధం విధించాం’ అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో కీలకమైన కెన్నెడీ హత్య గురించి ప్రజలకు అన్ని వివరాలు తెలియాలనే ఉద్దేశంతోనే వీటిని బహిర్గత పరిచామని ఆయన తెలిపారు. ‘ఏజెన్సీలు పారదర్శకంగా పనిచేయాలని.. ఆలస్యం చేయకుండా ఈ నివేదికల్లో స్వల్పమైన మార్పులు మాత్రమే చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సరా శాండర్స్ తెలిపారు.