‘ఇప్పుడాయన లేకుండా బతికేయాలి’
మెక్సికో: క్యూబా ప్రజల ఆరాధ్య దైవం ఫిడెల్ క్యాస్ట్రో మరణంపట్ల ఒకప్పుడు ఆయనకు అండగా నిలిచి పోరాటయోధుడిగా తనను నిరూపించుకునేలా చేసిన ఆంటోనియో డెల్ కాండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్యాస్ట్రో మృతిపట్ల స్పందించేందుకు మాటలు రావడం లేదని అన్నారు. 1956లో గ్రాన్మా అనే నౌకను ఫిడెల్ క్యాస్ట్రోకు ఏర్పాటు చేసింది ఈయనే. దీని ద్వారానే ఫిడెల్ ఆయనతోపాటు మొత్తం 82మంది మెక్సికో నుంచి క్యూబా వెళ్లి విప్లవాన్ని లేవదీశారు. అది విజయవంతం అయింది. దీంతో అప్పటి నుంచి క్యాస్ట్రోకు ఆంటోనియో మంచి మిత్రుడయ్యారు. ఆంటోనియోపై క్యాస్ట్రో పలుమార్లు ప్రశంసలు కురిపించారు.
ఈ నేపథ్యంలో క్యాస్ట్రో మృతి విషయం తెలుసుకున్న ఆయన వెంటనే మరికొందరు మెక్సికన్లతో కలిసి క్యూబా రాయబార కార్యాలయానికి వెళ్లి తన సంతాపం ప్రకటించారు. ‘క్యాస్ట్రో చనిపోయారని తెలిసి నాకు ఏం మాటలు రావడం లేదు. ఆయన నాకు కొత్త జీవితాన్ని తెలిపాడు. ఇప్పుడాయన లేకుండా జీవించాలని చెప్పి వెళ్లిపోయారు’ అని కన్నీటిపర్యంతం అయ్యారు. క్యూబా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.30కి ఫిడేల్ కన్నుమూశారు. ఈ నెల 26 నుంచి తొమ్మిది రోజులను సంతాప దినాలుగా క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. నాలుగురోజుల పాటు దేశమంతా క్యాస్ట్రో పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబర్ 4న శాంటియాగోలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమ అభిమాన నాయకుడి మరణవార్తతో క్యూబా శోకసంద్రంలో మునిగిపోయారు.