ప్రాచీన కట్టడాలను పరిశీలించిన సినీ సమీక్షకులు రంగారావు
ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో ఉన్న ప్రాచీన కట్టడాల చరి త్రను పరిశీలించి వివరాలు సేకరించడంలో భాగంగా భారతీయ సినీ, లలిత, సంగీత సుప్రసిద్ధ సమీక్షకులు చైన్నైవాసి వీఏకే రంగారావు సోమవారం ఆర్మూర్ పట్టణాన్ని సందర్శించారు. సిద్దుల గుట్ట చరిత్రను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ లో ఉన్న నవలా రచయిత డాక్టర్ నందిని రామరాజు దంపతుల ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ కట్టడాలను సందర్శించి వాటి చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకున్నామన్నారు.
జిల్లా కేంద్రంలోని ఖిల్లా కోట, బాల్కొండ కోట, దోమకొండ కోటలతో పాటు చారిత్రక కట్టడాల గురించిన సమాచారాన్ని సేకరించామన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కోట, కుంటాల, పొచ్చెర జలపాతాలను సందర్శించామన్నారు. అనంతరం నందిని రామరాజు దంపతులు, జిల్లా క్లాసిక్ సినిమా, కల్చరల్ సొసైటీ ప్రతినిధులు మేక రామస్వామి, వీపీ చందన్ రావు, చిటిమల విద్యాసాగర్ ఆయనను ఘనంగా సన్మానించారు.