Finance Service Company
-
18 లక్షల జాబ్స్.. అభ్యర్థులు కరువు!
దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని వార్తల్లో చూస్తున్నాం. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు వేల సంఖ్యలో అభ్యర్థులు వస్తుండటం గమనిస్తున్నాం. అయితే ఆర్థిక సేవల రంగంలో మాత్రం సరైన అభ్యర్థుల్లేక లక్షల్లో జాబ్స్ ఖాళీగా ఉన్నాయి.గత ఏడాది ఆర్థిక సేవల రంగంలో దాదాపు 18 లక్షల ఉద్యోగాలు అభ్యర్థులు లేక ఖాళీగా ఉండిపోయాయని, దీంతో ఆ రంగం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా (ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్) ఉన్నతాధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.ఆర్థిక సేవల రంగంలో దాదాపు 6,000 మందికి ఉపాధి కల్పిస్తున్న గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీ వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో దాదాపు 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా సీఈవో క్రిషన్ మిశ్రా పీటీఐకి తెలిపారు."గత సంవత్సరం, కేంద్ర ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్ అందించిన డేటా ప్రకారం, భారత్ ఆర్థిక సేవలలో 46.86 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. వాటిలో 27.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. 18 లక్షల ఉద్యోగాలకు అభ్యర్థులు లేరని చూపిస్తోంది. ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాటికి తగిన సామర్థ్యం కలిగిన అభ్యర్థులు లేరు" అని మిశ్రా అన్నారు."బ్యాంకులు, బీమా కంపెనీలు, బ్రోకరేజ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు ఎల్లప్పుడూ శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుంది. మీరు ఆన్లైన్ జాబ్ సెర్చ్ చేస్తే, ప్రస్తుతం ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (CFP) నిపుణులకు 40 రెట్లు అధికంగా ఉద్యోగఖాళీలున్న విషయం తెలుస్తుంది”అని పేర్కొన్నారు. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా 2.23 లక్షల మంది సీఎఫ్‌పీ నిపుణులు ఉండగా భారత్‌లో 2,731 మంది మాత్రమే ఉన్నారు. -
మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీస్‌కి రూ. 6.77 కోట్లు జరిమానా.. ఎందుకంటే?
లోన్స్ అందించే సమయంలో రుణగ్రహీతలకు వడ్డీరేట్లను వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలను పాటించడంలో ముంబైలోని మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విఫలమైంది. నియమాలను అతిక్రమించినందుకు గాను రిజర్వ్ బ్యాంక్ రూ. 6.77 కోట్ల జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కెవైసి (Know Your Customer) నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఇండియన్ బ్యాంక్‌పై రూ. 55 లక్షలు జరిమానా విధించినట్లు కూడా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తెలిపింది. అంతే కాకూండా 2016లో మోసాల పర్యవేక్షణలోని కొన్ని నిబంధనలను పాటించనందుకు ఎర్నాకులంలోని ముత్తూట్ మనీ లిమిటెడ్‌పై రూ. 10.50 లక్షల జరిమానా విధించడం జరిగింది. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ధరించిన వాచ్ స్పెషలేంటో తెలుసా? ఎన్ని కోట్లు ఉంటుందంటే..?) పెనాల్టీలనేవి రెగ్యులేటరీ సమ్మతిలోని లోపాలపై ఆధారపడి ఉంటాయి. కస్టమర్లతో వారు కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటుపై ఉచ్ఛరించడానికి ఉద్దేశించినది కాదని RBI స్పష్టం చేసింది. మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై చట్టబద్ధమైన తనిఖీ 2019 మార్చి 31 & 2020 మార్చి 31 నాటికి దాని ఆర్థిక స్థితికి సంబంధించింది. (ఇదీ చదవండి: మహీంద్రా కార్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్! థార్ కొనుగోలుపై ఏకంగా..) రుణాల కోసం పారదర్శక విధానాలకు సంబంధించి కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుర్తించినట్లు తెలిపింది. నిజానికి రుణాలను మంజూరు చేసేటప్పుడు రుణగ్రహీతలకు విధించే వార్షిక వడ్డీ రేట్లను వెల్లడించడంలో కంపెనీ విఫలమైంది. రుణగ్రహీతలకు వారి రుణాల నిబంధనలు, షరతులకు మార్పులు చేసినప్పుడు వారికి తెలియజేయలేదు. -
స్నేహాన్ని ‘క్రెడిట్’ చేసుకున్నాడు
గచ్చిబౌలి: సహ ఉద్యోగుల క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఓ ఫైనాన్స్ సర్వీస్ కంపెనీలో పనిచేసే యువకుడు దాదాపు 40 మందిని బురిడి కొట్టించాడు. బాధితులు ఆ యువకుడిని పోలీసులకు అప్పగించినా సివిల్ వివాదంగా పరిగణించి ఫిర్యాదు తీసుకోలేదు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. కొండాపూర్‌లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు రీసెర్చ్ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అత్యవసరం ఉందని చెప్పి తోటి ఉద్యోగుల క్రెడిట్ కార్డులు తీసుకునేవాడు. ఇలా 40 మంది నుంచి రూ.80 లక్షలు వాడుకున్నాడు. 2006 నుంచి ఇదే రీతిలో బురిడి కొట్టించడంతో బాధితులు ఆ యువకుడి తండ్రికి చెప్పి గోడు వెళ్లబోసుకోగా అతడు సెటిల్ చేస్తానని చెప్పాడు. కొద్ది నెలలు దాటిన తరువాత తండ్రి తాను ఏమి చేయలేనని చేతులెత్తేశాడు. దీంతో యువకుడిపై ఒత్తిడి పెంచడంతో కొందరికి చెక్కులు ఇచ్చాడు. రెండు నెలలుగా కంపెనీకి రావడంలేదు. మంగళవారం వచ్చిన యువకుడిని పట్టుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. అయితే, క్రెడిట్ కార్డులు ఇష్ట పూర్వకంగా ఇచ్చారని, సివిల్ వివాదంగా పరిగణించి ఫిర్యాదును స్వీకరించలేమని ఎస్ఐ నరేష్ తెలిపారు. అవసరానికి క్రెడిట్ కార్డులు వాడుకుని మొదట్లో డబ్బులు సమయానికి చెల్లించి నమ్మించాడని బాధితులు వేమారెడ్డి, ప్రేమ్, అనిల్, చక్రవర్తి, ప్రేమ్ కుమార్, సుధీర్ పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని వారు వాపోయారు.