స్నేహాన్ని ‘క్రెడిట్’ చేసుకున్నాడు | Friendship 'credit' | Sakshi
Sakshi News home page

స్నేహాన్ని ‘క్రెడిట్’ చేసుకున్నాడు

Published Wed, Dec 31 2014 1:35 AM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

Friendship 'credit'

గచ్చిబౌలి: సహ ఉద్యోగుల క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఓ ఫైనాన్స్ సర్వీస్ కంపెనీలో పనిచేసే యువకుడు దాదాపు 40 మందిని బురిడి కొట్టించాడు. బాధితులు ఆ యువకుడిని పోలీసులకు అప్పగించినా సివిల్ వివాదంగా పరిగణించి ఫిర్యాదు తీసుకోలేదు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. కొండాపూర్‌లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు రీసెర్చ్ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అత్యవసరం ఉందని చెప్పి తోటి ఉద్యోగుల క్రెడిట్ కార్డులు తీసుకునేవాడు.

ఇలా 40 మంది నుంచి రూ.80 లక్షలు వాడుకున్నాడు. 2006 నుంచి ఇదే రీతిలో బురిడి కొట్టించడంతో బాధితులు ఆ యువకుడి తండ్రికి చెప్పి గోడు వెళ్లబోసుకోగా అతడు సెటిల్ చేస్తానని చెప్పాడు.  కొద్ది నెలలు దాటిన తరువాత తండ్రి తాను ఏమి చేయలేనని చేతులెత్తేశాడు. దీంతో యువకుడిపై ఒత్తిడి పెంచడంతో కొందరికి చెక్కులు ఇచ్చాడు. రెండు నెలలుగా కంపెనీకి రావడంలేదు. మంగళవారం వచ్చిన యువకుడిని పట్టుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. అయితే, క్రెడిట్ కార్డులు ఇష్ట పూర్వకంగా ఇచ్చారని, సివిల్ వివాదంగా పరిగణించి ఫిర్యాదును స్వీకరించలేమని ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
 
అవసరానికి క్రెడిట్ కార్డులు వాడుకుని మొదట్లో డబ్బులు సమయానికి చెల్లించి నమ్మించాడని బాధితులు వేమారెడ్డి, ప్రేమ్, అనిల్, చక్రవర్తి, ప్రేమ్ కుమార్, సుధీర్ పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని వారు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement