The financial crisis
-
సీఏ జీతాల్లో కోత
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోన్న కోవిడ్–19 ప్రభావం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై పడింది. కరోనాతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా భారీ స్థాయిలో జీతాల కోత విధింపుతో పాటు సిబ్బందిని తీసివేయనున్నట్లు సీఏ గురువారం ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 30 వరకు తమ ఉద్యోగుల, కాంట్రాక్టర్ల జీతాల్లో 80 శాతం కోత విధించనున్నట్లు సీఏ వెల్లడించింది. దీనితో పాటు ఈ పరిస్థితుల్లో ఎలాంటి క్రీడా ఈవెంట్లు జరిగే వీలు లేనందున ఈ రెండు నెలల పాటు కొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. -
సెన్సెక్స్‌కు కీలక స్థాయి 37,415
కరోనావైరస్ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒకేవారంలో ఎన్నడూ చూడనంత పెద్ద పతనం అంతర్జాతీయ మార్కెట్లలో సంభవించింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్...వడ్డీ రేట్ల కోత, ఇతర ఉద్దీపన చర్యలకు సిద్ధంగా వున్నట్లు గత శుక్రవారం ప్రకటించడంతో ఆరోజున అమెరికా స్టాక్ సూచీలు కనిష్టస్థాయి నుంచి చాలావరకూ కోలుకున్నప్పటికీ, ఈ ఉద్దీపన ప్రకటన ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా అన్నది అనుమానమే. చైనా కేంద్ర బ్యాంకు గత పదిరోజుల్లో ఇటువంటి ఎన్నో ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ దేశపు సూచీలు ఇంకా పతనబాటలోనే వున్నాయన్నది గమనార్హం. వ్యాధివ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, విక్రయాలు తిరిగి సాధారణస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కన్పిస్తేనే ఈక్విటీ మార్కెట్లు స్థిరపడగలుగుతాయన్నది అత్యధిక విశ్లేషకుల భావన. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి..... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఫిబ్రవరి 28తో ముగిసినవారంలో 38,220 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 2,873 పాయింట్ల భారీనష్టంతో 38,297పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు భారీ కదలికల రీత్యా, ఈ వారం సైతం సెన్సెక్స్ ఎటువైపైనా వేగంగా ప్రయాణించవచ్చు. గతేడాది అక్టోబర్ 9నాటి ‘స్వింగ్ లో’ అయిన 37,415 స్థాయి ఈ వారం సెన్సెక్స్‌కు ముఖ్యమైన తక్షణ మద్దతు. ఈ మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగినా, గ్యాప్‌అప్‌తో మొదలైనా.... క్రితంవారపు భారీ కరెక్షన్కు కౌంటర్ట్రెండ్ ర్యాలీ జరిగి 39,090 పాయింట్ల వద్దకు వెంటనే చేరగలదు. అటుపై 39,420 పాయింట్ల వరకూ ఎగిసే అవకాశం వుంటుంది. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే 39,950–40,255 పాయింట్ల శ్రేణిని సైతం చేరే ఛాన్స్ వుంటుంది. అయితే తొలి మద్దతుస్థాయిని వదులుకుంటే డౌన్‌ట్రెండ్ మరింత వేగవంతమై 36,720 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున ముగిస్తే 35,990 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. 11,090 వద్ద మద్దతు పొందితే నిఫ్టీ సేఫ్... గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,175 పాయింట్ల వరకూ పతనమై చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 879 పాయింట్ల భారీనష్టంతో 11,202పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లానే నిఫ్టీకి సైతం గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 11,090 పాయింట్ల స్థాయి కీలకమైనది. ఈ స్థాయిని పరిరక్షించుకున్నా, గ్యాప్‌అప్‌తో మొదలైనా వేగంగా 11,385 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ స్థాయిని అధిగమిస్తే 11,535 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై 11,660–11.780 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. తొలి మద్దతుస్థాయిని కోల్పోతే వేగంగా 10,930 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. 2018 అక్టోబర్ 23నాటి 10,004 పాయింట్ల నుంచి ఈ ఏడాది జనవరి 20 నాటి 12,430 పాయింట్ల రికార్డుస్థాయివరకూ జరిగిన ర్యాలీకి ఈ 10,930 పాయింట్లు...61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్ స్థాయి. ఈ స్థాయిని సైతం వదులుకుంటే ప్రస్తుత కరెక్షన్ మరెన్నో వారాలు కొనసాగే ప్రమాదం వుంటుంది. ఈ వారం ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 10,670 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. -
ఖజానా ఖాళీ
= సీఎం మెప్పుకోసం ఉన్న నిధులు వాడేశారు = మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందని నిధులు = బకాయిలు వసూలైతేనే ఉద్యోగులకు జీతాలు = కార్పొరేషన్లో ఆర్థిక సంక్షోభం = ఆందోళనకు గురిచేస్తున్న ఒకటో తారీఖు కార్పొరేషన్ ఖజానా అడుగంటింది. మార్చి ఒకటో తేదీన ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల కోసం అధికారులు వెతుకులాట సాగిస్తున్నారు. పైకి బింకం ప్రదర్శిస్తూనే లోలోన మథనపడుతున్నారు. సీఎం మెప్పుకోసం ఉన్న నిధులను ఊడ్చిపెట్టారు. బకాయిల వసూళ్లు మందగించడం, అకౌంట్స్ అధికారులు ఆర్థిక క్రమశిక్షణ తప్పడం వంటి పరిణామాలు ఉద్యోగుల పాలిట శాపంగామారాయి. అమ్మో ఒకటో తారీఖు... అనే పరిస్థితికి నగరపాలక సంస్థను దిగజార్చాయి విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. జీతాల కోసం లాటరీ కొట్టాల్సిన పరిస్థితి ఉద్యోగులను వెంటాడుతోంది. ఉద్యోగులు, డ్వాక్వా, సీఎంఈవై కార్మికులకు, రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు రూ.16 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కార్పొరేషన్ ఖజానాలో రూ.4 కోట్ల మేర నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితిని మేయర్ కోనేరు శ్రీధర్ అకౌంట్స్ అధికారులతో శనివారం చర్చించగా ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని వారు చెప్పారని సమాచారం. బకాయిలు వసూలైతే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చేతులెత్తేసినట్లు తెలిసింది. డ్వాక్వా, సీఎంఈవై కార్మికులకు ఫిబ్రవరి ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాన్ని 23న ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో అంకెలు రంకెలేయించారు. వాస్తవ పరి స్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం పాలకుల్లో కలకలం రేపుతోంది. ఆర్థిక క్రమశిక్షణ లోపం: ఆర్థిక క్రమశిక్షణ తప్పడం వల్లే ఈ దుస్థితి దాపురించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల జీతాల సొమ్మును రిజర్వులో ఉంచాలన్న సూత్రాన్ని అధికారులు విస్మరిం చారు. సీఎం చంద్రబాబు మెప్పుకోసం నిధులను ఎడాపెడా వాడేశారు. మహిళా పార్లమెంట్, నావీ విన్యాసాలు, కైట్ షో తదితరాలకు కార్పొరేషన్ నిధులను కొంతమేర వాడారు. సీఎం క్యాంప్ ఆఫీస్ శానిటేషన్ నిర్వహణకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నిధులు రాబట్టలేకపోయారు. రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు శానిటేషన్ పనులకు సంబంధించి సీఆర్డీఏ నుంచి సొమ్ములు వసూలు చేయలేక చతికిలపడ్డారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఒక్క నవంబర్ నెల్లోనే పాత బకాయిల కింద రూ.15 కోట్లు కార్పొరేషన్ ఖజానాకు చేరింది. అందులో కొంతమేర పుష్కర పనులు చేసిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారనే అభియోగాలు ఉన్నాయి. వెరసి కార్పొరేషన్ ఖజానా చిక్కిపోయింది. కృష్ణా పుష్కరాలకు సంబంధించి రూ.186 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిం చింది. ఇందులో రూ.91 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగితా రూ.95 కోట్లు విడుదల చేయాలంటూ కమిషనర్ జి.వీరపాండియన్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ రాశారు. ఇది జరిగి నెల రోజులు గడిచినా స్పందన లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై కమిషనర్ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా బిల్డింగ్పీనలైజేష్ స్కీం(బీపీఎస్) కింద కార్పొరేషన్‌కు జమయిన రూ.72 కోట్లలో రూ.35 కోట్లను జనరల్ ఫండ్స్‌కు బదలాయించి, రూ.35 కోట్లకు పుష్కర కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అత్యతం విశ్వసనీయంగా తెలుస్తోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో కార్పొరేషన్ ఖజానాకు గండిపడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రెజరీలో చూడాలి: ట్రెజరీలో నిధుల లభ్యతను పరిశీలించాల్సి ఉంది. వసూలు కావాల్సిన బకాయిలపై దృష్టి పెడుతున్నాం. సాధ్యమైనంత వరకు ఒకటో తేదీకే జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తున్నాం. పుష్కర పనులకు జనరల్ ఫండ్స్‌ను వాడటం లేదు. – శివశంకర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, నగరపాలక సంస్థ -
అంత వీజీ కాదు
ఒలింపిక్స్ నిర్వహణ ఓ పెద్ద తలనొప్పి అంచనాలను మించుతున్న ఖర్చు క్రీడల తర్వాత ఆర్థిక సంక్షోభం ఒకరిని మించి మరొకరు... ఒకరితో పోటీ పడి మరొకరు... నాలుగేళ్ల తర్వాత ఈ మాత్రం ఖర్చు పెరగదా అన్నట్లుగా ప్రతీ సారి కొండలా పెరిగిపోతున్న బడ్జెట్... ఒలింపిక్స్‌కు బిడ్ వేసిన నాటినుంచి క్రీడలు నిర్వహించే వరకు ప్రతీ చోటా అతి. అడగడుగునా హంగూ, ఆర్భాటం... వీటికి తోడు పారదర్శకత లేకపోవడం, అవినీతితో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ ఆయా నగరాలకు తలకు మించిన భారంగా మారుతోంది. బిడ్ సమయంలో కనిపించిన ఉత్సాహం, క్రీడలు ముగిశాక ఆవేదనగా మారుతోంది. ఒలింపిక్స్ నిర్వహించిన నగరాలు, దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. గతంలో నగరాలు ఈవెంట్ ముగిశాక లెక్కా పద్దులపై ఆందోళన చెందితే... ఇప్పుడు రియో పోటీలకు ముందే గుండెలు బాదుకుంటోంది. బ్రెజిల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో క్రీడల నిర్వహణ దేశానికి మరింత భారంగా మారి, అది ఆందోళనగా రూపాంతరం చెందింది. సాక్షి క్రీడా విభాగం ‘మాకొద్దీ ఒలింపిక్స్... అదేమైనా మా జీవితాలు మారుస్తుందా, మా నగరానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు చాలు, కొత్తగా వచ్చేదేమీ లేదు, పర్యాటకులు రాకపోయినా పర్వాలేదు’... ఇదేదో అభివృద్ధి చెందుతున్న దేశమో, ఆర్థికంగా గొప్పగా లేని దేశంనుంచో వస్తున్న మాట కాదు. అమెరికాలోని బ్రిస్టల్, జర్మనీ నగరం హాంబర్గ్, నార్వే (ఓస్లో), స్వీడన్ (స్టాక్‌హోం) దేశాలు... గత కొన్నేళ్లలో ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఆరంభంలో పోటీ పడి ఆ తర్వాత మా వల్ల కాదంటూ ముందే చేతులెత్తేశాయి. ఇవన్నీ ఓటింగ్ ద్వారా ప్రజల అభిప్రాయం తెలుసుకొని మరీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. తమ నగరంలో జరుగుతున్నాయని పక్షం రోజుల సంబరం తప్ప దాని వల్ల ఎలాంటి లాభమూ లేదని, తర్వాతి కాలంలో మరింత సమస్యలు వస్తాయని వారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. 2012 లండన్ ఒలింపిక్స్ నిర్వహణ అంచనా వ్యయం 2.4 బిలియన్ పౌండ్లు అయితే ముగిసే సరికి అసలు ఖర్చు 8.92 బిలియన్ పౌండ్లుగా తేలడం ఆయా దేశాలను భయపెట్టేసింది. బ్రెజిల్ అత్యుత్సాహం ‘మా దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అసలు నిరుద్యోగం అనేదే లేదు. రియో సముద్ర తీరంలో పెద్ద మొత్తంలో కొత్తగా బయటపడ్డ ఆయిల్ నిక్షేపాలతో మా ఆదాయానికి తిరుగు లేదు. ఇప్పటికే ఫుట్‌బాల్ ప్రపంచ కప్ హక్కులు దక్కించుకున్నాం. ఇక ఒలింపిక్స్‌తో మా కీర్తి మరింత పెరుగుతుంది. మేం బాగా నిర్వహించగలమనే నమ్మకం ఉంది’... 2009లో రియోకు ఒలింపిక్స్ కేటాయించినప్పుడు ఐఓసీ ముందు బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు మెరెలెస్ చేసిన భారీ ఉపన్యాసం ఇది. 2016 ఒలింపిక్స్ నిర్వహణ కోసం 2009లో బిడ్డింగ్ జరిగింది. ప్రాథమిక వడపోతలో చికాగో, టోక్యో తప్పుకోగా, మాడ్రిడ్‌తో పోటీ పడి రియో డి జనీరో అవకాశం దక్కించుకుంది. నాడు కోపకబానా బీచ్‌లోకి వచ్చి భారీగా సంబరాలు చేసుకున్న జనం ఇప్పుడు భోరుమంటున్నారు. మారిన సీన్ గత ఏడేళ్లలో బ్రెజిల్లో పరిస్థితి బాగా మారిపోయింది. ఒక్కసారిగా ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టు ముట్టింది. 1990 తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దేశాధ్యక్షుడిపై తిరుగుబాటు జరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. గతంలో ఎన్నడూ నామమాత్రంగా కూడా లేని మౌలిక సౌకర్యాలను కల్పించే ప్రయత్నంలో భారీగా డబ్బు ఖర్చు చేశారు. విద్యుత్ సమస్య ఎక్కువగా ఉండే రియో నగరంలో నిరంతర విద్యుత్ కోసం భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. పైగా వీటి కాంట్రాక్ట్‌ల విషయంలో అవినీతి అమితంగా పెరిగిపోయింది. ఫలితంగా ప్రజల్లో ఒలింపిక్స్ సెంటిమెంట్ తగ్గిపోవడంతో పాటు అసహనం పెరిగింది. దాంతో జనం రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, ర్యాలీలు చేయడం మొదలు పెట్టారు. ఒలింపిక్స్ తేదీలు ఇంత దగ్గరగా వచ్చినా నిధుల లేమి కారణంగా ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు. అయితే బ్రెజిల్ అధికారులు, ఐఓసీ మాత్రం అంతా బాగుందంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఐఓసీ అత్యాశ ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా చూసేవారి కన్నా టీవీ రేటింగ్‌ల వల్ల వచ్చే ఆదాయమే భారీగా ఉంటుంది. ఈ మెగా ఈవెంట్‌కు ఉండే క్రేజ్ వల్ల ఇది ఎలాగూ తగ్గదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జేబులోకే ఇదంతా వెళుతుంది. ఐఓసీ అథ్లెట్లకు డబ్బులు చెల్లించదు. తమ ఆదాయాన్ని సభ్య దేశాలతో పంచుకోదు. అథ్లెట్లను పంపినందుకు కూడా ఆయా దేశాలకు ఏమీ ఇవ్వదు. మౌలిక సౌకర్యాల కల్పన గానీ, ప్రాధమిక పెట్టుబడి కానీ ఏమీ పెట్టదు. చివరకు పన్నులు కూడా చెల్లించదు. రూపాయి ఖర్చు లేకుండా తమ నియంత్రణ ఉండాలని కోరుకుంటుంది. పైగా ఐఓసీ అవినీతికి అడ్డాగా మారడం కూడా నిర్వహణా వ్యయాన్ని పెంచేస్తోంది. బిడ్డింగ్ చేయడం, ఆ తర్వాత దానికి ప్రచారం కల్పించడం భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం. ఇక హక్కులు దక్కించుకున్న నగరానికి ప్రతీ సారి నిబంధనలు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది సరిపోదు, ఇంకా బాగుండాలి అంటూ సవాలక్ష ఒత్తిడులు. దేనికీ సంతృప్తి చెందకుండా వంకలు పెట్టడంతో మరింత బాగా చేయాలంటూ ఆతిథ్య దేశాలు ఇబ్బందుల్లో పడిపోతున్నాయి. ఒలింపిక్స్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు కొత్త నగరాల కోసం చూస్తున్నామంటూ ఐఓసీ చెప్పే మాటలు బూటకమే. ఇలాంటి స్థితిలో మున్ముందు ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఏ దేశమైనా ముందుకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే రియోలో ఒలింపిక్స్ జరిగిపోవచ్చు కానీ నిర్వహణ అనంతర పరిణామాల గురించి ఆలోచన వస్తేనే ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. -
ఈక్విటీలు.. రూపాయే పసిడికి మార్గనిర్దేశం..!
వారంలో అంతర్జాతీయంగా తిరోగమనం దేశంలో అతి స్వల్ప లాభం ముంబై/న్యూయార్క్: చైనా మందగమనం... అంతర్జాతీయంగా మార్కెట్ల ప్రభావం అనూహ్యంగా పసిడిని 8వ తేదీతో ముగిసిన వారంలో భారీగా పుంజుకునేట్లు చేసినా... రెండవ వారం ఈ ధోరణి అంతర్జాతీయంగా కొనసాగలేదు. వారం వారీగా స్వల్ప నష్టాలతో ముగిసింది. పసిడి స్వల్పకాలంలో పెరిగినా... తిరిగి నెమ్మదిస్తుందని పలువురు విశ్లేషకులు పేర్కొన్న విధంగానే రెండవవారం ఫలితం వెలువడ్డం గమనార్హం. రానున్న కొద్ది రోజుల్లో కూడా పసిడికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్ల పనితీరు, దీనితోపాటు దేశీయంగా రూపాయి కదలికలు మార్గనిర్దేశం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. చైనాలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చితే మాత్రం పసిడి తిరిగి పుంజుకోవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే పలు వర్గాలు మాత్రం ఈ విలువైన మెటల్ దూకుడు స్వల్పకాలమేనని మాత్రం అంచనావేస్తున్నాయి. అంతర్జాతీయంగా... అంతర్జాతీయంగా న్యూయార్క్ కామెక్స్ ట్రేడింగ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర ఔన్స్ (31.1గ్రా)కు గడచిన వారంలో తొమ్మిది వారాల గరిష్ట స్థాయిలో 1,097 డాలర్ల వద్ద ముగియగా... 15వ తేదీతో ముగిసిన తాజా సమీక్షా వారంలో... తిరోగమించింది. 1,091 డాలర్లకు తగ్గింది. వెండి కూడా 13.91 డాలర్ల నుంచి స్వల్పంగా 13.89 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా తీవ్ర ఒడిదుడుకులు... మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురై... చివరకు స్వల్ప లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా మైనస్‌లో ఉన్నప్పటికీ స్థానిక కొనుగోళ్ల మద్దతు దీనికి ప్రధాన కారణం. 99.5 ప్యూరిటీ ధర 10 గ్రాములకు రూ.15 లాభపడి రూ.25,860 వద్ద ముగిసింది. 99.9 ప్యూరిటీ ధరా ఇంతే స్థాయిలో ఎగసి రూ.26,010 వద్ద ముగిసింది. వెండి కేజీకి రూ.120 నష్టంతో రూ.33,925 వద్ద ముగిసింది. -
బకాయిలు రూ. 100 కోట్లు
అధికారుల నిర్లక్ష్యం రెవెన్యూలో అవినీతి తిమింగలాలు ఎస్టేట్స్, టౌన్‌ప్లానింగ్‌లో జోరుగా అక్రమాలు కార్పొరేషన్ ఆదాయానికి గండి నగరపాలక సంస్థ ఆదాయానికి అధికారుల నిర్లక్ష్యంతో గండి పడుతోంది. వివిధ పన్నుల రూపంలో వసూలు కావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కోర్టు కేసులు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నాయి. పాత బకాయిలను రాబట్టి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉన్నా అధికారులు సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అక్రమార్కుల కాసుల కక్కుర్తి ఆదాయానికి గండికొడుతోంది. రెవెన్యూ, ఎస్టేట్స్, టౌన్‌ప్లానింగ్ విభాగాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ అరకొరగానే జమ అవుతోంది. ఏటా మామూళ్ల రూపంలో కోట్లాది రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఖాళీ స్థలాల పన్నుల రూపంలో ఏడాదికి రూ.8.48 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, సగం కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ.58.20 కోట్ల మేర ఖాళీ స్థలాల పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు రూ.22.34 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎస్టేట్స్ విభాగంలో మ్యుటేషన్ (పేరు మార్పు) ద్వారా రూ.11 కోట్లు రావాల్సి ఉందని అంచనా. గాడితప్పిన రెవెన్యూ రెవెన్యూ విభాగంలో ఆస్తిపన్ను ద్వారా ఏడాదికి రూ.82.58 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యం. తొలి అర్ధ సంవత్సరానికి గాను రూ.41.29 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.35 కోట్లు వసూలు చేశారు. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటానని కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. రెవెన్యూ విభాగం అవినీతికి కేరాఫ్‌గా మారిందనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. పైసలివ్వనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) స్థాయి అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కలేదు... ఎస్టేట్స్ విభాగం గ‘లీజు’లకు లెక్కే లేదు. నగరపాలక సంస్థకు చెందిన 69 షాపింగ్ కాంప్లెక్స్‌లలో 3,396 షాపులు ఉన్నాయి. ఇందులో 700 షాపులు సబ్ లీజుల్లో ఉన్నాయని సర్వేలో తేలింది. మ్యుటేషన్ వసూలు చేయడం ద్వారా సుమారు రూ.11 కోట్లు వసూలవుతోందని అంచనా. 25 సంవత్సరాలు నిండిన షాపు యజమానులు కోర్టుకు వెళ్లి ఇంజంక్షన్ ఆర్డర్ తేవడంతో బకాయిల వసూలు కష్టంగా మారింది. వివిధ విభాగాలకు సంబంధించి 636 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రొఫెషనల్ ట్యాక్స్ రూ.12.82 కోట్లు వసూలవుతుంది. ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల్ని గుర్తించడంలో సంబంధిత అధికారులు విలఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దోచేస్తున్నారు... నగరంలో 240 చదరపు గజాలలోపు మార్ట్గేజ్ లేకుండా జీ ప్లస్ 2కు అనుమతి ఇస్తామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నాలుగు నెలల క్రితం ప్రకటించారు. ఇంతవరకు జీవో మంజూరు కాలేదు. అనధికారిక కట్టడాల పేరుతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది గృహ యజమానులను దోచేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగం ఏడాదికి 2,500 గృహ నిర్మాణాలకు అనుమతి ఇస్తోంది. 240 గజాల లోపు భవనాలు ఇందులో 65 శాతం వరకు ఉంటాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులు మార్ట్‌గేజ్‌ను బూచిగా చూపడంతో గృహ యజమానులు బెంబేలెత్తి ఆమ్యామ్యాలు సమర్పించుకొంటున్నారన్నది బహిరంగ రహస్యం. బిల్డింగ్ లెసైన్స్ ఫీజులు, ఇతర ఫీజుల రూపంలో ఏడాదికి రూ.33.50 కోట్లు వసూలవుతోంది. 240 గజాల లోపు మార్ట్గేజ్ లేకుండా జీ ప్లస్ 2కు ప్రభుత్వం అనుమతిస్తే సుమారు రూ.15 కోట్ల మేర ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా. -
రైతన్నల బతుకుల్లో చీకట్లు
4,16,548 మంది రైతులకు మొండిచేయి రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్ల నోటీసులు పూటకో షరతుతో రైతన్నలకు సాంత్వన చేకూర్చని రుణ మాఫీ వడ్డీ.. అపరాధవడ్డీ తడిసిమోపెడవడంతోఆర్థిక సంక్షోభం సంక్రాంతి సంబరాలకు ప్రభుత్వం రూ. రెండు కోట్ల వ్యయం ప్రభుత్వం సంక్రాంతి సంబరాల్లో ఆర్భాటంగా మునిగితేలుతుంటే.. రైతన్నలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. రుణ మాఫీ అయిన మేరకు మినహా తక్కిన మొత్తాన్ని కట్టాలంటూ బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. నెలాఖరులోగా చెల్లించకుంటే బంగారు ఆభరణాలు వేలం వేస్తామంటూ ఇస్తున్న నోటీసులు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వడ్డీ.. అపరాధవడ్డీ కలిసి అప్పు తడిసిమోపడవడంతో చెల్లించే దారి తెలియక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఇందుకు తార్కాణం. తిరుపతి: రైతు రుణమాఫీని పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌పై రైతులు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రోజుకో తిరకాసు.. పూటకో షరతుతో రుణ మాఫీని నీరుగార్చారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.1.50 లక్షల పంట రుణం మాఫీ చేస్తానని పేర్కొన్న చంద్రబాబు.. దాన్ని కూడా ఐదు విడతల్లో అందిస్తానని సెలవిచ్చారు. రూ.50 వేల లోపు రుణాలను ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’తో నిమిత్తం లేకుండా ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించి.. ఆ నిబంధనకు నీళ్లొదిలారు. జిల్లాలో 8,70,321 మంది రైతులు డిసెంబర్ 31, 2013 నాటికి రూ.11,180.25 కోట్ల వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు. ఇందులో 4,53,162 మంది రైతులకు బంగారు నగలు తాకట్టుపై రూ.3486.50 కోట్లను వ్యవసాయ రుణంగా పొందారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి.. ఆ రైతులందరూ మాఫీకి అర్హులుగా తేల్చిన బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ.. ప్రభుత్వం తొలి విడత 3,06,544 మంది రైతులకు మాఫీని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రెండో విడత 1,42,229 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేసే అవకాశం ఉందని సమాచారం. అంటే.. 4,53,773 మంది రైతులకే మాఫీ వర్తింపజేసినట్లు స్పష్టమవుతోంది. 4,16,548 మంది రైతులకు మొండిచేయి చూపింది. ప్రభుత్వం విధించిన షరతులతో రుణాలపై వడ్డీ మేర కూడా మాఫీ కాకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. రూ.11,180.25 కోట్ల వ్యవసాయ రుణాలకుగానూ రూ.600 కోట్ల మేర మాత్రమే మాఫీ అయినట్లు బ్యాంకర్లు తేల్చారు. ఏడు నెలల్లో వ్యవసాయ రుణాలపై రూ.939 కోట్ల మేర అపరాధ వడ్డీ పడింది. వడ్డీ మేర కూడా మాఫీ కాకపోవడంతో ఆందోళన ఉన్న రైతులను బ్యాంకర్లు మరింత ఒత్తిడికి గురిచేస్తున్నారు. మాఫీ అయిన మొత్తం మినహా తక్కిన రుణాన్ని చెల్లించాలంటూ నోటీసుల మీద నోటీసులు జారీచేస్తుండడం.. బంగారు ఆభరణాలను వేలం వేస్తామంటూ ప్రకటనలు ఇస్తుండడం రైతన్నల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోంది. ఇది ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. రైతుల బతుకుల్లో చీకట్లు నింపిన చంద్రబాబు ప్రభుత్వం.. రూ.రెండు కోట్లను వెచ్చించి మంగళవారం తిరుపతిలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటుండడం గమనార్హం. -
పరిశ్రమలపై మరో పిడుగు!
నేటి నుంచి వారానికి రెండు రోజులు పవర్ హాలీడే సిటీబ్యూరో: అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పారిశ్రామిక రంగంపై తాజాగా మరో పిడుగు పడింది. ప్రస్తుతం వారానికి ఒక్క రోజు పవర్ హాలీడే ఉండగా.. దాన్ని రెండు రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కోతలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ కంపెనీ ప్రకటించింది. రంగారెడ్డి నార్త్, రంగారెడ్డి ఈస్ట్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్ సర్కిళ్ల పరిధిలో ఆది, సోమవారాల్లో పవర్ హాలీడే ఉండగా.. రంగారెడ్డి సౌత్‌లో శుక్ర, శనివారాల్లో ఈ కోతలు అమలులో ఉంటాయి. గృహాలకు నిత్యం ఉదయం 2, మధ్యాహ్నం 2 గంటల చొప్పున విద్యుత్ కోతలు యధావిధిగా కొనసాగుతాయి. విద్యుత్ సరఫరా, డిమాండ్‌కు మధ్య పెరిగిన వ్యత్యాసం వల్లే కోతల వేళలు పెంచాల్సి వచ్చిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తాజా విద్యుత్ కోతలపై పారిశ్రమిక వర్గాలు, గృహ వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. కోతల పెంపుతో పరిశ్రమల్లో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది. -
ఇచ్చింది గ్రాంటు కాదు.. పాత బకాయి
ఆర్టీసీకి రూ.250 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం దసరా అడ్వాన్సు చెల్లింపునకు మార్గం సుగమం దారిమళ్లిన సీసీఎస్, పీఎఫ్ మొత్తం తిరిగి చెల్లింపు అదనపు గ్రాంటు ఊసెత్తని సర్కారు హైదరాబాద్: భారీ నష్టాలతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్టీసీకి తాను బకాయిపడ్డ రీయింబర్స్‌మెంటు మొత్తం నుంచి ప్రభుత్వం రూ.250 కోట్లను విడుదల చేసింది. వివిధ వర్గాలకు ఇచ్చే బస్సు పాసుల రాయితీలకు సంబంధించి గత రెండేళ్లుగా ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేయటం లేదు. ఓవైపు నష్టాలు, మరోవైపు ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేయటంతో ఆర్టీసీ సంక్షోభంలో చిక్కుకుపోయింది. దీంతో తక్షణం రూ.250 కోట్ల అదనపు సాయా న్ని ప్రకటించాలని గత నెలలో యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీన్ని గ్రాంటు గా ఇవ్వాలని విజ్ఞప్తి చే సింది. మంత్రులు హరీశ్ రావు, మహేందర్‌రెడ్డి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసిమరీ దీనిపై అధికారులతో చర్చించి... ఆర్థికసాయం కోసం సీఎంకు విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించటంతో అంతమేర గ్రాంటు దక్కనుందని ఆర్టీసీ సంబరపడింది. ప్రభుత్వం మాత్రం అదనపు సాయంగా గ్రాం టును ప్రకటించకుండా... ఆర్టీసీకి బకాయిపడ్డ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లిస్తున్నట్టు ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నీ అందులోనే... ఏడాదికాలంలో ఆర్టీసీ ఏకంగా రూ.వెరుు్య కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో కార్మికుల పీఎఫ్, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నిధులనూ వాడుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కార్మికులు సమ్మెకు సిద్ధం కావటం తో వాటిని చెల్లిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిం ది. తాజా ఉత్తర్వుల మేరకు... 2012-13 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాయితీ పాసుల రీయిం బర్స్‌మెంటు రూ.218.80 కోట్లు, 2013-14కు సంబంధించి ఆడిట్ పూర్తి కానందున అడ్వాన్సు గా రూ.31.20 కోట్లు... వెరిసి రూ.250 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని సీసీఎస్, పీఎఫ్ బకాయిలతోపాటు దసరా పండగ అడ్వాన్సుకింద రూ.35 కోట్లను చెల్లించాల్సి ఉంది. దీంతో ఆ నిధులు కాస్తా ఖర్చు కానుండటంతో పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని ఆర్టీసీ ఆందోళన చెందుతోంది. సీఎంకు కృతజ్ఞతలు.. ఆర్టీసీని ఆదుకునేందుకు రూ.250 కోట్ల సాయా న్ని ప్రకటించాలని తాము చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిధులు విడుదల చేశారని రవాణామంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తవు విన్నపానికి సానుకూలంగా స్పందించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ నిధులతో సీసీఎస్, పీఎఫ్ బకాయిలు, దసరా అడ్వాన్సు చెల్లించనున్నట్టు తెలిపారు. -
కిరణ్ సర్కారును.. కడిగిపారేసిన కాగ్ !
నిధుల విడుదల జాప్యంతో సకాలంలో నీటి ప్రాజెక్టులు పూర్తికాలేదన్న కాగ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అంచనా వ్యయం పెరిగి ఖజానాపై రూ.12,591.63 కోట్ల భారం సంక్షేమ పథకాల అమల్లోనూ కిరణ్ సర్కారు తీరును తీవ్రంగా ఆక్షేపించిన కాగ్ లబ్ధిదారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా చేశారని స్పష్టీకరణ ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని తుడా,స్విమ్స్ యాజమాన్యాలకు చీవాట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్షేమాభివృద్ధి పథకాలకు బడ్జెట్లో నిధు ల కేటాయింపునకు విడుదలకూ పొంతన కుదరకపోవడం వల్ల ప్రగతి తిరోగమిస్తోందని కంప్ట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. నిధుల విడుదలలో నిర్లక్ష్యంవల్ల సాగునీటి ప్రాజెక్టుల అం చనా వ్యయం అంతకంతకూ పెరి గి ప్రభుత్వ ఖజానాపై రూ.12,591.63 కోట్ల భారం పడిందని తేల్చింది. ఇందిరప్రభ, రాజీవ్ యువకిరణాలు, మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు వంటి పథకాల్లోనూ లబ్ధిదారులకు మొండిచేయి చూపారని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను శనివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి కిరణ్ ప్రభుత్వం నిర్వాకాలను కాగ్ తూర్పారబట్టింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసేందు కు 2011-12లో ‘గ్రీన్ చానల్’ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కానీ.. తాను ప్రవేశపెట్టిన విధానాన్నే కిరణ్ సర్కారు అపహాస్యం చేసింది. బడ్జెట్లో కేటాయించిన మేరకు ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. 2011-12,2012-13 బడ్జెట్లలో సాగునీటి ప్రాజెక్టులకు అతి తక్కువ నిధులు విడుదల చేసింది. నిధుల కొరతకు భూసేకరణ సమస్య తోడవడంతో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. స్టీలు, సిమెంటు, ఇంధనం వంటి ధరలు పెరగడంతో సా గునీటి ప్రాజెక్టుల వ్యయం అంతకంతకూ పెరిగింది. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టును 2007-08లో రూ.399 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 88,300 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 23,666 ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్లందించాలని, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిధులనూ సర్దుబాటు చేయలేకపోయింది. దీనివల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.437.42 కోట్లకు పెరిగింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.38.42 కోట్ల భారం పడిందని కాగ్ తేల్చిచెప్పింది. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలన్న లక్ష్యంతో రూ.6,850 కోట్ల వ్యయంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులకు మార్చి 31, 2013 నాటికి రూ.6188.79 కోట్లను ఖర్చు చేశారు. నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది. ప్రభుత్వ ఖజానాపై రూ.3,615 కోట్ల భారం పడిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. గాలేరు-నగరి ప్రాజెక్టు కింద కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల పరిధిలో 3.25 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. 2005లో ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,777.94 కోట్లు. మార్చి 31, 2013 నాటికి రూ.4,135.62 కోట్లను ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడంతో పనులు సాగ డం లేదు. దీని వల్ల అంచనా వ్యయం పెరిగి.. ప్ర భుత్వ ఖజానాపై రూ.5,143.21 కోట్ల భారం పడింది. తెలుగుగంగ ప్రాజెక్టు కింద చెన్నై నగరానికి తాగునీరు అందించాలని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 1.40 లక్షల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. 1983లో ఆ ప్రాజెక్టును చేపట్టినప్పు డు అంచనా వ్యయం రూ.637 కోట్లు. కానీ.. ఆ ప్రాజెక్టుకు నిధులను సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల పనులు సా..గుతూ వస్తున్నాయి. దీ నివల్ల అంచనా వ్యయం రూ.4,432 కోట్లకు పెరి గింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.3,795 కో ట్ల భారం పడినట్లయిందని కాగ్ స్పష్టీకరించింది. ఈ తాగునీటి ప్రాజెక్టుకు సక్రమంగా నిధులు కేటాయించాలని పేర్కొంది. సంక్షేమం కాదు.. సంక్షామమే! రైతులకు 2011 నుంచి రూ.లక్ష వరకూ వడ్డీ లేని రు ణాలు.. రూ.3 లక్షల వరకూ పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. సకాలంలో చెల్లించిన రైతులకు మాత్రమే ఈ రాయితీ వర్తింపజేస్తామని మెలిక పెట్టింది. కానీ.. జిల్లాలో సకాలంలో చెల్లించిన రైతులకు రూ.14 కోట్లకు పైగా వడ్డీ రాయితీని చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని కాగ్ ఎత్తిచూపింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకూ వడ్డీ రాయితీని అందించడంలో ప్రభుత్వం దాటవేత వైఖరి అనుసరిస్తోందని పేర్కొంది. మార్చి 31, 2013 నాటికి మహిళా సంఘాలకు రూ.21 కోట్ల మేర వడ్డీ రాయితీని చెల్లించక పోవడాన్ని ఎత్తిచూపింది. ఇందిరమ్మ గృహనిర్మాణంలోనూ ప్రభుత్వం తీరును తప్పుపట్టింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారని ఆరోపించింది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.28 కోట్లు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చింది. ముస్లింలు, క్రిస్టియన్ల సంక్షేమానికి కేటాయించిన నిధుల వినియోగంలోనూ ప్రభుత్వం పిసినారితనాన్ని ప్రదర్శించిందని పేర్కొంది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంలోనూ.. ఇందిర జలప్రభ కింద నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలోనూ ప్రభుత్వం కాడిదించడాన్ని కాగ్ ఆక్షేపించింది. తుడా, స్విమ్స్లకు చీవాట్లు తిరుపతి పట్టాణాభివృద్ధి సంస్థ(తుడా), శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(స్విమ్స్)కూ కాగ్ చీవాట్లు పెట్టింది. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి మాత్రమే తుడా ఆడిటింగ్ పూర్తి చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను తుడా అందించలేదని కాగ్ పేర్కొంది. తుడా నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయాలను లీజుకు ఇవ్వకపోవడం వల్ల సంస్థకు భారీ ఎత్తున నష్టం వస్తోందని తేల్చింది. స్విమ్స్‌నూ కాగ్ కడిగేసింది. నిధుల వినియోగంలో స్విమ్స్ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదంది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్‌ను చేయించడంలో స్విమ్స్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తప్పుపట్టింది. ఆడిట్ నివేదికను ఇప్పటిదాకా అందించలేదంది. ఎప్పటికప్పుడు ఆడిట్ చేయించి.. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆ సంస్థకు సూచించింది.