= సీఎం మెప్పుకోసం ఉన్న నిధులు వాడేశారు
= మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందని నిధులు
= బకాయిలు వసూలైతేనే ఉద్యోగులకు జీతాలు
= కార్పొరేషన్లో ఆర్థిక సంక్షోభం
= ఆందోళనకు గురిచేస్తున్న ఒకటో తారీఖు
కార్పొరేషన్ ఖజానా అడుగంటింది. మార్చి ఒకటో తేదీన ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల కోసం అధికారులు వెతుకులాట సాగిస్తున్నారు. పైకి బింకం ప్రదర్శిస్తూనే లోలోన మథనపడుతున్నారు. సీఎం మెప్పుకోసం ఉన్న నిధులను ఊడ్చిపెట్టారు. బకాయిల వసూళ్లు మందగించడం, అకౌంట్స్ అధికారులు ఆర్థిక క్రమశిక్షణ తప్పడం వంటి పరిణామాలు ఉద్యోగుల పాలిట శాపంగామారాయి. అమ్మో ఒకటో తారీఖు... అనే పరిస్థితికి నగరపాలక సంస్థను దిగజార్చాయి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. జీతాల కోసం లాటరీ కొట్టాల్సిన పరిస్థితి ఉద్యోగులను వెంటాడుతోంది. ఉద్యోగులు, డ్వాక్వా, సీఎంఈవై కార్మికులకు, రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు రూ.16 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కార్పొరేషన్ ఖజానాలో రూ.4 కోట్ల మేర నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితిని మేయర్ కోనేరు శ్రీధర్ అకౌంట్స్ అధికారులతో శనివారం చర్చించగా ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని వారు చెప్పారని సమాచారం. బకాయిలు వసూలైతే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చేతులెత్తేసినట్లు తెలిసింది. డ్వాక్వా, సీఎంఈవై కార్మికులకు ఫిబ్రవరి ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాన్ని 23న ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో అంకెలు రంకెలేయించారు. వాస్తవ పరి స్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం పాలకుల్లో కలకలం రేపుతోంది.
ఆర్థిక క్రమశిక్షణ లోపం: ఆర్థిక క్రమశిక్షణ తప్పడం వల్లే ఈ దుస్థితి దాపురించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల జీతాల సొమ్మును రిజర్వులో ఉంచాలన్న సూత్రాన్ని అధికారులు విస్మరిం చారు. సీఎం చంద్రబాబు మెప్పుకోసం నిధులను ఎడాపెడా వాడేశారు. మహిళా పార్లమెంట్, నావీ విన్యాసాలు, కైట్ షో తదితరాలకు కార్పొరేషన్ నిధులను కొంతమేర వాడారు. సీఎం క్యాంప్ ఆఫీస్ శానిటేషన్ నిర్వహణకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నిధులు రాబట్టలేకపోయారు. రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు శానిటేషన్ పనులకు సంబంధించి సీఆర్‌డీఏ నుంచి సొమ్ములు వసూలు చేయలేక చతికిలపడ్డారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఒక్క నవంబర్ నెల్లోనే పాత బకాయిల కింద రూ.15 కోట్లు కార్పొరేషన్ ఖజానాకు చేరింది. అందులో కొంతమేర పుష్కర పనులు చేసిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారనే అభియోగాలు ఉన్నాయి. వెరసి కార్పొరేషన్ ఖజానా చిక్కిపోయింది.
కృష్ణా పుష్కరాలకు సంబంధించి రూ.186 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిం చింది. ఇందులో రూ.91 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగితా రూ.95 కోట్లు విడుదల చేయాలంటూ కమిషనర్ జి.వీరపాండియన్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ రాశారు. ఇది జరిగి నెల రోజులు గడిచినా స్పందన లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై కమిషనర్ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా బిల్డింగ్‌పీనలైజేష్ స్కీం(బీపీఎస్) కింద కార్పొరేషన్‌కు జమయిన రూ.72 కోట్లలో రూ.35 కోట్లను జనరల్ ఫండ్స్‌కు బదలాయించి, రూ.35 కోట్లకు పుష్కర కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అత్యతం విశ్వసనీయంగా తెలుస్తోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో కార్పొరేషన్ ఖజానాకు గండిపడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రెజరీలో చూడాలి: ట్రెజరీలో నిధుల లభ్యతను పరిశీలించాల్సి ఉంది. వసూలు కావాల్సిన బకాయిలపై దృష్టి పెడుతున్నాం. సాధ్యమైనంత వరకు ఒకటో తేదీకే జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తున్నాం. పుష్కర పనులకు జనరల్ ఫండ్స్‌ను వాడటం లేదు. – శివశంకర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, నగరపాలక సంస్థ
ఖజానా ఖాళీ
Published Tue, Feb 28 2017 3:44 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
Advertisement