Empty treasury
-
మళ్లీ బ్రేక్!
► ఖజానాలో కదలని బిల్లులు ► స్తంభించిన ఆన్లైన్ సేవలు ► పది రోజులుగా కొనసాగుతున్న ఆంక్షలు ► బిల్లులు డ్రా చేసుకోవాలనుకునే వారికి నిరాశే ► ఉద్యోగుల జీతాలకూ లభించని అనుమతి ► ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు జిల్లా ఖజానాశాఖలో మళ్లీ బిల్లులకు బ్రేక్ పడింది. ఆన్లైన్ సేవలు సైతం స్తంభించడంతో గత పది రోజులుగా బిల్లులకు మోక్షం లభించడం లేదు. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చే సమయంలో ఖజానాపై ఆంక్షలు విధించడం బిల్లులు పెట్టుకున్న వారిలో ఆందోళనకు కారణమవుతోంది. ఒంగోలు టూటౌన్ : జిల్లా సబ్ ట్రెజరీ కార్యాలయ పరిధిలోనే వందల సంఖ్యలో బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం. చివరి త్రైమాసికం బడ్జెట్ నుంచి బిల్లులు డ్రా చేసుకోవాలని హడావుడి పడే వారికి నిరాశే మిగిలింది. గత ఏడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి ఖజానాపై రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు గా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. దీంతో అన్ని రకాల బిల్లులు నిలిచిపోతున్నాయి. దాదాపు నాలుగో త్రైమాసికంలో సుమారుగా రూ.500 కోట్ల వరకు అయ్యే బిల్లులు ఆగిపోయి ఉంటాయని అంచనా.ఇటీవల జిల్లాకు వచ్చిన ట్రెజరీ శాఖ స్టేట్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ బి.ఎల్.హనుమంతరావు ట్రెజరీ ఆంక్షలు ప్రభుత్వం ఎత్తివేసినట్లు విలేకర్ల సమావేశంలో తెలిపారు. దాంతో దాదాపు 482 బిల్లులకు ఒక్క సారిగా మోక్షం లభించింది. వీటిలో అన్ని ప్రభుత్వం కార్యాలయాల కంటిన్జెంట్ బిల్లులు ఉన్నాయి. ముఖ్యంగా కళాశాలలో చదువుతున్న విద్యార్థుల (పెండింగ్ బకాయిలు) ఉపకార వేతనాలను పూర్తిగా క్లియర్ చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్ల బకాయిలను విడుదల చేసింది. వీటిలో ప్రకాశం జిల్లావే రూ.55 కోట్లు ఉన్నాయి. ఈనెల 13 నుంచి కదలని బిల్లులు.: ప్రభుత్వం ఉన్న ఆర్థిక వనరులను మలచుకొని పెండింగ్ బకాయిలను విడుదల చేసినట్లు ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఖజానాశాఖలో బిల్లులు నిలిచిపోయినట్లు వివరించారు. పాన్ నంబర్ లేని పలు పార్టీలు, సంస్థలు ఇతర బిల్లులను ఆదాయపన్ను శాఖ తీవ్రంగా చూడటం వలన చెల్లింపుల్లో కొంత ఆలస్యమయినట్లు తెలిపారు. మళ్లీ ఈ నెల 13వ తేదీ నుంచి ఖజానా బిల్లులు నిలిచిపోయాయి. దాదాపు 10 రోజులుగా నాలుగో త్రైమాసికం బిల్లులు నిలిచిపోవడంతో సంబంధిత వర్గాలు చెందుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి పోతున్నా.. ఇంతవరకు ఖజానా ఆంక్షలు తొలగలేదని ట్రెజరీ వర్గాలు తెలిపాయి. నిధులుండీ నిష్ప్రయోజనం..: జిల్లాలో ఒంగోలు, అద్దంకి, చీరాల, కంభం, దర్శి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, మార్టూరు, పొదిలి, యర్రగొండపాలెంలలో ఉపఖజానా కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా ట్రెజరీ కార్యాలయం, 12 ఉపఖజానా కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 37,647 మంది ఉద్యోగులు, 22,250 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీరందరు ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెల పొందుతుంటారు. ఇవి గాక జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఆర్అండ్బి, దాదాపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఎదురు చూస్తున్నాయి. దీనికి తోడు ఈ నెలాఖరుకు ఖర్చు పెట్టాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయి. అందుబాటులో ఉన్న నిధుల్లో 75 శాతం మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన నిధులు వేరే ఖాతాలకు జమచేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పంచాయతీల్లో ఉన్న నిధులు ఖర్చు చేయడానికి లేకుండా పోయింది. ఆర్థిక లోటును అంచనా వేసుకొని, వనరుల లభ్యతను బట్టి ప్రభుత్వం బిల్లులకు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల జీతాలకు అనుమతి లేని పరిస్థితి నెలకొంది. సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ వలన అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. -
ఖజానా ఖాళీ
= సీఎం మెప్పుకోసం ఉన్న నిధులు వాడేశారు = మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందని నిధులు = బకాయిలు వసూలైతేనే ఉద్యోగులకు జీతాలు = కార్పొరేషన్లో ఆర్థిక సంక్షోభం = ఆందోళనకు గురిచేస్తున్న ఒకటో తారీఖు కార్పొరేషన్ ఖజానా అడుగంటింది. మార్చి ఒకటో తేదీన ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల కోసం అధికారులు వెతుకులాట సాగిస్తున్నారు. పైకి బింకం ప్రదర్శిస్తూనే లోలోన మథనపడుతున్నారు. సీఎం మెప్పుకోసం ఉన్న నిధులను ఊడ్చిపెట్టారు. బకాయిల వసూళ్లు మందగించడం, అకౌంట్స్ అధికారులు ఆర్థిక క్రమశిక్షణ తప్పడం వంటి పరిణామాలు ఉద్యోగుల పాలిట శాపంగామారాయి. అమ్మో ఒకటో తారీఖు... అనే పరిస్థితికి నగరపాలక సంస్థను దిగజార్చాయి విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. జీతాల కోసం లాటరీ కొట్టాల్సిన పరిస్థితి ఉద్యోగులను వెంటాడుతోంది. ఉద్యోగులు, డ్వాక్వా, సీఎంఈవై కార్మికులకు, రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు రూ.16 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కార్పొరేషన్ ఖజానాలో రూ.4 కోట్ల మేర నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితిని మేయర్ కోనేరు శ్రీధర్ అకౌంట్స్ అధికారులతో శనివారం చర్చించగా ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని వారు చెప్పారని సమాచారం. బకాయిలు వసూలైతే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చేతులెత్తేసినట్లు తెలిసింది. డ్వాక్వా, సీఎంఈవై కార్మికులకు ఫిబ్రవరి ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాన్ని 23న ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో అంకెలు రంకెలేయించారు. వాస్తవ పరి స్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం పాలకుల్లో కలకలం రేపుతోంది. ఆర్థిక క్రమశిక్షణ లోపం: ఆర్థిక క్రమశిక్షణ తప్పడం వల్లే ఈ దుస్థితి దాపురించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల జీతాల సొమ్మును రిజర్వులో ఉంచాలన్న సూత్రాన్ని అధికారులు విస్మరిం చారు. సీఎం చంద్రబాబు మెప్పుకోసం నిధులను ఎడాపెడా వాడేశారు. మహిళా పార్లమెంట్, నావీ విన్యాసాలు, కైట్ షో తదితరాలకు కార్పొరేషన్ నిధులను కొంతమేర వాడారు. సీఎం క్యాంప్ ఆఫీస్ శానిటేషన్ నిర్వహణకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నిధులు రాబట్టలేకపోయారు. రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు శానిటేషన్ పనులకు సంబంధించి సీఆర్డీఏ నుంచి సొమ్ములు వసూలు చేయలేక చతికిలపడ్డారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఒక్క నవంబర్ నెల్లోనే పాత బకాయిల కింద రూ.15 కోట్లు కార్పొరేషన్ ఖజానాకు చేరింది. అందులో కొంతమేర పుష్కర పనులు చేసిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారనే అభియోగాలు ఉన్నాయి. వెరసి కార్పొరేషన్ ఖజానా చిక్కిపోయింది. కృష్ణా పుష్కరాలకు సంబంధించి రూ.186 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిం చింది. ఇందులో రూ.91 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగితా రూ.95 కోట్లు విడుదల చేయాలంటూ కమిషనర్ జి.వీరపాండియన్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ రాశారు. ఇది జరిగి నెల రోజులు గడిచినా స్పందన లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై కమిషనర్ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా బిల్డింగ్పీనలైజేష్ స్కీం(బీపీఎస్) కింద కార్పొరేషన్‌కు జమయిన రూ.72 కోట్లలో రూ.35 కోట్లను జనరల్ ఫండ్స్‌కు బదలాయించి, రూ.35 కోట్లకు పుష్కర కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అత్యతం విశ్వసనీయంగా తెలుస్తోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో కార్పొరేషన్ ఖజానాకు గండిపడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రెజరీలో చూడాలి: ట్రెజరీలో నిధుల లభ్యతను పరిశీలించాల్సి ఉంది. వసూలు కావాల్సిన బకాయిలపై దృష్టి పెడుతున్నాం. సాధ్యమైనంత వరకు ఒకటో తేదీకే జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తున్నాం. పుష్కర పనులకు జనరల్ ఫండ్స్‌ను వాడటం లేదు. – శివశంకర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, నగరపాలక సంస్థ -
ఖాళీ ఖజానా - ముళ్ల కిరీటం : చంద్రబాబు
చిత్తూరు: సీఎం పదవి పూల కిరీటం కాదని, ముళ్ల కిరీటం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఖాళీ ఖజానా ఇచ్చారు, జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవని వాపోతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం మీ ఆశీస్సులు కావాలని ప్రజలను కోరారు. రామకుప్పంలో ఈరోజు చంద్రబాబు పలు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. బోరులు ఎండిపోయాయని చెప్పారు. నీరు-మీరు లాంటి పనులు ద్వారా భూగర్భ నీటిమట్టాన్ని పెంచుతామన్నారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు.