Financial Stability and Development Council
-
భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉన్నప్పటికీ, భారత ఫైనాన్షియల్ వ్యవస్థ నియంత్రణలకు అనుగుణంగా పటిష్ట బాటలో ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 27వ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరిస్తూ, ‘‘భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. అయితే ఏదైనా తీవ్ర సమస్య సూచిక కనిపించిన వెంటనే మనం ఎల్లప్పుడూ అప్రమత్తం కావాలి. అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా మన కాలిపై మనం నిలబడాలి’’ అని అన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోగలుగుతామని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ వైఫల్యం అలాగే క్రెడిట్ సూచీ ఎదుర్కొంటున్న ద్రవ్య పరమైన ఒత్తిడి గురించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదు. వీటి ప్రభావం మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై లేదని భావిస్తున్నాం. ► ప్రభుత్వ బాండ్ల మార్కెట్ విషయంలో సాంకేతికత వినియోగం మరింత పెంపొందేలా చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. పెట్టుబడిదారులు ఆర్బీఐ లేదా సెబీ ఇన్ఫ్రా ద్వారా ఇందుకు సంబంధించి పొందుతున్న సదుపాయాలకన్నా, సాంకేతికత ద్వారా పొందుతున్న ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. ఇవే సాంకేతిక చర్యల మరింత పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నాం. ► అంతర్జాతీయంగా వస్తున్న ముందస్తు హెచ్చరిక సూచికలకు అనుగుణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకోవడం, ఆయా అంశాల్లో భారత్ సంసిద్ధత, నియంత్రణ నాణ్యతను మెరుగుపరచడం, దేశంలో కార్పొరేట్లు అలాగే గృహాల రుణ స్థాయిలు, కేవైసీ సరళీకరణ–క్రమబద్ధీకరణ, తద్వారా ఆర్థిక రంగంలో నియంత్రిత సంస్థలపై అనవసర భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై కౌన్సిల్ చర్చించింది. ఆయా అంశాలన్నీ డిజిటల్ ఇండియా అవసరాలను తీర్చడానికి మరింత పటిష్ట ఫ్రేమ్‌వర్క్‌ని రూపొందిస్తాయని భేటీ భావించింది. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఎఫ్ఎస్డీసీ సబ్ కమిటీ నిర్ణయాలు, ఎఫ్ఎస్డీసీ గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కార్యాచరణ వంటి అంశాలపైనా తాజా కౌన్సిల్ దృష్టి సారించింది. ► ఆర్బీఐ గవర్నర్‌తోపాటు, సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్, ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాషిస్ పాండా, దివాలా బోర్డ్ (ఐబీబీఐ) చైర్మన్ రవి మిట్టల్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్‌గా కొత్తగా నియమితులైన దీపక్ మెహంతీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికశాఖ సహాయమంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కృష్టారావు కరాద్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్‌జోషి, తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై దృష్టి... కాగా, ఎఫ్ఎస్డీసీ సమావేశం ప్రత్యేకించి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రెగ్యులేటర్లకు సూచించింది. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) రిజర్వ్ బ్యాంక్‌కు బదిలీ చేశాయి. దాదాపు 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించిన ఈ మొత్తాలను గత 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ఎవ్వరూ క్లెయిమ్ చేయలేదు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. డిపాజిటర్లు, లబ్ధిదారులు వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను యాక్సెస్ చేయగల కేంద్రీకృత పోర్టల్ మూడు లేదా నాలుగు నెలల్లో సిద్ధమవుతుందని గత నెలలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. -
అనిశ్చితిలో ఇంకా ఏం చేద్దాం!
న్యూఢిల్లీ: కోవిడ్–19 ప్రతికూలతల నేపథ్యంలో గురువారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) దృష్టి సారించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు. కరోనా వైరస్ సంక్షోభం దేశంలో ప్రారంభమైన తర్వాత కౌన్సిల్ సమావేశం ఇదే తొలిసారి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ 22వ కౌన్సిల్ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చీఫ్ అజయ్ త్యాగి, ఐఆర్డీఏఐ చైర్మన్ సుభాష్ చంద్ర కుంతియా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) చైర్మన్ ఎంఎస్ సాహూ, పీఎఫ్‌ఆర్‌డీఏఐ చైర్మన్ సుప్రీతం బందోపాధ్యాయ పాల్గొన్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ పాండే, ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి దేబాషిస్ పాండా సహా ఆర్థికశాఖ పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ భేటీలో ఉన్నారు. సమావేశానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► దేశంలో ద్రవ్యలభ్యత పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు మరిన్ని తీసుకోవాలని, ఫైనాన్షియల్ సెక్టార్లో మూలధన అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చాలని ఎఫ్ఎస్డీసీ భావించింది. ► మార్కెట్ ఒడిదుడుకులు, దేశీయంగా ఆర్థిక వనరుల సమీకరణ, అంతర్జాతీయ పెట్టుబడులు వంటి కీలక అంశాలపై సమావేశం చర్చించింది. ► కోవిడ్–19 గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థ స్థిరత్వానికి ముప్పును తెచ్చిపెట్టిందనీ, రికవరీ ఎప్పుడన్నది సైతం ఇప్పుడే చెప్పడం కష్టమని పేర్కొంది. -
ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారామన్ కీలక సమీక్ష
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్’ (ఎఫ్ఎస్డీసీ) 21వ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష చేశారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ తదితర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎఫ్ఎస్డీసీ అనేది ఆర్థిక రంగానికి సంబంధించి నియంత్రణ సంస్థల అత్యున్నత మండలి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. దేశ జీడీపీ వృద్ధి జూన్ త్రైమాసికంలో 5%కి క్షీణించడం, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు ఆశావహంగా లేకపోవడంతో ఈ సమీక్షకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘స్థూల ఆర్థిక అంశాలతోపాటు ఆర్థిక రంగ పరిస్థితులపై వివరంగా చర్చించడం జరిగింది. నియంత్రణ పరంగా అంతర్గత అంశాలతోపాటు, సైబర్ భదత్రపైనా సమీక్ష జరిగింది’’అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు తెలిపారు. ‘‘అధిక శాతం ఎన్బీఎఫ్సీలు చక్కగా పనిచేస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలను సమీకరించుకోగలుగుతున్నాయి. కొన్ని అయితే విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి’’ అని దాస్ తెలిపారు. సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి, ఐఆర్డీఏఐ చైర్మన్ సుభాష్‌చంద్ర కుంతియా తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించాలి
నిర్వహణ వ్యయాలు తగ్గించాలి * కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ * నియంత్రణ సంస్థల అధిపతులతో భేటీ ముంబై: పెట్టుబడుల రాకను పెంచేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు దేశీయంగా వ్యాపారాల నిర్వహణకు మెరుగైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. అలాగే, వ్యాపారాల నిర్వహణ వ్యయాలను తగ్గించాల్సి ఉందన్నారు. శనివారం జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) 11వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా నియంత్రణ సంస్థల అధిపతులతో జైట్లీ పలు అంశాలపై చర్చించారు. వచ్చే నెలలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, సెబీ చైర్మన్ యూకే సిన్హా, ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్, ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మయారాం తదితరులు ఇందులో పాల్గొన్నారు. రాబోయే బడ్జెట్, త దుపరి ఆర్థిక సంస్కరణల గురించి వారు తమ అభిప్రాయాలు వివరించారు. ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్‌లో ప్రభుత్వం అనుసరించతగిన విధానాలు మొదలైన వాటిపై ఎఫ్ఎస్డీసీ సమావేశంలో చర్చించినట్లు భేటీ అనంతరం విలేకరులకు జైట్లీ తెలిపారు. కొత్త ప్రభుత్వంపై రాజకీయంగా చాలా అంచనాలు ఉన్నాయని, ఎకానమీ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ప్రస్తుతం అవకాశం లభించిందని ఆయన చెప్పారు. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు నియంత్రణ సంస్థలన్నీ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని జైట్లీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో కేంద్రం తన వాటాలను 51% కన్నా తగ్గించుకోవాలన్న పీజే నాయక్ కమిటీ సిఫార్సులపై స్పందిస్తూ.. తాము ఇంకా వీటిని పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. ద్రవ్య లోటు, కరెంటు అకౌంటు లోటు తగ్గుతుండటం, విదేశీ మారక నిల్వలు పెరుగుతుం డటం వంటి సానుకూలాంశాలు ఇటీవల కనిపిస్తున్నా.. ఆర్థిక వృద్ధి పుంజుకోవడం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం వంటి వాటికి మరింత కాలం పట్టేయగలదని ఎఫ్ఎస్డీసీ అభిప్రాయపడింది.