వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించాలి
నిర్వహణ వ్యయాలు తగ్గించాలి
* కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
* నియంత్రణ సంస్థల అధిపతులతో భేటీ
ముంబై: పెట్టుబడుల రాకను పెంచేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు దేశీయంగా వ్యాపారాల నిర్వహణకు మెరుగైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. అలాగే, వ్యాపారాల నిర్వహణ వ్యయాలను తగ్గించాల్సి ఉందన్నారు. శనివారం జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) 11వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా నియంత్రణ సంస్థల అధిపతులతో జైట్లీ పలు అంశాలపై చర్చించారు.
వచ్చే నెలలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, సెబీ చైర్మన్ యూకే సిన్హా, ఐఆర్‌డీఏ చైర్మన్ టీఎస్ విజయన్, ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మయారాం తదితరులు ఇందులో పాల్గొన్నారు. రాబోయే బడ్జెట్, త దుపరి ఆర్థిక సంస్కరణల గురించి వారు తమ అభిప్రాయాలు వివరించారు.
ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్‌లో ప్రభుత్వం అనుసరించతగిన విధానాలు మొదలైన వాటిపై ఎఫ్‌ఎస్‌డీసీ సమావేశంలో చర్చించినట్లు భేటీ అనంతరం విలేకరులకు జైట్లీ తెలిపారు. కొత్త ప్రభుత్వంపై రాజకీయంగా చాలా అంచనాలు ఉన్నాయని, ఎకానమీ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ప్రస్తుతం అవకాశం లభించిందని ఆయన చెప్పారు. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు నియంత్రణ సంస్థలన్నీ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని జైట్లీ తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో కేంద్రం తన వాటాలను 51% కన్నా తగ్గించుకోవాలన్న పీజే నాయక్ కమిటీ సిఫార్సులపై స్పందిస్తూ.. తాము ఇంకా వీటిని పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. ద్రవ్య లోటు, కరెంటు అకౌంటు లోటు తగ్గుతుండటం, విదేశీ మారక నిల్వలు పెరుగుతుం డటం వంటి సానుకూలాంశాలు ఇటీవల కనిపిస్తున్నా.. ఆర్థిక వృద్ధి పుంజుకోవడం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం వంటి వాటికి మరింత కాలం పట్టేయగలదని ఎఫ్‌ఎస్‌డీసీ అభిప్రాయపడింది.