భారత్ బుల్లెట్ రైలుపై జపాన్ కన్ను!
టోక్యో: భారత్లో నిర్మించనున్న మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కాంట్రాక్ట్ తమకే దక్కుతుందని జపాన్ ఆశిస్తోంది. ఇప్పటికే ఇండోనేషియాలో నిర్మించతలపెట్టిన బుల్లెట్ రైలు కాంట్రాక్ట్ చైనా ఎగరేసుకుపోయిన నేపథ్యంలో భారత్ కాంట్రాక్టును చేజార్చుకోరాదని ఆ దేశం భావిస్తున్నట్టు నిక్కీ బిజినెస్ డైలీ మంగళవారం తెలిపింది. రూ. 98 వేల కోట్లతో చేపట్టనున్న భారత బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ ఒక ట్రిలియన్ యెన్లు (రూ. 54వేల కోట్లు) రుణంగా ఇవ్వనుంది. ఇండోనేషియాలో నిర్మించనున్న తొలి బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 5 బిలియన్ డాలర్లు రుణం ఇచ్చేందుకు చైనా ముందుకురావడంతో ఆ ప్రాజెక్టుపై జపాన్ పెట్టుకున్న ఆశలు చేజారాయి.
ఈ నేపథ్యంలో ఈ వారం భారత పర్యటనకు రానున్న జపాన్ ప్రధానమంత్రి షీన్జో అబె, ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ఈ ఒప్పందంపై సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశముందని నిక్కీ తెలిపింది. ముంబై, అహ్మదాబాద్ను కలుపుతూ 505 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రెయిన్ కారిడార్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు అంచనా వేయాల్సిందిగా జపాన్ను భారత్ కోరింది. ఈ మేరకు పరిశీలన జరిపి.. ఇందుకు అవకాశముందని జపాన్ నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో 2017లో హైస్పీడ్ రైల్వే లింక్ నిర్మాణం ప్రారంభం కానుందని, 2023నాటికి ఇది పూర్తవుతుందని నిక్కీ తన కథనంలో వివరించింది.