స్మార్ట్ వ్యూహం
ఆర్‌డబ్ల్యూఏలతో ప్రత్యేక సదస్సు
నలుగురు మంత్రులు హాజరు
గ్రేటర్ ఎన్నికల కోసమేనా?
సిటీబ్యూరో: ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అటు స్మార్ట్‌సిటీ గా తొలి జాబితాలో ఎంపికకు.. ఇటు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఉపకరించేందుకు అవసరమైన చర్యలను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఇందులో భాగంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్డబ్ల్యూఏ)తో సోమవారం కూకట్‌పల్లిలో భారీ స్థాయిలో సదస్సు నిర్వహించింది. జీహెచ్ఎంసీ చేపట్టబోయే అన్ని పనుల్లో (ఇంటింటికీ చెత్త డబ్బాలు, మల్టీలెవెల్ ఫంక్షన్‌హాళ్లు, ఫ్లై ఓవర్లు తదితరమైనవి) ఆర్డబ్ల్యూఏలు ముఖ్య భూమిక పోషించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్అలీతో పాటు మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో క్యాడర్ బలం లేకపోవడంతో ఆర్‌డబ్ల్యూఏల సహకారంతో ఎన్నికల్లో నెగ్గాలనేది సర్కారు యోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా కూకట్పల్లి ప్రాంతంలో సెటిలర్స్ ఎక్కువ కావడంతో తొలుత అక్కడ దృష్టి కేంద్రీకరించింది.
ఆర్డబ్ల్యూయేల సహకారంతో ఏదైనా సాధించవచ్చునని చెబుతూ పరోక్షంగా అన్ని పనుల బాధ్యతలను వారికే అప్పగిస్తామనే సంకేతాలు పంపింది. హైదరాబాద్‌లో ఉంటున్న వారంతా తమవారేనని, ఎవరిపైనా పక్షపాతం లేదని హోం మంత్రి నాయిని చెప్పడాన్ని బట్టి అందరి మద్దతు కూడగట్టేందుకు దీన్ని వేదికగా చేసుకున్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. మరోవైపు స్మార్ట్‌సిటీలలో తొలిస్థానాలు దక్కేందుకు స్థానిక సంఘాల భాగస్వామ్యం అవసరం. అందులో భాగంగా ప్రాధాన్య క్రమంలో చేపట్టాల్సిన పనులు తెలియజేయాల్సిందిగా సంబంధిత ఫారాలను వారికి అందజేశారు. ఇలా.. ఇటు స్మార్ట్‌సిటీ, అటు జీహెచ్ఎంసీ ఎన్నికలు లక్ష్యంగా ఈ సభ జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొందరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయనే అభిప్రాయాలకు ఈ వేదిక బలం చేకూర్చింది. అయితే ఇంకా డీలిమిటేషన్ ముసాయిదా ప్రజల ముందుకు రాకపోవం సందేహాలకు తావిస్తోంది.
సభలో రభస
కూకట్పల్లి: ఈ సదస్సులో పాల్గొన్నశేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అభివృద్ధి పనులపై విమర్శలు సంధిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమావేశం రసాభాసగా మారింది. ఆ సమయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కల్పించుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపై ప్రసంగించాలేగానీ గొడవలకు దిగొద్దన్నారు. అసోసియేషన్ల పాత్రపై సూచనలు చేయాలని ఆయన ఎమ్మెల్యేకు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమైన లోటుపాట్లు ఉంటే మంత్రులు, ప్రజా ప్రతిధులు కలిసి మాట్లాడుకోవాలని తెలిపారు.
ఆర్డబ్ల్యూఏ ప్రతినిధుల నిరసన
సమావేశానికి పిలిపించి కనీసం తమ అభిప్రాయాలను తెలుసుకునేందుకు సమయం కేటాయించకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వారి ప్రసంగాలే వినిపించారని వెల్ఫేర్ అసోసియేషన్ల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఏ మాత్రం తెలుసుకోకుండా ప్రసంగించి వె ళ్లడం వల్ల ఒరిగేదేమిటని ప్రశ్నించారు.