మాఫీమాయ
రుణమాఫీ అభ్యంతరాలపై ముగిసిన గడువు గందరగోళంగా అమలు 33,728 ఫిర్యాదులు స్వీకరణ
తొలివిడతలో జమైంది రూ.157 కోట్లే రెండో జాబితాలో 75వేల అకౌంట్ల అప్‌లోడ్ పూర్తి తడిసిమోపెడవుతున్న రుణభారంతో అన్నదాతలు విలవిల
రుణమాఫీ అమలు గందరగోళంగా ఉంది. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం. గత నెల ఆరో తేదీన అట్టహాసంగా ప్రకటించిన తొలి జాబితాలోని రైతులకు సగం మొత్తం కూడా జమకాలేదు. ఇక రెండో జాబి తా వెయ్యి డాలర్ల ప్రశ్నగా ఉంది. తొలి జాబితాలో పేర్లు దక్కనివారంతా రెండో జాబితాలోనైనా తమ పేరు ఉంటుందో లేదోనని 45 రోజులుగా అధికారులు, బ్యాంకర్ల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
విశాఖపట్నం: జిల్లాలో 3.87లక్షల ఖాతాల్లో లక్షా 30వేల 979 ఖాతాలతో రుణమాఫీ తొలి అర్హత జాబితాను గత నెల 6వతేదీన ప్రభుత్వం ప్రకటించింది. వీరికి 349.34 కోట్ల మాఫీ చేస్తున్నట్టు పేర్కొంది. వాస్తవానికి లక్షా 25,067 మందికి రూ.157.17కోట్లు మాత్రమే వారి అకౌంట్లలో సర్దుబాటైంది. తొలి జాబితాలో చోటుదక్కని 2.57లక్షల మంది రైతులూ అర్హులేనని ప్రకటించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం వల్లే తొలి జాబితాలో చోటు దక్కలేదని అధికారులు చెప్పుకొచ్చారు. అవసరమైన ఆధార్, ఇతర డాక్యుమెంట్ల వెంటనే సమర్పించాలని సూచించారు. అసలు ఎంతమందికి ఎంత మొత్తం మాఫీ కానుందన్నది చెప్పే నాధుడే లేకుండా పోయాడు.
పట్టించుకునే వారే కరువాయే
తొలి జాబితాలో చోటు దక్కని వారు కేవలం లక్షా 45వేలు మాత్రమేనని అధికారులు నిర్ధారించారు. కానీ రికార్డులన్నీ సక్రమంగా ఉన్న అర్హులు కేవలం 1.19 లక్షలు మాత్రమేనని కలెక్టర్ యువరాజ్ మంగళవారం ప్రకటించారు. వీరిలో ఇప్పటి వరకు 75వేల మందికి చెందిన అకౌంట్లు మాత్రమే అప్‌డేట్ చేశారని, మిగిలిన 44వేల మంది అకౌంట్లు అప్‌డేట్ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. చివరికొచ్చేసరికి వీరిలో ఎంతమంది మిగులుతారు? ఎంతమాఫీ అవుతుందో తెలియని పరిస్థితి.
మాఫీపై ఫిర్యాదుల వెల్లువ
మాఫీ కాని వారితో పాటు అయిన రైతులు కూడా తమకేమైనా అభ్యంతాలుంటే తెలియజేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందు కోసం పలుమార్లు పొడిగించిన గడువు మంగళ వారంతో ముగిసింది. ఇప్పటి వరకు ఏకంగా 33,728 మంది ఆన్‌లైన్‌లో మాఫీపై తమ అభ్యంతరాలను తెలుపుతూ ఫిర్యాదులు చేశారు. ఇంకా రైతు సాధికారిత సదస్సులు, తహశీల్దార్లు, బ్యాంకర్లకు ఇచ్చిన ఫిర్యాదులైతే లెక్కే లేదు. వారానికి రెండురోజుల పాటు తహశీల్దార్లు బ్యాంకర్లతో సమావేశమై వీటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినా గత 45 రోజుల్లో ఏ ఒక్క మండలంలోనూ అమలైన దాఖలాలు లేవు. గడువు మళ్లీ పెంచుతారో లేక.. వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తారో వేచిచూడాల్సి ఉంది. అయితే మాఫీ విషయంలో తామంతా నిలువునా మోసపోయామమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.