సచిన్ మొదటి సెంచరీకి 30 ఏళ్లు
సచిన్ టెండూల్కర్.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్ మొదలవుతాయి. సచిన్ ఆటకు వీడ్కోలు పలికి ఏడేళ్లు అయిపోయింది.. అయినా ఇప్పటికి అతని గురించి ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రస్తుత టీమిండియా జట్టులో ఉన్న సగం మంది ఆటగాళ్లు అతని ఆటతీరును చూస్తూ పెరిగిన వారే. దేశంలో క్రికెట్‌ను ఒక మతంగా భావించే అభిమానులు సచిన్‌ను క్రికెట్ దేవుడిగా అభివర్ణిస్తారు. క్రికెట్ ఉన్నంతకాలం సచిన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.. కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు, 34 వేలకు పైగా పరుగులు సాధించిన సచిన్.. టెస్టుల్లో మొదటి సెంచరీ సాధించి సరిగ్గా ఈరోజుతో 30 ఏళ్లయింది. సచిన్ సాధించిన మొదటి సెంచరీకి సంబంధించిన ఫోటోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది.(ఎక్కడైనా ధోనియే నెంబర్ వన్)
1990లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆగస్టు 14న 17 ఏళ్ల వయసులో మొట్టమొదటి సెంచరీ సాధించాడు. ఆరోజు మొదలైన సెంచరీల మోత నిరంతరాయంగా 23 ఏళ్ల పాటు కొనసాగింది. 1989లో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో మొదటి సెంచరీ చేయడానికి 8 టెస్టుల వరకు ఆగాల్సి వచ్చింది. ఆ మ్యచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు గ్రహం గూచ్, మైకెల్ ఆర్థర్టన్, రాబిన్ స్మిత్‌లు సెంచరీలతో చెలరేగడంతో 519 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ధీటుగానే బదులిచ్చింది. అప్పటి కెప్టెన్ మమ్మద్ అజారుద్దీన్ 179 పరుగులతో కథం తొక్కడంతో పాటు సచిన్ 68 పరుగులు చేయడంతో 432 పరుగుల చేసింది. అనంతరం అలన్ లాంబీ సెంచరీతో 320 పరుగులు చేసిన ఇంగ్లండ్ భారత్ జట్టుకు 407 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ దిగిన సచిన్ 225 నిమిషాల పాటు క్రీజులో ఉన్న సచిన్ 189 బంతులెదుర్కొని 119 పరుగులు సాధించాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 343/6 వద్ద నిలిచి డ్రాగా మిగిలిపోయింది.
#OnThisDay in 1990, a 17-year-old Sachin Tendulkar hit his maiden Test hundred and the rest is history ...
Which is your favourite 💯 from the Master Blaster? pic.twitter.com/SPwjYhEUrM
— ICC (@ICC) August 14, 2020
కానీ ఆ మ్యాచ్ సచిన్‌కు మాత్రం మాధురానుభూతిగా మిగిలిపోయింది.. ఎందుకంటే సచిన్ తొలిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడంతో పాటు.. అతి తక్కువ వయసులో టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. సచిన్ తన 24 ఏళ్ల కెరీర్లో 463 వన్డేల్లో 18,426 పరుగులు, 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. మొత్తం 100 సెంచరీలు సాధించిన సచిన్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. సచిన్ రికార్డును అందుకోవడం ఇప్పటితరంలో కష్టమే అని చెప్పొచ్చు.
మొదటి సెంచరీ సాధించి 30 ఏళ్లయిన సందర్బంగా సచిన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నేను అరంగేట్రం చేసిన మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ బౌలర్లైన వకార్ యూనిస్, వసీం అక్రమ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నా. వకార్ వేసిన ఒక బంతి బౌన్సర్‌గా వచ్చి నా ముక్కును పచ్చడి చేసింది. అయినా ఏమాత్రం బెదరకుండా ఆడాను. . ఒకవైపు ముక్కు నుంచి రక్తం కారుతున్నా.. నొప్పిని భరించి అర్థ సెంచరీ సాధించి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించా. ఎంత కష్టం వచ్చినా క్రికెట్‌ను మాత్రం వద్దలొద్దని ఆరోజే నిర్ణయించుకున్నా. తర్వాతి రోజుల్లో వంద సెంచరీలు చేస్తానని నేను కూడా అనుకోలేదు.' అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు.
అయితే యాక్సిడెంటల్‌గా ఇదే రోజుకు మరో విశేషం కూడా ఉంది. లెజెండరీ బ్యాట్స్‌మెన్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఆటకు గుడ్‌బై చెప్పిన రోజు కూడా ఇదే. తాను ఆడిన చివరి టెస్టు మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో పరుగులు ఏం చేయకుండానే డక్‌గా వెనుదిరిగాడు. 1948 ఓవల్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ కేవలం 4 పరగులు చేసి ఉంటే బ్యాటింగ్ సగటు 100తో కొత్త రికార్డు నమోదయ్యుండేది. (ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు : నెహ్రా)