సచిన్ పేరు మార్మోగిన వేళ..
► ఇంగ్లండ్ పర్యటనతో వెలుగులోకి సచిన్
► నేటితో తొలి సెంచరీ చేసి 26 ఏళ్లు
న్యూఢిల్లీ: వన్డే క్రికెట్ వరల్డ్ కప్-1983 గెలిచిన తర్వాత భారత్లో ఆటపై మక్కువ కాస్త పెరిగిన మాట వాస్తవమే.. కానీ క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట చూసిన తర్వాత నుంచి ఎంతో మంది క్రికెట్ పై ఆసక్తి పెంచుకుని బ్యాట్ పట్టారు. 16 ఏళ్ల వయసులో 1989లో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సచిన్ పాకిస్తాన్ పై 93, న్యూజీలాండ్ పై 88 పరుగులు చేసి తనలో ప్రతిభ ఉందని చాటిచెప్పాడు. ఉపఖండం బయట తాను ఆడిన రెండో టెస్టు సిరీస్ తో వెలుగులోకి సచిన్ వచ్చాడు.
1990లో ఇంగ్లండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు లార్డ్స్ లో 247 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ దాదాపు అదే పరిస్థితి..407 పరుగుల లక్ష్యంతో అజహరుద్దీన్ నేతృత్వంలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా 127 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో చిచ్చరపిడుగు సచిన్ క్రీజులోకొచ్చాడు.
మరోసారి దారుణ ఓటమి తప్పేలా లేదని భావించిన టీమిండియా సచిన్ అజేయ సెంచరీ(119 నాటౌట్, 17 ఫోర్లు) సహాయంతో 6 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసి టెస్టు డ్రాతో గట్టెక్కిన విషయం తెలిసిందే. 51 టెస్టు సెంచరీలు సాధించిన సచిన్కు జట్టును ఓటమి నుంచి తప్పించిన తొలి టెస్టు శతకం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి. నేటితో ఆ ఇన్నింగ్స్(సచిన్ తొలి సెంచరీ) 26 ఏళ్లు(ఆగస్టు 1990) పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి రిటైరయ్యే వరకూ తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను సచిన్ చేరుకున్నాడు.