అమ్మ మరణాంతరం కేబినెట్ తొలి భేటీ
చెన్నై : అన్నాడీఎంకే అధినేత జయలలిత మరణం అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు కొత్త కేబినెట్ తొలిసారి భేటీ కాబోతుంది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో రేపు ఉదయం 11.30 గంటలకు సెక్రటేరియట్లో మంత్రులు సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మంత్రులు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. మీటింగ్ అనంతరం కొత్త మంత్రులు తమ బాధ్యతలు స్వీకరించనున్నారు.
జయలలిత మరణించిందనే వార్తను అపోలో ఆసుపత్రి వర్గాలు డిసెంబర్ 5 అర్థరాత్రి ప్రకటించగానే.. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కోలుకుంటున్నారన్న జయలలిత హఠాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురికావడం, తర్వాత అమ్మ ఆరోగ్యం విషమించడం, హుటాహుటిని తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పలుమార్లు ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీ కావడం వంటి పలు పరిణామాలు అపోలో ఆసుపత్రిలో చోటుచేసుకున్నాయి. అమ్మ వార్త బయటికి చెప్పిన వెంటనే తమిళనాడు కొత్త సీఎం, మంత్రులచే గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం కూడా చేపించారు.