కొత్తగా ఐదు బీఆర్టీలు ఎల్జీ అనుమతి కోరిన ఢిల్లీ సర్కారు
న్యూఢిల్లీ: ఒకవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నా వెరవకుండా ఢిల్లీ ప్రభుత్వం నగరంలో మరో ఐదు బీఆర్‌టీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగరంలో రద్దీని నివారించేందుకు ఐదు బీఆర్టీల ఏర్పాటుకు అనుమతివ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అంబేద్కర్‌నగర్, మూల్‌చంద్ మధ్యనున్న బీఆర్టీ కారిడార్‌లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలు ఎదురుకాకుండా కొత్త బీఆర్టీ కారిడార్లు ఏర్పాటు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కోరుతూ డీటీసీ చైర్పర్సన్ అధ్యక్షతన ఎల్జీ నజీబ్ జంగ్ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఐదు బీఆర్‌టీలను సిఫార్సు చేసింది.
కరవాల్ నగర్ నుంచి మోరీ గేట్ వరకు, గాజీపూర్ నుంచి నేషనల్ స్టేడియం వరకు, బదర్పూర్ నుంచి ఐజీఐ ఎయిర్‌పోర్టు వరకు, దిల్షాద్ గార్డెన్ నుంచి టిక్రీ సరిహద్దు వరకు, భోపురా సరిహద్దు నుంచి జనక్పురీ జిల్లా కేంద్రం వరకు బీఆర్‌టీలను ఏర్పాటు చేయవచ్చని ఆ కమిటీ తెలిపింది. ఈ మేరకు ఎల్జీకి ప్రతిపాదనలు పంపామని, మొదటి దశలో ఒక బీఆర్టీ ఏర్పాటుకు ఎల్జీ అనుమతి కోరామని ప్రభుత్వ అధికారి ఆదివారం చెప్పారు. కమిటీ సిఫార్సు చేసిన ఐదు బీఆర్టీ కారిడార్లలో ప్రత్యేక మార్గాన్ని నిర్మించేందుకు అవసరమైనంత స్థలం ఉందని ఆ అధికారి తెలిపారు. ఎల్జీ నుంచి అనుమతి లభించగానే ప్రతిపాదిత బీఆర్టీ కారిడార్లలో ఒకదాని నిర్మాణాన్ని మొదటి దశలో ప్రారంభిస్తామని చెప్పారు. రెండో దశలో మిగిలిన నాలుగు కారిడార్లపై పని ప్రారంభిస్తామని అన్నారు. అంబేద్కర్‌నగర్ నుంచి ఢిల్లీ గేట్ వరకు 14.5 కిలోమీటర్ల బీఆర్టీ కారి డార్ నిర్వహణ బాధ్యతను ఎల్జీ ప్రజా పనుల విభాగానికి అప్పగించారు. ఆ మార్గం లో సిగ్నల్ వ్యవస్థ నిర్వహణను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగానికి అప్పగించారు.