పీఠం ఎవరిదో?
సర్వేలతో గందరగోళం
అన్నాడీఎంకే వైపు మూడు
డీఎంకేదే అధికారమని రెండు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీది అధికారమనే కోణంలో జరిపిన సర్వేలు ‘సర్వం మాయ...సర్వేల మాయ’ అనిపిస్తున్నాయి. గురువారం నాటికి ప్రముఖంగా ఐదు సర్వేలు జరుగగా అన్నాడీఎంకే ప్రభుత్వం ఖాయమని మూడు సర్వేలు తేల్చేశాయి. మరో రెండు సర్వేలు డీఎంకేకు ప్రజలు పట్టం కడతారని స్పష్టం చేశాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర తలరాతను నిర్ణయించే 16వ తేదీ దగ్గరపడుతోంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోలింగ్‌కు ముచ్చటగా మూడురోజులే ఉంది. ఎన్నికల ప్రచారం రేపటితో ముగిసిపోనుంది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి, భారతీయ జనతాపార్టీలతో పంచముఖ పోటీ నెలకొని ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే సాగుతోంది. ఈరెండు పార్టీల్లో ఏదో ఒకటి అధికారంలోకి రావడం ఖాయమని అందరికీ తెలుసు. అయితే ఈ రెండింటిలో ఏపార్టీ అనేదే సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తం 234 స్థానాల్లో అన్నాడీఎంకే 227 చోట్ల పోటీచేస్తూ, మరో 7 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది.
మిత్రపక్షాలు కూడా అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు (రెండాకులు)పైనే పోటీచేస్తున్నాయి. అన్నాడీఎంకే ఆవిర్భవించిన తరువాత ఒకే గుర్తుపై అన్నిస్థానాల్లో పోటీచేయడం ఒక రికార్డుగా నిలిచింది.డీఎంకేతోపాటూ ప్రజా సంక్షేమ కూటమి కూటమి సైతం తమదే అధికారం అంటున్నాయి. ఒంటరిగా రంగంలో ఉన్న పీఎంకే సీఎం పీఠం తమదేననే ధీమాను వ్యక్తం చేస్తోంది. అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా జయలలిత ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు ఖాయమని, అది తమపార్టీతోనే జరుగబోతోందని డీఎంకే విశ్వాసంతో ఉంది.
సీఎంలే కాదు, అధికారంలో ఉండే పార్టీలే మారిపోవడాన్ని చూస్తారని ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే చెబుతోంది. ఇలా ఎవరికి వారు తమదే అధికారమని ప్రచారం చే సుకుంటున్న తరుణంలో వివిధ సంస్థలు సర్వేలతో రంగ ప్రవేశం చేశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా ప్రజలారా తలలు బద్దలు కొట్టుకోవద్దు, ఇదిగో తాము తేల్చేస్తామని ప్రజల్లోకి వెళ్లాయి. టైమ్స్ నవ్, ఇండియా టీవీ, సీ వోటర్.. ఈ మూడు సంస్థలు సంయుక్తంగా సర్వేలు జరిపాయి.
నాలుగు వారాలపాటూ నిర్వహించిన సర్వేలో మొత్తం 10,467 మందిని కలుసుకుని అభిప్రాయాన్ని సేకరించాయి. వీరిలో 39 శాతం మంది అన్నాడీఎంకేకు అనుకూలంగా చెప్పారు. 130 స్థానాలతో అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. డీఎంకే కూటమికి 32 శాతం ఓట్లతో 70 స్థానాల్లో మాత్రమే అవకాశం ఉందని తేలింది. మిగిలిన కూటములు 25 నుండి 34 శాతం ఓట్లతో 34 సీట్లు దక్కించుకోవచ్చని పేర్కొన్నారు.
పుదియతలైమురై, ఏపీడీ సంస్థలు సంయుక్తంగా రెండుసార్లు సర్వే నిర్వహించాయి. ఈ సంస్థలు సైతం అన్నాడీఎంకేకే వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొన్నాయి. జనవరి 22 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు నిర్వహించిన తొలిదశ సర్వేలో 5,018 మంది నుండి అభిప్రాయాలు సేకరించాయి. ఈ సర్వేలో 32.83 శాతం మంది 119 సీట్లతో అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని చెప్పారు. అలాగే డీఎంకే కూటమికి 115 స్థానాలకు అవకాశం ఉందని తేలింది. డీఎండీకేకు 5.21 శాతం ఓట్లకే పరిమితం కాగలదని, సంక్షేమ కూటమి సంపూర్ణంగా లేదని ప్రజలు అభిప్రాయపడినట్లు సర్వేలో స్పష్టమైంది.
ఏప్రిల్ 18 నుంచి మే 4వ తేదీ వరకు రెండో దశ సర్వే నిర్వహించారు. అయితే రెండో దశ సర్వేలో ఆశ్చర్యకరంగా అన్నాడీఎంకే బాగా పుంజుకున్నట్లుగా వెల్లడైంది. 38.58 శాతం ఓట్లతో 164 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్బవిస్తుందని తేలింది. డీఎంకే కూటమి 32.11శాతం ఓట్లతో కేవలం 66 స్థానాలతో సరిపెట్టుకోక తప్పదని సర్వే స్పష్టం చేసింది.దినమలర్ దినపత్రిక, న్యూస్-7 టీవీ చానల్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఇటీవలే వెల్లడైంది. రాష్ట్రం నలుమూలల నుండి 2.34 లక్షల మంది నుండి అభిప్రాయాలను సేకరించింది. వీరు జరిపిన సర్వేలో 108 స్థానాలతో డీఎంకే అధికారం చేపట్టుతుందని, అన్నాడీఎంకేకు కేవలం 52 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. పీఎంకే, బీజేపీ తలా ఒక సీటును మాత్రమే గెలుచుకుంటాయని పేర్కొంది. 72 స్థానాల్లో గట్టి పోటీ నెలకొని ఉందని చెప్పింది.
గుడ్‌విల్ కమ్యూనికేషన్స్ అనే సంస్థ గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది మే వరకు 4 సార్లు సర్వే నిర్వహించింది. జూలై 15 నుండి 30వ తేదీ వరకు 2,500 మంది, డిశంబరు 15 నుండి 30వ తేదీ వరకు 3,200 మంది అభిప్రాయాలను సేకరించింది. అలాగే మార్చి 10 నుండి 20వ తేదీ వరకు 3,800 మంది, ఏప్రిల్ 10 నుండి మే 5వ తేదీ వరకు 4,650 మంది అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ సర్వేలో డీఎంకే కూటమిదే అధికారమని తేలింది. 43 శాతం ఓట్లతో 127-139 సీట్లను గెలుచుకుని డీఎంకే అధికారం చేపట్టుతుందని తెలిపింది. అన్నాడీఎంకే 38 శాతం ఓట్లను పొందడం ద్వారా 81-90 సీట్లుతో సరిపెట్టుకోగలదని అభిప్రాయపడింది. ఇతర పార్టీలు 19 శాతం ఓట్లతో 14-17 సీట్లను పంచుకుంటాయని తెలిపింది. ఎన్ని సంస్థలు, ఎన్నిరకాల సర్వేలు చేసినా ప్రజల సిసలైన తీర్పు కోసం ఈనెల 19వ తేదీ సాయంత్రం వరకు వేచిచూడక తప్పదు.
ఐదు సర్వేలు-ఫలితాలు:
1. ఇండియా టీవీ :అన్నాడీఎంకే-116, డీఎంకే 101.
2. పుదియతలైమురై: అన్నాడీఎంకే-164, డీఎంకే-56.
3. టైమ్స్ నౌ:అన్నాడీఎంకే 130, డీఎంకే-70.
4. న్యూస్ 7, దినమలర్: డీఎంకే 108, అన్నాడీఎంకే-52.
5. గుడ్‌విల్ కమ్యూనికేషన్: డీఎంకే-139, అన్నాడీఎంకే 90.