గెలాక్సీ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్లైన్స్
సిడ్నీ : శాంసంగ్ గెలాక్సీ నోట్7 యూజర్లకు ప్రముఖ ఎయిర్ లైన్సు సంస్థ ఆస్ట్రేలియన్ క్వాంటాస్ షాకిచ్చింది. విమాన ప్రయాణంలో గెలాక్సీ నోట్7 స్మార్ట్ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ వల్ల వస్తున్న బ్యాటరీ పేలుళ్ల సమస్యను సాకుగా చూపుతూ విమానంలో ఈ ఫోన్ను వాడటం కాని చార్జ్ కాని చేయకూడదని గురువారం ఆదేశించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నింటిలో ఈ ఆదేశాలను పాటించాలని, అదేవిధంగా క్వాంటస్ డిస్కౌంట్ క్యారియర్ జెట్స్టార్కు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఎయిర్లైన్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఏవియేషన్ అథారిటీ నిబంధనలను సడలింపు చేశాక, 2014లో క్వాంటాస్, దాని ప్రత్యర్థి కంపెనీ వర్జిన్ ఆస్ట్రేలియాలు విమానంలో ఫోన్ల వాడకాన్ని అనుమతి ఇచ్చాయి.
ప్లేన్ నేవిగేషన్ ఈక్విప్మెంట్కు ఆటంకం కలుగుతుందనే కారణంతో టాక్సింగ్, టేక్-ఆఫ్, ల్యాండింగ్ సమయంలో ఫోన్ల వాడకంపై రెగ్యులేటర్లు నిషేధం విధించాయి. కానీ తర్వాత ఎయిర్ లైన్సు ఫోన్ల వాడకానికి అనుమతి కల్పించాయి. ప్రస్తుతం బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో క్వాంటాస్ మళ్లీ విమానంలో గెలాక్సీ నోట్7ల వాడకాన్ని నిషేధించింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో తీవ్ర ఇరకాటంలో పడ్డ శాంసంగ్ గ్లోబల్గా షిప్ చేసిన 2.5 మిలియన్ యూనియట్ల గెలాక్సీ నోట్7లను రీకాల్ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ల ఘటనలు సంస్థ గౌరవానికి భంగం వాటిల్లుస్తున్నాయని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో కూడా శాంసంగ్ తన తాజా ఫ్లాగ్షిప్లను రీకాల్ చేస్తోంది. శాంసంగ్ పూర్తిగా వీటిని రీకాల్ చేసేవరకు ఈ ఫోన్లను విమానంలో వాడకూడదని క్వాంటాస్ పేర్కొంది.