Fact Check: కాదు కాదన్నా కట్టుకథలేనా?
విశాఖ సిటీ: విశాఖపై పచ్చపత్రికలు మరోసారి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాయి. విషపు రాతలతో రెచ్చిపోయాయి. జిల్లా అభివృద్ధిని జీర్ణించుకోలేక విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు.. ఇష్టానుసారం బురదజల్లాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా చేపడుతున్న ప్రాజెక్టులపై దుష్ప్రచారాలకు వలువలన్నీ విప్పేశాయి. నిత్యం అభాసుపాలవుతున్నా సిగ్గూఎగ్గూ లేకుండా అబద్ధాలనే అచ్చోస్తూ పైశాచికానందం పొందుతున్నాయి.
తాజాగా.. విశాఖ నగరంలో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటనను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు తెగ ఆరాటపడ్డ పచ్చ మీడియా చివరికి బొక్కబోర్లా పడి తమ పరువును తీసుకున్నాయి. ఇక్కడ సాగర తీరంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి పటిష్టతను పరిశీలించేందుకు బ్రిడ్జి నుంచి ప్లాట్‌ఫాంను డీ–లింక్ చేస్తే బ్రిడ్జి తెగిపోయిందంటూ చేతికొచ్చింది రాసిపారేశాయి.
బ్రిడ్జి సిబ్బంది డీ–లింక్ చేస్తున్న వీడియోను అధికారులు విడుదల చేసినప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా వాస్తవాలను సమాధి చేస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేయడమే పనిగా పెట్టుకుని అప్పటికప్పుడు కట్టుకథలు అల్లేశాయి. పచ్చపత్రికల విషపు రాతలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే..
శాస్త్రీయ అధ్యయనాలు చేశాకే..
పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు విశాఖ బీచ్ రోడ్డులో సముద్ర అధ్యయన శాస్త్రవేత్తల సూచనలతో.. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా పూర్తి భద్రతా ప్రమాణాలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటుచేయాలని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) సంకల్పించింది. కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియానికి సమీపంలో దీనిని ఏర్పాటుచేశారు.
దేశంలో ఈ తరహా ప్రాజెక్టుల తీరును పరిశీలించేందుకు వీఎంఆర్డీఏ అధికారులు, ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ల బృందం కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ (కాలికట్) వద్ద బేపూర్ తీరంలోను, త్రిసూ్సర్ నగరంలోని చావక్కడ్ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిలను సందర్శించారు. అధికారులు, నిర్మాణ, నిర్వహణదారులతో మాట్లాడి అక్కడ ప్రాజెక్టు విధానాలు తెలుసుకున్నారు.
కేరళలో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిలు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయాన్ని గమనించారు. ఇవి ఏర్పాటుచేసిన ప్రతిచోటా విజయవంతంగా నడుస్తున్నట్లు గుర్తించారు. దీంతో పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు వీఎంఆర్డీఏ గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. ఇందులో సాయిమోక్షా షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. వీఎంఆర్డీఏకు ఏడాదికి రూ.15.3 లక్షలు ముందస్తు చెల్లింపుల ప్రతిపాదికన ఈ ప్రాజెక్టును చేపట్టింది.
సముద్ర అధ్యయన శాస్త్రవేత్తల సూచనలతో..
తొలుత.. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిను తెన్నేటి పార్కు సమీపంలో ఏర్పాటుచేయాలని అధికారులు భావించారు. అయితే, ఆ ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉండడంతో అక్కడ విరమించుకున్నారు. రుషికొండ ప్రాంతంలో ఏర్పాటుపై ఆంధ్రా యూనివర్శిటీలో సముద్ర అధ్యయన, భూభౌతిక శాస్త్రవేత్తలను సంప్రదించారు. ఇక్కడ ప్రాణాంతకమైన రిప్ కరెంట్ అధికంగా ఉంటుందని, ప్రాజెక్టుకు అనుకూలమైన ప్రాంతం కాదని చెప్పి కురుసుర మ్యూజియం ఉత్తర దిశ ప్రాంతం ఫ్లోటింగ్ బ్రిడ్జికు అనుకూలమైనదని సూచించారు. దీంతో నిర్వాహకులు ఆ ప్రాంతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు.
మాక్‌డ్రిల్ చేస్తే తెగిపోయిందంటూ రాద్ధాంతం..
సహజంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయాల్లో ఫ్లోటింగ్ బ్రిడ్జిను డీ–లింక్ చేస్తారు. అయితే.. సోమవారం సముద్ర కెరటాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఆ రోజు నుంచి బ్రిడ్జిపైకి సందర్శకులను అనుమతించాలని ముందు భావించినప్పటికీ అలల ఉధృతి కారణంగా అనుమతించలేదు. ఈ సమయంలో మాక్‌డ్రిల్ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సిబ్బంది సోమవారం మ.3 గంటల సమయంలో బ్రిడ్జి, ప్లాట్‌ఫాంలను విడదీశారు. ఆ ఫ్లాట్‌ఫాంను లాగి యాంకర్ వద్దకు తీసుకువెళ్లారు.
ఇదంతా అక్కడ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. అయితే.. బ్రిడ్జి, ప్లాట్‌ఫాం మధ్య కొంత ఖాళీ ప్రాంతాన్ని ఫొటో తీసి ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందని పచ్చ పత్రికలు, మీడియా తెగ రాద్ధాంతం చేశాయి. వెంటనే అధికారులు, నిర్వాహకులు అప్రమత్తమై బ్రిడ్జి తెగిపోయిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదని సా.5 గంటలకే సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు. అందులో బ్రిడ్జి, ప్లాట్‌పాంను 10 మంది సిబ్బంది విడదీయడంతో పాటు తాళ్లతో యాంకర్ వద్ద తీసుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి.
అయినప్పటికీ.. పచ్చపత్రికలు, పచ్చ పార్టీల లక్ష్యం వేరు కదా.. వాటిని అస్సలు పట్టించుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లాయి. వాస్తవ దృశ్యాలను తొక్కిపెట్టి విశాఖపై అక్కసు వెళ్లగక్కాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, వీఎంఆర్డీఏ కమిషనర్ డాక్టర్ ఎ. మల్లికార్జున ఇచ్చిన వివరణను సైతం పట్టించుకోలేదు. కేవలం విశాఖ ఇమేజ్, అభివృద్ధిపై విషం చిమ్మడమే పనిగా తప్పుడు కథనాలు ప్రచురించాయి.
బ్రిడ్జి తెగిపోలేదు.. లంగరు వేశాం..
ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవంలేదు. మాక్‌డ్రిల్‌లో భాగంగా రెండింటిని వేరుచేసి లంగరు వేశాం. తెగిపోతే సముద్రంలో కొట్టుకుపోవడమో, ఒడ్డుకు రావడమో జరిగేది. ప్లాట్‌ఫాం ఒకేచోట ఉండదు. వాస్తవాలను పట్టించుకోకుండా పెనుప్రమాదం తప్పిందని వార్తలు ప్రచురించడం సరికాదు. సముద్రంలో ప్రతికూలతవల్ల అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో సందర్శకులను అనుమతించలేదు.
ప్రధాన వంతెన, వ్యూ పాయింట్ వేరుగా ఉండడంతో మధ్య ఖాళీ ప్రాంతాన్ని ఫొటోతీసి దుష్ప్రచారం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రతికూల పరిస్థితులున్న సమయాల్లో ఇటువంటి మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తాం. సంచలనాల కోసం అసత్య వార్తలు రాకుండా అధికారుల నుంచి వివరాలు తీసుకుని ధృవీకరించుకుని ప్రచురించాలి. విశాఖ ఖ్యాతిని మరింత పెంచేందుకు అందరూ సహకరించాలి. – డాక్టర్ ఎ. మల్లికార్జున, వీఎంఆర్డీఏ కమిషనర్
పూర్తి భద్రతా ప్రమాణాలతో..
♦ సబ్‌మెరైన్ మ్యూజియం ప్రాంతానికి సమీపంలో ముంబై నుంచి వచ్చిన నిర్మాణ నిపుణుల నేతృత్వంలో బ్రిడ్జిను ఏర్పాటుచేశారు.
♦ ఒకేసారి 200 మంది సామర్థ్యాన్ని తట్టుకునేలా బలమైన యాంకర్లతో పటిష్టంగా హెచ్డీపీఈ బ్లాక్‌లతో ఈ నిర్మాణం చేపట్టారు.
♦ మొత్తం 100 మీటర్లు ఉండే ఈ బ్రిడ్జి 20 మీటర్లు తీరం ఒడ్డున, 80 మీటర్లు సముద్రంపై ఉంది.
♦ అలల తాకిడికి దెబ్బతినకుండా ఉండేలా 38 యాంకర్లను వినియోగించారు. వాటిలో 150 కిలోలు బరువైనవి నాలుగు, 200 కిలోలతో 14.. 500 కిలోలతో 20 యాంకర్లు ఉన్నాయి.
♦ తాత్కాలికంగా నిర్మాణమైన ఈ బ్రిడ్జిలో వినియోగించిన బ్లాకులు, యాంకర్లు, ఇతర సామాగ్రి పూర్తిగా పర్యావరణ సానుకూలమైనవి.
బ్రిడ్జి చుట్టూ నిరంతర గస్తీ..
♦ సముద్రం అలలకు తగ్గట్లుగానే ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రతిస్పందిస్తుంటుంది.
♦ దానిపై నడిచే వారు అందుకు తగ్గట్టుగా సరికొత్త అనుభూతిని పొందుతారు.
♦ పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టులో పర్యాటకుల భద్రతపై కూడా వీఎంఆర్డీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
♦ ఫ్లోటింగ్ బ్రిడ్జి చుట్టూ రెండు పడవలతో నిర్వాహకులు నిరంతరం గస్తీ నిర్వహించనున్నారు.
♦ అలాగే, సందర్శకుల భద్రత నిమిత్తం 10 మంది గజ ఈతగాళ్లను నియమించారు.
♦ వారి పర్యవేక్షణలో మాత్రమే వంతెనపై సందర్శనకు అనుమతిస్తారు.
♦ ప్రతి సందర్శకుడికి లైఫ్‌జాకెట్ అందజేస్తారు. అది ధరించకపోతే అనుమతించరు.
♦ ఇండియన్ నేవీ వారు వినియోగించే లైఫ్ జాకెట్లను ఇందుకోసం సిద్ధంచేశారు. ఇవి 200 కేజీల బరువును 14 గంటలపాటు సముద్రంలో తేలియాడేలా చేస్తాయి. ప్రమాద సమయాల్లో లైఫ్గార్డును అప్రమత్తం చేసేందుకు జాకెట్‌కు కుడివైపున విజిల్ ఉంటుంది.
♦ బ్రిడ్జిపై సందర్శకుల వెంట ఇద్దరు లైఫ్‌గార్డులు ఉంటారు.
♦ అలాగే, బ్రిడ్జి చుట్టూ లైఫ్‌గార్డులు రక్షణ వలయంగా ఉంటారు.
♦ రక్షణకు సంబంధించి ప్రజలకు శిక్షణనిచ్చేందుకు నేవీ విశ్రాంత అధికారి, మెరైన్ కమాండోను అందుబాటులో ఉంచారు.
♦ నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను సైతం ఏర్పాటుచేశారు.