పాలేరుకు వరద పోటు
22 అడుగులకు చేరిన నీటిమట్టం
అప్రమత్తమైన ఎన్నెస్పీ సిబ్బంది
కూసుమంచి:
భారీ వర్షాల కారణంగా పాలేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో.. వరదనీరు కొంత మేర పాలేరు రిజర్వాయర్‌లో కలుస్తోంది. పాలేరుకు 1000క్యూసెక్కుల వరదనీరు వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని దేవులపల్లి రిజర్వాయర్ అలుగు పోస్తుండగా మరో 3,500 క్యూసెక్కుల వరదనీరు కాలువ ద్వారా రిజర్వాయర్‌కు చేరుతోంది. దీంతో రిజర్వాయర్‌కు సుమారు 5వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో రిజర్వాయర్ నీటి మట్టం శుక్రవారం 18.6 అడుగులు ఉండగా శనివారం సాయంత్రానికి 22 అడుగులకు చేరింది.
ఇన్‌టేక్‌వెల్‌కు పొంచి ఉన్న ప్రమాదం..
పాలేరుకు వరద పోటెత్తుతుండటంతో రిజర్వాయర్ ఒడ్డున మిషన్ భగీరథ పథకం కోసం నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్‌కు ప్రమాదం పొంచి ఉంది. రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఇన్‌టేక్‌వెల్‌లోకి నీరు వెళ్లకుండా మట్టితో నిర్మించిన కట్ట కోతకు గురవుతోంది. అది తెగితే రిజర్వాయర్‌లోని నీరు ఇన్టెక్వెల్లోకి చేరి నిర్మాణాలు మునిగే ప్రమాదం ఉంది. దీంతో సిబ్బంది అప్రమత్తమై ఇసుక బస్తాలను వేసి కట్టను పటిష్ట పరుస్తున్నారు.
దిగువకు నీటి విడుదల..
పాలేరు రిజర్వాయర్ నిండుతుండటంతోపాటు రిజర్వాయర్‌లోని ఇన్‌టేక్‌వెల్‌కు ప్రమాదం కలుగకుండా ఉండేందుకు ఎడమ కాలువకు 3,500 క్యూసెక్కుల నీటిని శనివారం మధ్యాహ్నం నుంచి విడుదల చేస్తున్నారు. ఈ నీరు రెండో జోన్‌కు సరఫరా అవుతోంది. కాగా రిజర్వాయర్ నీటిమట్టం 22 అడుగుల దాటితే ఇన్‌టెక్‌వెల్‌కు ప్రమాదం ఉన్నందున ఎన్నెస్పీ సిబ్బంది అప్రమత్తమై ఇన్‌ఫ్లోకు అనుగుణంగా అవుట్ప్లోను పెంచే చర్యలు చేపట్టారు.