foreign delegates
-
స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణం..విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణంపై జీ–20 దేశాల ప్రతినిధులు తమతమ వ్యూహాలను సమర్పించారు. విశాఖపట్నంలో జరుగుతున్న జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో మూడోరోజైన గురువారం ‘సామర్థ్య నిర్మాణం’పై వర్క్‌షాపును ఇండియన్ ప్రెసిడెన్సీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సులో జీ–20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫైనాన్సింగ్‌లలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక ప్రభుత్వాలు సమగ్ర, స్థిరమైన నగరాల కోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆర్థిక సాయం చేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిసారించారు. వర్క్‌షాపు మొదటి సెషన్లో భారత్ సహా సింగపూర్, దక్షిణ కొరియా, రష్యా, చైనా, యూరోపియన్ కమిషన్ నిపుణులు తమ దేశాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను ప్రదర్శించారు. సింగపూర్‌లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ అహ్ తువాన్‌లోహ్.. సింగపూర్ విధానాలు, సమ్మిళిత, స్థిర నగరాలను నిర్మించే వ్యూహాలను సమర్పించారు. ఇందులో డైనమిక్ అర్బన్ గవర్నెన్స్ సిస్టంతో సహా జీవించడం, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లానింగ్, అభివృద్ధి, వ్యర్థాలు, నీటి నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విద్య తదితర అంశాలపై వివరించారు. సెషన్ అనంతరం దక్షిణ కొరియా ప్రతినిధులు పట్టణాభివృద్ధి.. ఫైనాన్సింగ్‌లపై సవాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడంపై మాట్లాడారు. తమ దేశంలోని సియోల్ నగరం ఎదుర్కొన్న నిర్దిష్ట సవాళ్లను, వాటిని తగ్గించడానికి అనుసరించిన విధానాలను, పునరాభివృద్ధికి సంబంధించిన అంశాలను సియోల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్లు ఇన్హీ కిమ్, హుయ్ షిన్లు సమర్పించారు. చైనా, రష్యా, యూరోపియన్ కమిషన్‌తో పాటు భారతదేశ ప్రతినిధులు పట్టణ మౌలిక సదుపాయాలకు ఫైనాన్సింగ్‌ను పెంచడానికి చేపట్టిన చర్యలను ఫోకస్ చేయడానికి కేస్ స్టడీస్‌ను అందజేశారు. విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన వర్క్‌షాపు అనంతరం జీ–20 దేశాల ప్రతినిధులు విశాఖ నగరంలో విజయవంతంగా నడుస్తున్న మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (వీసీఐసీడీపీ)లోని స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ పథకం, ముడసర్లోవ రిజర్వాయరులోని రెండు మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్న మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, జిందాల్ సంస్థ నిర్వహిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ ప్లాంట్లను వీరు సందర్శించారు. 2023 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎజెండా కింద జరుగుతున్న చర్చలను పూర్తిచేయడానికి, ప్రాక్టికల్ లెర్నింగ్‌ను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీ–20 దేశాల ప్రతినిధులు స్వాగతించి అభినందించారు. ఇక చివరిరోజు శుక్రవారం జరిగే సమావేశంలో దేశంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొంటారు. ఇందులో వీరు తమ సంస్థల్లో చేపట్టిన ప్రాజెక్టుల అనుభవాలను, విజయాలను వివరిస్తారు. అలాగే, విశాఖ పరిధిలోకి వచ్చే వీసీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. -
నమస్తే.. మేం మీకెలా సాయపడగలం!
సాక్షి, హైదరాబాద్: ‘నమస్తే.. ఈ చారిత్రక నగరానికి మీకు స్వాగతం.. నగరంలో మీరు హాయిగా గడిపేందుకు మేం మార్గదర్శనం చేస్తాం. చారిత్రక, పర్యాటక ప్రాంతాల వివరాలు కావాలన్నా, మీ షెడ్యూల్లో స్పష్టత కావాలన్నా మమ్ముల్ని సంప్రదించండి..’పోచంపల్లిలో రూపొందిన వాస్కోటు ధరించిన యువకులు మొహంపై చిరునవ్వుతో విదేశీ అతిథులను ఇలా ‘గైడ్’చేయబోతున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు వస్తున్న దేశవిదేశీ అతిథుల సేవకు భారీ సైన్యం ఏర్పాటైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యాటక అతిథ్య సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కు చెందిన 300 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సిద్ధం చేసింది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ సాధారణంగా పెద్ద ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో పాల్గొనే వారికి టూర్ గైడ్లుగా వాలంటీర్లను సిద్ధం చేయటం కద్దు. కానీ ఈ సదస్సు ప్రతిష్టాత్మకమైంది కావటంతో టూర్ గైడ్ల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మూడు సంస్థల్లో చురుకుగా ఉండే యువకులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ప్రతినిధులు ఎయిర్‌పోర్టులో కాలు మోపింది మొదలు సదస్సు పూర్తయ్యాక మళ్లీ విమానాశ్రయానికి చేరుకునే వరకు ఈ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని వీరి నుంచి తెలుసుకునేలా సిద్ధం చేసింది. విదేశీ అతిథులు ఏ దశలో అసహనం వ్యక్తం చేయకుండా వీరికి తర్ఫీదునిచ్చారు. హైదరాబాద్ ప్రత్యేకతల గురించి ప్రశ్నిస్తే కూడా చెప్పేందుకు వీలుగా ఇక్కడి పర్యాటక ప్రాంతాలు, వంటలు, వాతావరణం, ఇతర ప్రత్యేకతల్లో ముఖ్యమైన విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఏ విషయాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా విసుక్కోవద్దని, ఎక్కడా మాటల్లో తడబాటు ఉండొద్దని, తనకు తెలియదు అన్న సమాధానం రావొద్దని నిపుణుల ద్వారా మూడ్రోజులపాటు తర్ఫీదునిచ్చారు. మధ్యలో ఓ రోజు అమెరికాకు చెందిన ఓ బృందం కూడా వచ్చి వీరికి కొన్ని పద్ధతులపై అవగాహన కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ వస్త్ర శైలిలో ప్రత్యేకతగా నిలిచేది ఆయన వాస్కోటు. అదే తరహాలో ఈ టూర్ గైడ్లకు కూడా పోచంపల్లిలో ప్రత్యేంగా వాస్కోట్లు రూపొందించి అందించారు. ‘ఇది ప్రతిష్టాత్మక సదస్సు. ఇందులో లోపం తలెత్తితే మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే ప్రత్యేక శిక్షణతో ఈ బృందాన్ని సిద్ధం చేశాం. విదేశీ ప్రతినిధులకు వీరు సంప్రదాయ పద్ధతిలో సహాయంగా ఉంటారు’అని పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టినా చోంగ్తు ‘సాక్షి’కి చెప్పారు. -
భారతీయ సంస్కృతి గొప్పది
నల్లగొండ ,భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు చాలా గొప్పగా ఉన్నాయని విదేశీ అధికారుల బృందం కొనియాడింది. మంగళవారం హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, లఘు, మధ్యపరిశ్రమల సంస్థ(నిమిస్మే) ఆధ్వర్యంలో 19 దేశాలకు చెందిన 28 మంది విదేశీ అధికారుల బృందం పోచంపల్లిని సందర్శించింది. స్థానిక టూరిజం సెంటర్, చేనేత గృహాలను సందర్శించి ప్రాచీన చేనేత కళ, దానికున్న ఆదరణను అడిగి తెలుసుకున్నారు. మగ్గాలపై తయారవుతున్న చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీని ప్రత్యకంగా పరిశీలించి కార్మికుల కళా నైపుణ్యాలను అభినందించారు. అలాగే చేనేత గృహాలకు వెళ్లి వారి జీవనశైలి, లభిస్తున్న కూలిని అడిగి తెలుసుకున్నారు. చేనేతతో పాటు చేతివృత్తులపై ఎంత మంది ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని ఆరా తీశారు. కాగా గ్రామీణ ప్రజల జీవన విధానాలు, ఆచారాలను చూసి అబ్బురపడ్డారు. ఎంతో వైవిధ్యంగా ఉన్న భారతీయ సంస్కృతి చాలా గొప్పగా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రొగ్రాం డైరెక్టర్ టి.వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ నిమిస్మేలో ‘టూరిజం అండ్ హాస్పిటలిటీ మేనేజ్మెంట్’లో 3 నెలల పాటు అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటన నిమిత్తం ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, కాంబోడియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాక్, జోర్డాన్, కజకిస్తాన్, కెన్యా, లిబేరియా, మాలి, మారిషస్, మంగోలియా, నైగర్, శ్రీలంక, తజకిస్తాన్, టాంజానియా, వియత్నాం, జాంబియా దేశాలకు చెందిన టూరిజం, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్, ప్రొగ్రాం అధికారులు వచ్చారని తెలిపారు. -
బాలల హక్కుల్ని ఎలా పరిరక్షిస్తున్నారు?
* సోషియాలజీ విద్యార్థులను ప్రశ్నించిన విదేశీ ప్రతినిధులు * ఏఎన్‌యూను సందర్శించిన బృందం గుంటూరు (ఏఎన్‌యూ) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాన్ని శుక్రవారం ఆస్ట్రియా, జర్మనీ దేశాల సోషల్ వర్క్ విద్యార్థులు, సామాజిక కార్యకర్తల బృందం సందర్శించింది. విజయవాడలోని నవజీవన్ బాలభవన్ స్వచ్ఛంద సంస్థకు ఇంటెన్షిప్ కోసం వచ్చిన పై దేశాలకు చెందిన బెట్టీనా ఐచ్చింగర్, లూకాస్ హీగల్స్బర్గర్, రెబ్కా హంబర్గ్, మైఖేల్ స్టిచ్, క్రిస్టియన్ వెయిల్గునిలు సోషియాలజీ విద్యార్థులతో చర్చించేందుకు ఏఎన్‌యూకి వచ్చారు. భారతదేశంలోని సామాజిక అంశాలు, చట్టాల గురించి తెలుసుకున్నారు. బాలల హక్కులు, వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ వర్కర్ల పాత్రపై అధ్యాపకులు, విద్యార్థులతో చర్చించారు. కార్యక్రమంలో సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగ ఇన్చార్జి కో–ఆర్డినేటర్ డాక్టర్ సరస్వతిరాజు అయ్యర్, అధ్యాపకులు డాక్టర్ వి.వెంకటేశ్వర్లు, నవజీవన్ బాలభవన్ కో–ఆర్డినేటర్ భాను, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ సందర్శన అనంతరం ఆస్ట్రియా, జర్మనీ దేశాల ప్రతినిధులు ఏఎన్‌యూలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్‌ను సందర్శించారు. ఇక్కడ చదువుతున్న వివిధ దేశాల విద్యార్థులను కలిసి వారి చదువులు, కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. స్టూడెంట్ సెల్ అడిషనల్ డైరెక్టర్ ఆచార్య ఆంజనేయులు ఏఎన్‌యూలో విదేశీ విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, విద్యాపరమైన చర్యలను బృందానికి వివరించారు. -
డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన విదేశీ అధికారులు
హైదరాబాద్: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కార్యక్రమంలో భాగంగా 21 దేశాలకు చెందిన 47 మంది పోలీసు అధికారులు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు. డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, ఫిజి, ఇండోనేషియా, కెన్యా, ఉగాండా మొదలైన పలు దేశాలకు చెందిన అధికారులున్నారు.