సాక్షి, హైదరాబాద్: ‘నమస్తే.. ఈ చారిత్రక నగరానికి మీకు స్వాగతం.. నగరంలో మీరు హాయిగా గడిపేందుకు మేం మార్గదర్శనం చేస్తాం. చారిత్రక, పర్యాటక ప్రాంతాల వివరాలు కావాలన్నా, మీ షెడ్యూల్‌లో స్పష్టత కావాలన్నా మమ్ముల్ని సంప్రదించండి..’పోచంపల్లిలో రూపొందిన వాస్‌కోటు ధరించిన యువకులు మొహంపై చిరునవ్వుతో విదేశీ అతిథులను ఇలా ‘గైడ్’చేయబోతున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు వస్తున్న దేశవిదేశీ అతిథుల సేవకు భారీ సైన్యం ఏర్పాటైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యాటక అతిథ్య సంస్థ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌కు చెందిన 300 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సిద్ధం చేసింది.
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
సాధారణంగా పెద్ద ఈవెంట్‌లు ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో పాల్గొనే వారికి టూర్ గైడ్‌లుగా వాలంటీర్లను సిద్ధం చేయటం కద్దు. కానీ ఈ సదస్సు ప్రతిష్టాత్మకమైంది కావటంతో టూర్ గైడ్ల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మూడు సంస్థల్లో చురుకుగా ఉండే యువకులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ప్రతినిధులు ఎయిర్‌పోర్టులో కాలు మోపింది మొదలు సదస్సు పూర్తయ్యాక మళ్లీ విమానాశ్రయానికి చేరుకునే వరకు ఈ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని వీరి నుంచి తెలుసుకునేలా సిద్ధం చేసింది. విదేశీ అతిథులు ఏ దశలో అసహనం వ్యక్తం చేయకుండా వీరికి తర్ఫీదునిచ్చారు.
హైదరాబాద్ ప్రత్యేకతల గురించి ప్రశ్నిస్తే కూడా చెప్పేందుకు వీలుగా ఇక్కడి పర్యాటక ప్రాంతాలు, వంటలు, వాతావరణం, ఇతర ప్రత్యేకతల్లో ముఖ్యమైన విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఏ విషయాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా విసుక్కోవద్దని, ఎక్కడా మాటల్లో తడబాటు ఉండొద్దని, తనకు తెలియదు అన్న సమాధానం రావొద్దని నిపుణుల ద్వారా మూడ్రోజులపాటు తర్ఫీదునిచ్చారు. మధ్యలో ఓ రోజు అమెరికాకు చెందిన ఓ బృందం కూడా వచ్చి వీరికి కొన్ని పద్ధతులపై అవగాహన కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ వస్త్ర శైలిలో ప్రత్యేకతగా నిలిచేది ఆయన వాస్‌కోటు. అదే తరహాలో ఈ టూర్ గైడ్లకు కూడా పోచంపల్లిలో ప్రత్యేంగా వాస్‌కోట్లు రూపొందించి అందించారు. ‘ఇది ప్రతిష్టాత్మక సదస్సు. ఇందులో లోపం తలెత్తితే మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే ప్రత్యేక శిక్షణతో ఈ బృందాన్ని సిద్ధం చేశాం. విదేశీ ప్రతినిధులకు వీరు సంప్రదాయ పద్ధతిలో సహాయంగా ఉంటారు’అని పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టినా చోంగ్తు ‘సాక్షి’కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment