వర్క్‌షాపునకు హాజరైన దేశ విదేశీ ప్రతినిధులు
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణంపై జీ–20 దేశాల ప్రతినిధులు తమతమ వ్యూహాలను సమర్పించారు. విశాఖపట్నంలో జరుగుతున్న జీ–20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో మూడోరోజైన గురువారం ‘సామర్థ్య నిర్మాణం’పై వర్క్‌షాపును ఇండియన్ ప్రెసిడెన్సీ, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సులో జీ–20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫైనాన్సింగ్‌లలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్థానిక ప్రభుత్వాలు సమగ్ర, స్థిరమైన నగరాల కోసం అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఆర్థిక సాయం చేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిసారించారు. వర్క్‌షాపు మొదటి సెషన్‌లో భారత్ సహా సింగపూర్, దక్షిణ కొరియా, రష్యా, చైనా, యూరోపియన్ కమిషన్ నిపుణులు తమ దేశాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను ప్రదర్శించారు.
సింగపూర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ అహ్ తువాన్‌లోహ్.. సింగపూర్ విధానాలు, సమ్మిళిత, స్థిర నగరాలను నిర్మించే వ్యూహాలను సమర్పించారు.
ఇందులో డైనమిక్ అర్బన్ గవర్నెన్స్ సిస్టంతో సహా జీవించడం, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లానింగ్, అభివృద్ధి, వ్యర్థాలు, నీటి నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విద్య తదితర అంశాలపై వివరించారు. సెషన్ అనంతరం దక్షిణ కొరియా ప్రతినిధులు పట్టణాభివృద్ధి.. ఫైనాన్సింగ్‌లపై సవాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడంపై మాట్లాడారు.
తమ దేశంలోని సియోల్ నగరం ఎదుర్కొన్న నిర్దిష్ట సవాళ్లను, వాటిని తగ్గించడానికి అనుసరించిన విధానాలను, పునరాభివృద్ధికి సంబంధించిన అంశాలను సియోల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్లు ఇన్హీ కిమ్, హుయ్ షిన్‌లు సమర్పించారు. చైనా, రష్యా, యూరోపియన్ కమిషన్‌తో పాటు భారతదేశ ప్రతినిధులు పట్టణ మౌలిక సదుపాయాలకు ఫైనాన్సింగ్‌ను పెంచడానికి చేపట్టిన చర్యలను ఫోకస్ చేయడానికి కేస్ స్టడీస్‌ను అందజేశారు.
విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన
వర్క్‌షాపు అనంతరం జీ–20 దేశాల ప్రతినిధులు విశాఖ నగరంలో విజయవంతంగా నడుస్తున్న మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (వీసీఐసీడీపీ)లోని స్మార్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ పథకం, ముడసర్లోవ రిజర్వాయరులోని రెండు మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్న మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, జిందాల్ సంస్థ నిర్వహిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్లాంట్లను వీరు సందర్శించారు.
2023 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎజెండా కింద జరుగుతున్న చర్చలను పూర్తిచేయడానికి, ప్రాక్టికల్ లెర్నింగ్‌ను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీ–20 దేశాల ప్రతినిధులు స్వాగతించి అభినందించారు. ఇక చివరిరోజు శుక్రవారం జరిగే సమావేశంలో దేశంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొంటారు. ఇందులో వీరు తమ సంస్థల్లో చేపట్టిన ప్రాజెక్టుల అనుభవాలను, విజయాలను వివరిస్తారు. అలాగే, విశాఖ పరిధిలోకి వచ్చే వీసీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment