Foreign Language
-
ఈజీగా విదేశీ భాష, క్రేజీగా కొరియన్ నేర్చుకుందామా!
విదేశీ భాషని అధ్యయనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన రెస్యూమ్‌ను బలోపేతం చేయడంతో పాటు పర్యాటక రంగంలో, గైడ్స్‌గా ఇతరత్రా రంగాల్లో రాణించడానికి, ట్రావెల్, బ్లాగులను తయారు చేయడం తదితర ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రపంచం నలుమూలలకూ కమ్యూనికేట్ చేయగలిగేలా చేస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయలో ప్రవేశాలకు కూడా ఉపయుక్తం అవుతున్నాయి.. ప్రస్తుతం వర్క్ కల్చర్, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో విదేశీ భాషా నైపుణ్యాలతో ఫ్రీలాన్సర్‌గా అవకాశాలు పెరిగాయి. ఓటీటీ తదితర వేదికల విజృంభణతో అనువాదకులకు భారీగా డిమాండ్ పెరగడం కూడా విదేశీ భాషలను క్రేజీగా మార్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు దేశ విదేశాలలో రాయబార కార్యాలయాలు, హై–కమిషన్లలో విదేశీ భాషా ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీలైన కోర్సులకు డిమాండ్ సంతరించుకుంటున్నాయి. డిమాండ్‌లో ఫ్రెంచ్.. క్రేజీగా కొరియన్.. కొత్త భాషలు నేర్చుకోవడం కొన్నేళ్ల క్రితం వరకూ కేవలం హాబీగా భావించేవారు. అయితే, ప్రపంచీకరణతో విదేశీ భాషా నైపుణ్యం ఆదాయమార్గంగా కూడా అవతరించింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా నగరవాసుల్లోనూ విదేశీ భాషలపై ఆసక్తి పెరుగుతోంది. సంపాదన కోసమో, మరేదైనా లక్ష్యాలతోనో సీరియస్‌గా ఫారిన్ లాంగ్వేజెస్‌కు జై కొడుతున్నారు. ప్రస్తుతం ఫ్రెంచి, రష్యన్, స్పానిష్, చైనీస్ అరబిక్ వంటి అనేక విదేశీ భాషలు బాగా డిమాండ్‌లో ఉన్నాయి. ఇటీవలే కొరియన్ వెబ్‌సిరీస్, మ్యూజిక్కూ పెరిగిన ఆదరణ కొరియన్ భాషా పరిజ్ఞానంపై యువత ఆసక్తిని పెంచింది. – సాక్షి, హైదరాబాద్ఈ నేపథ్యంలో విదేశీ భాష నేర్చుకోవడంలో సహాయపడే అనేక అకాడమీలు, సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి. ఆయా భాషల కోర్సు వ్యవధి సాధారణంగా ఆరు నుంచి 12 నెలల్లో పూర్తి చేసి ప్రొఫెషనల్ డిగ్రీని అందుకుంటారు. అయితే అనర్గళంగా మాట్లాడడం, చదవడం, రాయడం అర్థం చేసుకోవడంపై పూర్తి పట్టు సాధించేందుకు మరింత వ్య«వధి అవసరం అవుతుందని శిక్షకులు అంటున్నారు. ఇవి కాకుండా ఒక విద్యార్థి ఆ భాష చరిత్ర, భాష సంస్కృతి సంబంధిత దేశాల ప్రజలు, అర్థం చేసుకునే పద్దతి, ఆ భాష యాస, డిక్షన్ గురించి కూడా నేర్చుకుంటేనే పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత సరి్టఫికెట్ డిప్లొమా స్థాయి కోర్సు లేదా పన్నెండో తరగతి పూర్తి చేసిన తర్వాత విదేశీ భాషలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించవచ్చు. నగరంలో ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు వంటివి విదేశీ భాషల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అలాగే పలు ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విదేశీ భాషా కోర్సులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. స్పానిష్ జోష్.. దాదాపు 50 కోట్ల మందికి పైగా మాట్లాడే వారితో స్పానిష్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషలలో రెండో స్థానంలో ఉంది. స్పానిష్ మాట్లాడే దేశాలతో మన దేశానికి ఇటీవల పెరుగుతున్న వాణిజ్యం దృష్ట్యా నేర్చుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యాపారం, ఆతిథ్యం పర్యాటక రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఇది బెస్ట్. ఫ్రెంచ్ పట్ల ఆసక్తి.. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పైగా మాట్లాడే ఫ్రెంచ్ అత్యధికంగా మాట్లాడే భాషగా ఆరో స్థానంలో ఉంది. ఇది ఫ్రాన్స్, కెనడాతో సహా 29 దేశాల్లో అధికారిక భాష. ఫ్యాషన్, హాస్పిటాలిటీ, టూరిజంలో కెరీర్‌కు ఉపకరించే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి విశ్వవ్యాప్తంగా విలువైన భాష. విన్.. జపాన్.. సాంకేతిక హబ్ హోదా, భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన జపాన్ జపనీస్ అత్యధికులు కోరుకునే భాషగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా మాట్లాడే ఈ భాష సాంకేతికత, యానిమేషన్, గేమింగ్‌లో కెరీర్‌ను ఎంచుకున్న సిటీ యూత్ ఎంపికగా మారింది. మాండరిన్.. మంచిదే.. మనదేశపు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనాను దృష్టిలో ఉంచుకుంటే.. అంతర్జాతీయ వ్యాపారం, దౌత్యం పర్యాటక రంగం కోసం మాండరిన్ నేర్చుకోవడం అవసరంగా మారింది. కో అంటే కొరియన్.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మందికి పైగా మాట్లాడే కొరియన్‌కు నగరంలో బాగా డిమాండ్ ఉంది. ఆసియాలో మనదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కొరియా కావడం సాంకేతిక, వినోద పర్యాటక రంగాల్లో ఈ భాషా నైపుణ్యానికి డిమాండ్ పెంచుతోంది.జర్మన్‌కు జై.. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా, యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే భాష జర్మన్. జర్మన్ నేర్చుకోవడం ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో విభిన్న అవకాశాలకు తలుపులు తెరుస్తోంది. ఇదీ..ఇటాలియన్..యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే నాల్గో భాష ఇది. పర్యాటక కేంద్రంగా మరియు ఫ్యాషన్ మరియు డిజైన్‌కు కేంద్రంగా ఇటలీకి ఉన్న ప్రాచుర్యంతో ఫ్యాషన్, డిజైన్, హాస్పిటాలిటీలో కెరీర్‌ను లక్ష్యంగా చేసుకున్న సిటీ విద్యార్థులకు రైట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. గ్రేస్.. పోర్చుగీస్..బ్రెజిల్ పోర్చుగల్‌తో సహా ఎనిమిది దేశాల్లో మాట్లాడేది పోర్చుగీస్. ఈ దేశాలతో మనకు విస్తరిస్తున్న సంబంధాల కారణంగా పోర్చుగీస్ భాషలో ప్రావీణ్యం అనేది భవిష్యత్తు విజయాలకు బాట వేస్తుంది.పలు భాషల్లో ప్రావీణ్యం కోసం.. విదేశీ భాషా పరిజ్ఞానం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో ప్రయోజనాలను యువత ఆశిస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు చేరింది. కెనడాలో ఉండే భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా మాకు స్టూడెంట్స్‌గా ఉన్నారు. నేర్చుకోవడం అనేది ఇలా సులభంగా మారడం కూడా విదేశీ భాషల పట్ల ఆసక్తిని పెంచుతోంది. – ఎం.వినయ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్రెంచ్ భాషా విభాగం, ఉస్మానియా వర్సిటీ -
వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సాక్షి ఉత్తరాఖండ్(హరిద్వార్): హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్‌ను భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలోని ప్రజలు తమ ‘వలసవాద మనస్తత్వాన్ని’ విడిచిపెట్టి, తాము భారతీయులం అని గర్వపడటం నేర్చుకోవాలని కోరారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుందని ఇక లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని పూర్తిగా స్వస్తి పలకాలని పిలుపు నిచ్చారు. ‘దేశంలో విద్యా మాధ్యమంగా.. విదేశీ భాషను విధించి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేశారని ఆరోపించారు. ఆ విద్యా విధానం మనల్ని మనం తక్కువ జాతిగా చూసుకోవడం నేర్పింది. మన స్వంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరించేలా చేసింది. దేశీయంగా కూడా మన ఎదుగుదలను మందగించేలా చేసింది. ఈ విద్యా విధానానికి సంబంధించిన విద్యను కొంతమందికే పరిమితం చేసింది. దీని వల్ల అధిక జనాభా విద్యాహక్కును కోల్పోతోంది’ అని అన్నారు. మన వారసత్వం, మన సంస్కృతి, మన పూర్వీకుల గురించి మనం గర్వపడటమే కాక మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్లాలన్నారు. మనం అనేక భారతీయ భాషలను నేర్చుకోవడమే కాక మాతృభాషను ప్రేమించాలని తెలిపారు. జ్ఞాననిధి అయిన మన గ్రంధాలను తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకోవాలని చెప్పారు. అన్ని గ్యాడ్జెట్ నోటిఫికేషన్లు సంబంధిత రాష్ట్ర మాతృభాషలో విడుదలయ్యే రోజుకోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. మీ మాతృభాష మీ కంటి చూపు లాంటిదని విదేశీ భాషపై ఉన్న జ్ఞానం మీ కళ్లద్దాలు లాగా ఉండాలని అభివర్ణించారు. భారతదేశ నూతన విద్యా విధానానికి భారతీయకరణ ప్రధానమైనదని మాతృభాషల ప్రోత్సాహానికీ అధిక ప్రాధాన్యతనిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాల సిలబస్‌లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెడతామని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు విద్యను కాషాయికరణం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డాయి. దీంతో వెంక్యనాయుడు బీజేపీ అన్నదాంట్లో తప్పేముందంటూ గట్టి కౌంటరిచ్చారు. మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న తత్వాలైన సర్వే భవంతు సుఖినాః (అందరూ సంతోషంగా ఉండండి) , వసుధైవ్ కుటుంబకం (ప్రపంచం ఒకే కుటుంబం) వంటివి నేటికీ మన విదేశాంగ విధానానికి మార్గదర్శకాలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు. (చదవండి: అమిత్ షాతో భేటీ పచ్చి అబద్ధం.. బీజేపీలో చేరేదే లే!) -
ఎన్ఈపీ 2020: చైనీస్ భాషపై సందిగ్దత!
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ నూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ–2020)కు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రి స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అంతేగాక కనీసం 5వ తరగతి వరకు మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా ఉంచాలని.. 8వ తరగతి నుంచి ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించింది. మూడు భాషల విధానంలో భాగంగా పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు సంస్కృతాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది.(విద్యార్థుల అభీష్టమే ఫైనల్) అదే విధంగా ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుంటుందని, 6–8 గ్రేడ్ ల మధ్య ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమం కింద విదేశీ భాషలను సెకండరీ విద్యాస్థాయిలో నేర్చుకోవచ్చని పేర్కొంది. అయితే గతేడాది విదేశీ భాషల విభాగంలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్, చైనీస్ భాషలను ముసాయిదాలో పేర్కొన్న కేంద్రం.. బుధవారం నాటి కేబినెట్ నిర్ణయంలో మాత్రం చైనీస్ భాష గురించి ప్రస్తావన తీసురాలేదు. అంతేగాక ఈ ఏడాది కొత్తగా కొరియన్, రష్యన్, పోర్చుగీస్, థాయ్ భాషలను ఈ జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో తాజా లిస్టు నుంచి చైనీస్(మాండరిన్)ను మినహాయించిన క్రమంలో ఈ భాషను నేర్చుకునేందుకు విద్యార్థులకు అవకాశం ఉందా లేదా అన్న విషయంలో సందిగ్దత నెలకొంది. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) మరోవైపు.. సరిహద్దుల్లో చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఉద్దేశపూర్వంగా చైనీస్‌ను పక్కన బెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా గల్వాన్ లోయలో జూన్‌లో చైనా ఆర్మీ భారత సైన్యాన్ని దొంగ దెబ్బ కొట్టి 20 మంది సైనికుల ప్రాణాలు బలిగొన్న విషయం విదితమే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు చర్చలు జరుగుతున్నా డ్రాగన్ తన వైఖరి మార్చుకోకపోవడంతో భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. చైనీస్ యాప్‌లతో జాతీయ భద్రత, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించి జూన్ 29న టిక్‌టాక్ సహా 59 యాప్‌లను నిషేధించిన కేంద్రం.. ఇటీవల మరో 47 యాప్‌లపై సైతం నిషేధం విధించింది. ఇక బుధవారం ప్రకటించిన నూతన విద్యావిధానంలో చైనీస్ భాషను మినహాయించడంపై కూడా ఉద్రిక్తతల ప్రభావం పడినట్లు కనబడుతోంది. -
టీచర్లకు విదేశీ భాషలు నేర్పించండి : యోగి
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని టీచర్లకు విదేశాల్లో బోధించేందుకు వీలుగా విదేశీ భాషలు నేర్పించాలని సూచించారు. అలాగే ఇటీవల నిర్వహించిన యూపీ బేసిక్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని గుర్తుచేశారు. దిగ్విజయ్నాథ్ ఎల్టీ ట్రైనింగ్ కాలేజ్‌లో నిర్వహించిన సెమినార్లో సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ టీచర్లకు విదేశాల్లో డిమాండ్ అధికంగా ఉందని చెప్పారు. దేశంలోని ఉపాధ్యాయులను విదేశాలకు పంపించే విధంగా వారి అర్హతలను పెంపొందించాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని విద్యాసంస్థలు అన్నీ.. ఏయే దేశాల్లో టీచర్ల అవసరం ఉందో తెలుసుకుని అక్కడ ఏ భాషలు మాట్లాడుతారో గుర్తించాలని ఆదేశించారు. అలా గుర్తించిన భాషలను టీచర్ ట్రైనింగ్ పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. బేసిక్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షలో శిక్షణ పొందిన 70 శాతం మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థులు విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇది మన విద్యా వ్యవస్థ నాణ్యతను తెలియజేస్తుందని.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. -
మందేస్తే.. లాంగ్వేజ్ సూపర్!
లండన్: పరిమిత స్థాయిలో మద్యం సేవించేవారిలో విదేశీ భాషలో మాట్లాడే సామర్థ్యం మెరుగవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నెదర్లాండ్‌లోని మాస్ట్రిచ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూర్, లండన్‌లోని కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇటీవల డచ్ నేర్చుకున్న 50 మంది జర్మన్లను ఎంపిక చేశారు. ఒక్కొక్కరి శరీర బరువును బట్టి మద్యం డోస్‌ను నిర్ధారించారు. ఈ అభ్యర్థుల భాషా ప్రావీణ్యాన్ని గుర్తించేందుకు ఇద్దరు డచ్ పౌరుల్ని ఎంపిక చేశారు. అంతేకాకుండా తమ భాషా నైపుణ్యానికి మార్కులు ఇచ్చుకోవాల్సిందిగా అభ్యర్థులకు పరిశోధకులు సూచించారు. అయితే ఈ వ్యక్తులు మద్యం సేవించిన విషయాన్ని మాత్రం ఇద్దరు డచ్ పరిశీలకులకు తెలియజేయలేదు. పరిమిత స్థాయిలో మద్యం సేవించిన వ్యక్తులు మద్యం తాగని వారితో పోల్చుకుంటే డచ్ భాషను మాట్లాటడంలో ఎంతో మెరుగ్గా వ్యవహరించారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
యూపీఎస్సీ సిలబస్‌పై జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్ నుంచి ఇంగ్లిష్‌ను తప్పించాలని జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ఉపాధ్యాయులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కార్యాలయం ముందు గురువారం ఆందోళనకు దిగారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ను తొలగించాలని, లేకపోతే ఇతర విదేశీ లాంగ్వేజ్‌లను చేర్చాలని కోరారు. జేఎన్‌యూ ఉపాధ్యాయులు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జేఎన్‌యూ విద్యార్థుల యూనియన్ యూపీఎస్సీ చైర్మన్ డీపీ అగర్వాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రపంచీకరణ గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం, అధికారులు యూపీఎస్సీ సిలబస్‌లో విదేశీ లాంగ్వేజీలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం విదేశీ లాంగ్వేజీని చదువుతున్న అనేక మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని జేఎన్యూఎస్ యూ అధ్యక్షుడు అక్బర్ ఆందోళన వ్యక్తం చేశారు.