మారిన టెస్లా వెబ్ అడ్రస్..!
ప్రపంచంలో కెల్లా అత్యంత విజయవంతమైన ఎలక్ట్రిక్ కారు కంపెనీ టెస్లా మోటార్స్, తన ఇంటర్నెట్ అడ్రస్ ను మార్చుకుంది. టెస్లామోటార్స్.కామ్ గా ఉన్న అడ్రస్ ను కుదించుకుని టెస్లా.కామ్ గా చేసుకుంది. సోమవారం నుంచి ఈ డొమైన్ పేరు, అడ్రస్ లు అప్ డేట్ అయినట్టు ఇంటర్నెట్ అక్రెడిటేషన్ కంపెనీ ఐసీఏఎన్ఎన్ తెలిపింది. వెబ్ యూజర్లు ఆటోమేటిక్ గా కొత్త టెస్లా.కామ్ వెబ్ అడ్రస్ లోకి మళ్లించబడతారని ఐసీఏఎన్ఎన్ రిపోర్టు పేర్కొంది.
టెస్లా వెబ్ అడ్రస్ మార్పుతో కంపెనీ అధికారిక పేరు కూడా మారబోతుందా అనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై కంపెనీ సీఈవో ఎలోన్ మాస్క్ సైతం కొంత హింట్ ఇచ్చారట. అయితే కంపెనీ పేరు మార్చే మాస్టర్ ప్లాన్ పై ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు.
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సైతం తన పేరును 2007లో యాపిల్ కంప్యూటర్ నుంచి యాపిల్ ఇంక్ గా మార్చుకుంది. కొత్త పథంలో కంపెనీ వ్యాపారాలను నడిపిస్తున్న నేపథ్యంలో ఐఫోన్ ను లాంచ్ చేసిన కొద్ది రోజులోనే తన పేరును యాపిల్ ఇంక్ కు కుదించుకుంది. టెస్లా సైతం ఈ బాటలో ఏమైనా నడవబోతుందా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
ఎలక్ట్రిక్ వెహికిల్స్ తో పాటు, గృహాలకు, వ్యాపారాలకు ఉపయోగించే టెస్లా స్టేషనరీ స్టోరేజీ బ్యాటరీలను టెస్లా తయారుచేస్తోంది. కంపెనీ బ్యాటరీల కోసం టెస్లాఎనర్జీ.కామ్ లో వెతికే వెబ్ యూజర్లు, ఈ అడ్రస్ మార్పుతో టెస్లా.కామ్/ఎనర్జీకి మళ్లించబడతారు. టెస్లా.కామ్ అడ్రస్ పై టెస్లా ఈ ఏడాది మొదట్లోనే అన్ని హక్కులను పొందింది. ప్రస్తుతమనున్నఇంటర్నెల్ ఈ-మెయిల్ అడ్రస్ స్థానంలో కొత్త డొమైన్ అడ్రస్ నూ త్వరలోనే వినియోగదారుల ముందుకు రాబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు.