భావప్రసారాన్ని హరించకూడదు: ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: పరువునష్టం చట్టాన్ని ప్రజల భావ ప్రసార స్వేచ్ఛను హరించేలా, న్యాయవ్యవస్థలో ప్రవేశించేలా ఉండకూడదని ఢిల్లీ కోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. తమ పరువుకు భంగం కలిగించాడని ఆరోపిస్తూ ఫ్రాంక్ఫిన్ ఏవియేషన్ సర్వీసెస్ అనే సంస్థ ఓ విద్యార్థిపై చేసిన కేసును కోర్టు విచారించింది. పుణేకు చెందిన హరీష్ భాటియా కొడుకు ఆ సంస్థపై చీటింగ్ కేసు పెట్టాడు. ఈ సంస్థ ఢిల్లీలో తనపై అనేక తప్పుడు కేసులు పెట్టడం ద్వారా తనను ఇబ్బందులకు గురి చేస్తుందనేది కేసు సారాంశం.
అయితే అతనే కావాలని సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని సంస్థ వాదిస్తోంది. కోర్టు సాక్షిగా 2014లో తమ సంస్థను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తోంది. తన కొడుకు 2008లో లెవల్–5 బీటెక్ కోసం ఈ సంస్థలో చేరాడని, ఫిబ్రవరి, 2009లో ఈ సంస్థ కోర్సు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిందని, ఫ్రాంక్ ఫిన్ సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్ బోగస్దని తేలిందని భాటియా వాదన.