రిలయన్స్ జియోకు క్లీన్ చిట్ వచ్చేసింది!
జీవిత కాల వ్యవధిలో రిలయన్స్ జియో అందించే ఉచిత వాయిస్ కాలింగ్ సర్వీసులపై క్లీన్ చిట్ వచ్చేసింది. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్స్ ప్రస్తుత నిబంధనలకు ఆమోదయోగ్యంగానే ఉన్నాయని, వివక్షాపూరితంగా లేవని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ స్పష్టంచేసింది.
ట్రాయ్ దగ్గర రిలయన్స్ జియో నమోదుచేసిన టారిఫ్ ప్లాన్స్, ఐయూసీకి ఆమోదయోగ్యంగా లేవని, మార్కెట్లో దోపిడీ పద్ధతులకు తెరతీసేలా ఉన్నాయనడంలో ఎలాంటి రుజువులు లేవని తేల్చిచెప్పింది. ఈ మేరకు టెలికాం ఆపరేటర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ లేఖ రాసింది. టెలికాం ఆపరేటర్లు చేస్తున్న ఆరోపణలను కొట్టిపడేస్తూ.. రిలయన్స్ జియోకు క్లీన్ చిట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. రిలయన్స్ జియో అందించే ఉచిత కాల్ సర్వీసులపై జియో ప్రత్యర్థులు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఇతర టెలికాం కంపెనీలు ట్రాయ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కాలింగ్ టారిఫ్ ప్లాన్, ప్రస్తుత నిబంధనలకు వ్యతిరేకంగా దోపిడీ పద్దతులకు తెరదీసేలా ఉన్నాయని టెలికాం ఆపరేటర్లు ఆరోపించాయి. టెలికాం రెగ్యులేటర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లే అవుట్గోయింగ్ కాల్స్‌కు నిమిషానికి 14 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఉచిత వాయిస్ కాల్ ఆఫర్స్‌తో రిలయన్స్ దోపిడీకి తెరతీసిందని ఇతర టెలికాం ఆపరేటర్లు తీవ్రంగా మండిపడ్డాయి. ట్రాయ్ లెటర్‌కు రిలయన్స్ జియో సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం నిబంధనలకు తమ అన్నీ టారిఫ్ ప్లాన్స్ కట్టుబడి ఉన్నాయనడంలో ట్రాయ్ వద్ద కూడా నిరూపితమైందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో తెలిపింది.
రిలయన్స్ జియో సేవలతో టెలికాం మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ముఖేష్ అంబానీ వినియోగదారులకు జీవితకాలం పాటు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్‌కు అన్నింటికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్‌తో పాటు డిసెంబర్ 31 వరకు అపరిమిత ఉచిత 4జీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఆఫర్‌ను అందించనున్నట్టూ జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.