‘గణేషు’నితో బేరాలు..!
గణేష్ మండళ్లకు అభ్యర్థుల తాయిలాలు
* ‘గాలం’ తగిలితే వెయ్యి ఓట్లు ఓకే..
* ప్రధానపార్టీలకు తప్పని పాట్లు
* అష్టవినాయక మందిరాలు చూపిస్తామని ఒకరి హామీ
* ‘ఫ్రీ పిక్నిక్’ పేరుతో మరొకరి వాగ్దానం
* ముందుగానే రిజర్వేషన్లు చేయించాలని డిమాండ్ చేస్తున్న మండళ్లు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల సెగ పెరిగింది. బహుముఖ పోటీ నెలకొనడంతో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ ఐడియాలతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు వివిధ గణేష్ మండళ్ల సభ్యులను ఉచితంగా తీర్థయాత్రలకు అదేవిధంగా విహార యాత్రలకు తీసుకెళ్తామనీ దీంతో తమకు ఓటు వేయమని అర్థిస్తున్నారు.
వర్సోవాకు చెందిన ఓ గణపతి మండల్ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభ్యర్థులు తమకు ఓటు వేస్తే రాష్ట్రంలో ఉన్న ఎనిమిది అష్టవినాయక మందిరాలను చూపిస్తామని హామీ ఇచ్చారన్నారు. రాజకీయ పార్టీ నాయకులు ‘ఫ్రీ పిక్నిక్’ పేరుతో ఓటర్లకు ఎర వేస్తున్నారన్నారు. కానీ ఎన్నికల్లో గెలుపు సాధించిన తర్వాత ఈ నాయకులు తమ ముఖాలనే చూపించరని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు అష్టవినాయక దర్శనం, అదేవిధంగా విహార యాత్ర పేరు చెప్పి తమ ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
అయితే ఇందులో కొంచెం మార్పు చేసి దివాలీ పార్టీలు, క్రికెట్ టోర్నమెంట్లను ఏర్పాటు చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. గణేష్ మండళ్ల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఓ సమావేశంలో దీనిని ప్రతిపాదించారు. అయితే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఈసారి వివిధ రాజకీయ పార్టీలు గణేష్ మండళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఒక్కో మండలి నుంచి 500 నుంచి 1,000 ఓట్లను పొందవచ్చని అవి అంచనా వేస్తున్నాయి. అయితే ఎన్నికల ముందే విహారయాత్రలకు, గణపతి దర్శనాలకు టికెట్లు బుక్ చేసి ఇవ్వాలని ఆయా మండళ్లు అభ్యర్థులకు షరతులు విధిస్తుండటంతో వారు తలగోక్కోవాల్సి వస్తోంది. తాము ఏ రాజకీయ పార్టీలను నమ్మబోమని, ప్రతిసారీ ఇలా హామీలు ఇవ్వడం.. ఎన్నికల తర్వాత వాటిని పట్టించుకోకపోవడం సదరు నాయకులకు పరిపాటిగా మారిందని, అందుకే ఎన్నికలకు ముందే టికెట్లు బుక్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని మండళ్ల ప్రతినిధులు చెబుతున్నారు.