frisking
-
NEET: లోదుస్తుల వివాదం.. బాధిత అమ్మాయిలకు మళ్లీ ‘నీట్’ పరీక్ష
న్యూఢిల్లీ: కేరళలో నీట్ పరీక్షకు హాజరైన సందర్భంగా ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో లోదుస్తులు విప్పించి.. ఆ తర్వాతే పరీక్ష రాయడానికి వెళ్లాలని సిబ్బంది ఆదేశించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ వివాదంలో జాతీయ పరీక్షల మండలి(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద అవమానం ఎదుర్కొన్న బాధిత అమ్మాయిలు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఎన్టీఏ. వారికి సెప్టెంబరు 4న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి విద్యార్థినులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం చేరవేసినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జులై 17న నీట్ పరీక్ష సమయంలో తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దాంతో అది పెను దుమారం రేపింది. కేరళలోని కొల్లం జిల్లా ఆయుర్‌లో గల మార్థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. లోదుస్తులకు ఉన్న హుక్స్ కారణంగా సౌండ్ వచ్చిందని దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కళాశాల సిబ్బందిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఘటనపై నిజ నిర్ధారణ కమిటీని నియమించింది ఎన్టీఏ. ఈ కేసులో కేరళ పోలీసులు తనిఖీలు చేపట్టిన ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: NEET Dress Code Controversy: ఇదంత ‘నీట్’ కాదేమో!? -
పాక్ ప్రధాని తనిఖీపై అమెరికా వివరణ
న్యూ ఢిల్లీ : అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ భద్రతా తనిఖీలు ఎదుర్కొన్నారనే వార్తలు, దానికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో తమ ప్రధాని పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని అమెరికాపై పాక్ గుర్రుగా ఉంది. అయితే తాము ఎందుకు అలా వ్యవహరించాల్సి వచ్చిందో అమెరికా అధికారులు గురువారం వెల్లడించారు. పాక్ ప్రధాని వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వచ్చారని, మిగిలిన ప్రయాణికుల మాదిరే ఆయన కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలని..అందుకే తాము అబ్బాసీని కూడా తనిఖీ చేసామని, వ్యక్తిగత పర్యటనలు చేసేవారు ఎవరైనా ఇందుకు మినహాయింపు కాదని యూఎస్ డిప్యూటీ ప్రతినిధి అలెగ్జాండర్ మెక్లారెన్ మీడియాకు వెల్లడించారు. ఆయన పర్యటన అధికారిక పర్యటన అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు వేరుగా ఉండేవన్నారు. పాక్ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం అబ్బాసీ అనారోగ్యంతో ఉన్న తన సోదరిని సందర్శించడానికి అమెరికా వెళ్లారు. -
అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో అసలేం జరిగింది?
ఇస్లామాబాద్: అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ భద్రతా తనిఖీలు ఎదుర్కొన్నారనే వార్తలు పాక్, అమెరికా సంబంధాలను మరింత దెబ్బతీసేలా ఉన్నాయి. తమ ప్రధాని పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని అమెరికాపై పాక్ మండిపడుతోంది. పాక్ జాతీయులపై ట్రంప్ యంత్రాంగం చేపట్టిన వీసా బ్యాన్ నియంత్రణలను ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ప్రధాని స్వచ్ఛందంగా భద్రతా ప్రమాణాలను అనుసరించారని పాక్‌కు చెందిన జియో న్యూస్ పేర్కొంది. అబ్బాసీ అమెరికాలో ప్రైవేట్ పర్యటనలో ఉన్నారని పేర్కొంటూ పాక్ ప్రధాని సెక్యూరిటీ ప్రొటోకాల్ లేకుండా ఎయిర్‌పోర్ట్‌లో కనిపిస్తున్న వీడియోను జియో న్యూస్ విడుదల చేసింది. వ్యక్తిగత జీవితంలో అబ్బాసీ ఎంత నిరాడంబరంగా ఉంటారనేందుకు ఇది నిదర్శనమని తెలిపింది. ఇటీవల బ్రిటన్ పర్యటనలోనూ ఆయన రైలులో ఒంటరిగా ప్రయాణించారని గుర్తు చేసింది. పుట్టినరోజు వేడుకల్లోనూ శాలువా ధరించి బర్త్‌డే కేక్‌ను కట్‌చేస్తున్న ఆయన ఫోటోను జియో న్యూస్ ప్రదర్శించింది. -
భద్రాది రామాలయంలో ఆభరణాల తనిఖీ
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని బంగారు ఆభరణాలను దేవాదాయ శాఖ జ్యూయలరీ అధికారి భాస్కర్ మంగళవారం తనిఖీ చేశారు. సీతమ్మ మంగళ సూత్రం, లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ మాయమైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆలయంలోని మొత్తం ఆభరణాల లెక్క తేల్చాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జేవీవో భాస్కర్ బంగారు ఆభరణాలను పరిశీలించారు. ఆలయ ఈవో రమేష్‌బాబుతోపాటు అర్చకుల సమక్షంలో గర్భ గుడిలోని ప్రత్యేక బీరువాలోని ఆభరణాలను బయటకు తీశారు. అందుబాటులో ఉన్న నివేదిక ఆధారంగా ఒక్కో బంగారు ఆభరణాన్ని పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారి భాస్కర్ మాట్లాడుతూ... బంగారు ఆభరణాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఆభరణాల మాయంపై ఆలయ అధికారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భద్రాచలం సీఐ శ్రీనివాసులు ఆలయాన్ని సందర్శించి.. కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. బంగారు ఆభరణాలు భద్రపరిచే ప్రదేశంతోపాటు ఆలయంలో సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉందనే అంశాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆలయ ఈవో రమేష్‌బాబుతో సీఐ చర్చించారు. అర్చకులు, సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. వాస్తవంగా భద్రాద్రి ఆలయంలో 50 కేజీల బంగారం, 750 కేజీల వెండి ఉంది. అయితే అర్చకుల ఆధ్వర్యంలో ఉన్న బంగారు ఆభరణాలనే ప్రస్తుతం తనిఖీ చేస్తున్నారు. మొత్తం పరిశీలించినట్లు అయితే స్వామి వారి బంగారం భద్రంగా ఉందా లేదా అనే అంశం తేలనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
తనిఖీల్లో రూ. కోటి స్వాధీనం
మదురై : ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన వాహన తనిఖీల్లో కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దిండుగల్‌లో సహాయ వాణిజ్య పన్నుశాఖ అధికారి దీనదయాళన్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ హెడ్‌పోస్టాఫీసు వద్ద జరిపిన వాహన తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా వాహనంలో తీసుకెళుతున్న 83 లక్షలు విలువ చేసే నోట్ల కట్టలతో ఉన్న సూట్‌కేసు డ్రైవర్ వద్ద కనిపించింది. ఆ సొమ్మును దిండుకల్ ఎన్నికల కార్యాలయానికి తీసుకెళ్లి సరి చూశారు. ఎన్నికల్లో ఓటర్లకు ఇవ్వడానికి తీసుకెళుతున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మదురైలో: మదురై జిల్లా ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ నాట్రా మంగళంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు జరిపారు. ఆ సమయంలో సరైన ఆధారాలు లేకుండా కారు లో తీసుకెళుతున్న 31 లక్షలను స్వాధీనం చేసుకుని ట్రెజరీకి పంపారు. ఆ సొమ్మును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె.వీరరాఘవరావు పరిశీలించి వాటిని ట్రెజరీలో ఉంచారు. -
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగ్ కలకలం
హైదరాబాద్: ప్రయాణీకులతో అత్యంత రద్దీగా ఉండే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. బ్యాగ్ విషయాన్ని గమనించిన ప్రయాణీకులు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అధికారులు వెంటనే అప్రమత్తమైయ్యారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందితోపాటు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి బ్యాగ్‌ను తనిఖీలు చేస్తున్నారు.